సాగుబడి
ఈ వారం వ్యవసాయ సూచనలు
వరి: రబీ వరి కోత దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో దోమ పోటు ఉధృతంగా ఉంది. దీని నివారణకు బూప్రోపెజిన్ 1.6 మి.లీ. లేక ఇతోఫెన్‌ప్రాక్స్ 2.0 మి.లీ. లేక ఎసిఫేట్ 1.5 గ్రా. లేక ఇమిడాక్లోప్డ్ ్రప్లస్ ఎధిప్రోల్ 80 డబ్ల్యూజి 0.25 గ్రా. లీటరు నీటికి కలిపి వాడాలి. వెన్నులోని 80 శాతం గింజలు పక్వానికి వచ్చిన తర్వాత, కాండం పచ్చగా ఉన్నప్పుడే కోత కోయటం మంచిది.
వేసవి వరిలో ఎలుకల యాజమాన్యం: పిలక దశ నుంచి వరిలో నష్టం కలిగించే ఎలుకలను బ్రోమోడయోలోన్ ఎరతో కాని లేదా జింకు ఫాస్ఫైడ్ ఎరతో కాని లేదా బర్రో ఫ్యూమిగేటర్ ద్వారా గాని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు.
ఎలుకలను మచ్చిక చేసుకోవాల్సిన అవసరం లేని బ్రోమోడయోలోన్ ఎరను 10-15 గ్రా. పొట్లాలుగా కట్టి కన్నంలో ఒకటి చొప్పున పెట్టాలి.
ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పంటకాలంలో ఒక్కసారి మాత్రమే 10 గ్రా. జింకు ఫాస్ఫైడ్ ఎరను వాడాలి. దీనికై ముందుగా విషం లేని ఎరను 20 గ్రా. కన్నానికి ఒకటి చొప్పున 2 రోజులు పెట్టి ఎలుకలను మచ్చిక చేసుకోవాలి.
పై పద్ధతులు వీలుకాని పరిస్థితిలో కన్నం చుట్టూ ఉన్న పగుళ్లను మూసివేసి బర్రోఫ్యూమిగేటర్ ద్వారా పొగను ప్రతి కన్నంలో కనీసం 3 నిమిషాలు వదిలి ఎలుకలను నివారించుకోవచ్చు.
పెసర, మినుము: గోదావరి డెల్టా ప్రాంతంలో రబీ వరి తరువాత మూడో పంటగా మార్చి ఆఖరు నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు మినుము విత్తుకోవచ్చు. కొబ్బరి, పండ్ల తోటల్లో అంతరపంటగా అవకాశం ఉన్న చోట నీటి వసతి గల అన్ని ప్రాంతాల్లో ఏ పంటల సరళిలోనైనా వేసవిలో మినుము సాగుచేయవచ్చు.
మామిడి: నీటి వసతి ఉన్న చోట పిందె దశలో నీరు పెట్టుకోవాలి.
నాఫ్తలిన్ ఎసిటిక్ ఏసిడ్ (ప్లానోఫిక్స్) 2.5 మి.లీ. / 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా పిందె రాలకుండా చేయవచ్చు.
రాతి మంగు, తేనె మంచు పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 35 మి.లీ/ 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ఆకు, కాయమచ్చ తెగులు నివారించడానికి కార్బండిజమ్ 1 గ్రా/ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
శాస్త్రవేత్తల సలహాలకు ఉచిత ఫోన్ నంబర్లు
1100, 1800 425 1110
కిసాన్ కాల్ సెంటర్ :1551
తెల్లమచ్చల వైరస్‌కు ప్రత్యేక మందుల్లేవు!
అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల వెనామీ రొయ్యల చెరువులను తెల్లమచ్చల వైరస్ జబ్బు కొద్దిరోజులుగా అతలా కుతలం చేస్తోంది. అన్ని కోస్తా జిల్లాల్లో వెనామీ రైతులు దీనివల్ల నష్టపోతున్నారు. పక్షుల ద్వారా, నీటి ద్వారా ఇది వ్యాపిస్తోంది.
