అధిక దిగుబడినిచ్చే సజ్జ ‘ధనశక్తి’!
సాగుబడి: ఆరుద్ర కార్తె (జూన్ 22 నుంచి)
పశ్చిమ ఆఫ్రికాలో పుట్టిన సజ్జ పంటను 3 వేల ఏళ్ల క్రితం నుంచే మన రైతులు సాగు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు సజ్జ రొట్టెను ప్రతి రోజూ తింటున్నారు. ఈ నేపధ్యంలో కరువును, వేడిని, చౌడును తట్టుకుంటూ అధిక దిగుబడినివ్వడంతోపాటు వినియోగదారుల్లో రక్తహీనతను అతి త్వరగా తగ్గించే సరికొత్త సజ్జ వంగడాన్ని హైదరాబాద్‌లోని ‘ఇక్రిశాట్’ శాస్త్రవేత్తలు రూపొందించారు. తిరిగి వాడుకోదగిన ఈ సూటిరకం వంగడం పేరు ‘ఐసీటీపీ-8203ఎఫ్‌ఈ’. దీన్నే ‘ధనశక్తి’ అని పిలుస్తున్నారు. నిజానికి ‘ఐసీటీపీ-8203’ అనే సజ్జ వంగడం అందుబాటులోకి వచ్చి చాలా ఏళ్లయింది.
ఈ వంగడాన్ని తీసుకొని.. మరింత ఎక్కువ ఐరన్‌ను అందించే విధంగా ‘ధనశక్తి’ని శాస్త్రవేత్తలు రూపొందించారు. బయోఫోర్టిఫికేషన్ అనే కొత్త పద్ధతిని అవలంభించి దేశంలోనే మొట్టమొదటిగా రూపొందిన తొలి వంగడం ఇదే. గత ఏడాది ఈ వంగడాన్ని వివిధ రాష్ట్రాల్లోని 30 వేల మంది రైతులకిచ్చి పండించి చూశారు. ఈ ఏడాది ఈ వంగడాన్ని దేశవ్యాప్తంగా రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ‘ఐసీటీపీ-8203’ కన్నా ధనశక్తి 11 శాతం అధిక దిగుబడినిచ్చిందని ‘ఇక్రిశాట్’ శాస్త్రవేత్త డా. ఎం గోవిందరాజ్ ‘సాక్షి’తో చెప్పారు. 12-16 ఏళ్ల వయసున్న విద్యార్థులకు ఈ సజ్జ పిండితో చేసిన రొట్టెను రోజూ మధ్యాహ్న భోజనంలో తినిపిస్తే.. 4 నెలల్లోనే రక్తహీనతను అధిగమించగలగడం విశేషంగా చెబుతున్నారు. రోజుకు 200 గ్రాముల ‘ధనశక్తి’ సజ్జ పిండిని ఆహారంగా తీసుకుంటే.. రోజువారీగా పిల్లలకు అవసరమైన ఐరన్ 100%, మహిళలకు అవసరమైన ఐరన్ 42%, పురుషులకు కావాల్సిన ఐరన్ 82% మేరకు అందుతున్నట్లు భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రకటించింది.