ఈ వైరస్ ప్రభావం వల్ల రొయ్యపిల్లలను ఉత్పత్తి చేసే హేచరీల్లోనూ ఫలితాలు సరిగ్గా లేవు. 10-20 రోజుల రొయ్య పిల్లలు కూడా చనిపోతున్నాయి. 50 పైసల పిల్లకు 90 పైసలు చెల్లించడానికి రైతులు సిద్ధపడినా ఆరోగ్యకరమైన పిల్లలు దొరకడం లేదు.
ఈ వైరస్‌ను నియంత్రించడానికి ప్రత్యేక మందులు/ రసాయనాలు లేవు. వారం తర్వాత దానంతట అదే సద్దుమణిగే అవకాశం ఉంది.
- ప్రొ. పి. హరిబాబు (98495 95355),
మత్స్య కళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా
మిడిమిడి జ్ఞానం.. మొదటికే మోసం!
చేపల వ్యాధులకు అనర్హులైన వ్యక్తులు మిడిమిడి జ్ఞానంతో చేసే వైద్యం అసలుకే మోసం తెస్తున్న విషయం రైతులు గమనించాలి.
చేపలకు అనేక వ్యాధులు ఉన్నప్పుడు, వాతావరణం, నీటి గుణాలు ప్రతికూలంగా ఉండి చేపల మరణాలు పెరుగుతున్నప్పుడు, మేత అరకొరగా తింటున్నప్పుడు, వ్యాధులు తగ్గి మళ్లీ మళ్లీ తిరగబెడుతున్నప్పుడు.. చెరువుల్లో పరిస్థితి సంక్లిష్టంగా ఉంటుంది.
ప్రధాన వ్యాధులను గుర్తించి, తగిన మందులు, రసాయనాలను ఎంపికచేయడం, యాజమాన్య పద్ధతుల్లో మార్పులు సూచించడం అతిక్లిష్టమైన విషయాలు.
అర్హత లేని వారి సూచనలు పాటిస్తే చేపల మరణాలు తగ్గక ఎమర్జెన్సీ పట్టుబడులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. విచక్షణారహితంగా వాడే రసాయనాల వల్ల చేప మరింత బలహీనమై ఇతర వ్యాధులూ సోకవచ్చు. తొలిదశలోనే అర్హులైన నిపుణుల సలహా తీసుకోవడం మేలు.
- డా. రావి రామకృష్ణ (98480 90576),
సీనియర్ ఆక్వా శాస్త్రవేత్త, ఫిష్‌నెస్ట్, ఏలూరు
సంకరజాతి ఆవులకు టీకాలు తప్పనిసరి
వేసవిలో డెయిరీ ప్రారంభానికి 50-75% విదేశీ ఆవు లక్షణాలున్న సంకరజాతి ఆవులు మేలైనవి. మంచి గృహవసతి, చుట్టూ చెట్లు ఉంటే ఇవి బాగా రాణిస్తాయి.
వెన్న శాతం తక్కువైనా ఎక్కువ పాలిచ్చే ఆవుల్ని ఎంపిక చేసుకోవాలి.
సంకరజాతి ఆవులు ఎక్కువ పాలిస్తాయి కాబట్టి ఒత్తిడికి లోనవుతుంటాయి. సకాలంలో తప్పనిసరిగా టీకాలు వేయించి వ్యాధినిరోధక శక్తిని ఇనుమడింపజేయాలి.
పచ్చిమేత అందుబాటులో లేనప్పుడు ప్రత్యామ్నాయంగా దాణా వాడుకోవాలి. ఐదారు కిలోల పచ్చిమేతకు కిలో దాణా లెక్కన పాడి పశువులకు వాడాలి. పచ్చిమేతలో విటమిన్ ఏ(కెరటిన్) ఉంటుంది. పచ్చిమేతను ఆరు నెలలు మేసిన పశువు కాలేయంలో ఏడాదికి సరిపోను కెరటిన్ నిల్వ ఉంటుంది.
- డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506),
అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, సాక్షి (సాగుబడి),
సాక్షి టవర్‌స, 6-3-249/1,
రోడ్డు నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్- 500 034