ప్రకృతిసేద్యం పండుగైన చోట! | Nature Cultivation | Sakshi
Sakshi News home page

ప్రకృతిసేద్యం పండుగైన చోట!

Published Tue, Jul 5 2016 12:56 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

ప్రకృతిసేద్యం పండుగైన చోట! - Sakshi

ప్రకృతిసేద్యం పండుగైన చోట!

- మారుమూల పల్లెలో ప్రకృతి సేద్యానికి దిక్సూచిగా మారిన మహిళా రైతు
- టమాటా, వేరుశనగ, వరి, చిరుధాన్యాలతోపాటు  ఏడాదంతా అంతరపంటలుగా కూరగాయల సాగు
- నేరుగా వినియోగదారులకు అమ్ముతూ అధిక నికరాదాయం పొందుతున్న వైనం
- గ్రామంలో సగం మంది రైతులది ఇప్పుడు అదే దారి..
 
 వైఎస్సార్ జిల్లాలో మారుమూల మెట్ట ప్రాంతంలో ఉంది చిన్నమండెం గ్రామం. యశోదమ్మ అనే మహిళా రైతు ‘సెర్ప్’ సాయంతో పదేళ్ల క్రితమే ప్రకృతి సేద్యం నేర్చుకుని.. స్థిరంగా అధిక నికరాదాయం పొందుతూ వ్యవసాయాన్ని పండుగలా మార్చుకున్నారు. మొదట ఆమెను ఎగతాళి చేసిన తోటి రైతులే చాలా మంది ఇప్పుడు ఆమె బాటన నడుస్తున్నారు. కరువు కాలంలోనూ ఏడాది పొడవునా పంటలు పండించుకుంటూ నిరంతర ఆదాయం పొందుతున్నారు.. వరి, టమాటా, రాగులు, సజ్జలు, ఉలవలు, జొన్నలు, వేరుశనగ వంటి పంటలను వారు సాగు చేస్తున్నారు. ఇదీ యశోదమ్మ విజయగాథ..
 
 మహిళా రైతు అప్పన్నగారి యశోద పదోతరగతి చదివారు. వైఎస్సార్ జిల్లా చిన్నమండెం మండలం చిన్నర్సుపల్లె ఆమె స్వగ్రామం. తమకున్న నాలుగెకరాల పొలం పనుల్లో భర్త వేణుగోపాల్‌కు సహకరించేవారు. 2004లో కరవు దెబ్బకు వ్యవసాయం కుదేలైంది. మేత లేక పశువులను అమ్మేసుకున్నారు. గడ్డుకాలం అంటే ఎలా ఉంటుందో రైతులకు అనుభవంలోకి వచ్చిన కాలం అది. అటువంటి పరిస్థితుల్లో అనంతపురంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై 2004లో జరిగిన 8 రోజుల శిక్షణా కార్యక్రమానికి యశోద హాజరయ్యారు. ఇతర శాస్త్రవేత్తలతోపాటు పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయోద్యమ సారధి సుభాష్ పాలేకర్ కూడా ఆ శిబిరంలో రైతులకు శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ ఆమె కుటుంబంలో వెలుగులు నింపటమే కాక, తోటి రైతులకూ స్ఫూర్తినిచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది.  
 
 తొలి ఏడాదే ఆశావహ ఫలితాలు..
 2005లో స్వల్పకాలిక వరి వంగడం రాశి సాగుతో ప్రకృతి సేద్యంలో తొలి అడుగేశారు యశోద. 10 సెంట్ల మడిని ప్రకృతి సేద్యంలో వరిసాగు కోసం ఎంచుకున్నారు. ఇది చూసిన తోటి రైతులు ‘చదువుకున్న పిచ్చోళ్లు ఎరువులు వేయకుండా పండిస్తారంట.. దిగుబడులు తీసి.. డబ్బు సంపాదించడం జరిగేపనేనా?’ అని ఎద్దేవా చేశారు. వారి మాటలను పట్టించుకోకుండా యశోద పనిలో నిమగ్నమయ్యారు. 15 రోజుల నారును శ్రీవరి విధానంలో నాటుకున్నారు. నాటిన 15 రోజులకు 15 పిలకలు వచ్చాయి. రసాయన సేద్యం చేసిన పొలాల్లో అప్పటికి 5 పిలకలు మాత్రమే వచ్చాయి. మరో 5 రోజులకు పిలకల సంఖ్య 25కు చేరింది. నెల తిరిగే సరికి వీటి సంఖ్య 78కి చేరింది. కోత దశలో వచ్చిన తుపాను గాలులకు రసాయన సేద్యం చేసిన పొలాల్లోని వరి పైరు పడిపోయింది. ధాన్యం గింజలు మొలకలొచ్చాయి. కోతకు ఇబ్బందయింది. అయితే, యశోద ప్రకృతి సేద్యం చేపట్టిన మడిలోని పైరు తీవ్ర గాలులకు నిలదొక్కుకోవడం యశోదను కూడా ఆశ్చర్యపరచింది. తాను ఎంచుకున్న మార్గం సరైనదనే నమ్మకం కలిగింది.

 2005లోనే వరితో పాటు ప్రకృతి సేద్యంలో టమాటా సాగును ఆమె చేపట్టారు. వారికున్నది రెండెకరాల మెట్ట పొలం. ప్రకృతి సేద్యంలో అరెకరం టమోటా సాగుకు మొత్తం రూ. 2 వేల లోపే ఖర్చయ్యింది. రూ. 57 వేల నికరాదాయం లభించింది. రసాయన సేద్యంలో ఎకరంన్నర  టమాటా సాగుకు రూ. 35 వేల వరకు ఖర్చయ్యింది. వచ్చిన ఆదాయం ఖర్చులకే సరిపోయింది. ఆ విధంగా యశోదకు ప్రకృతి సేద్యం ప్రయోజనం ఏమిటో అనుభవపూర్వకంగా బోధపడింది. ఆ తర్వాత రెండెకరాల్లోనూ ప్రకృతి వ్యవసాయమే చేపట్టారు. భూమి మెత్తగా మారింది. ఆ మట్టిలో తిరుగుతుంటే జొన్న అన్నంలో పెరుగు కలుపుకుని తింటుంటే కలిగే కమ్మటి భావన కలిగిందంటారు యశోద.
 
 ఖర్చు తగ్గింది.. అధిక ధర వచ్చింది..
 గతేడాది ప్రకృతి సేద్యంలో మూడెకరాల్లో వేరుశనగ పంటను యశోద సాగు చేశారు. పశువుల ఎరువు జీవామృతం, వేపపిండి, కషాయాల వాడకం వల్ల ఖర్చు తగ్గింది. 100 బస్తాల (బస్తా 50 కిలోలు) వేరుశనగ దిగుబడి  వచ్చింది. బస్తా రూ. 2500 చొప్పున వ్యాపారులకు విక్రయించారు. 30 బస్తాల కాయలను మరపట్టించి.. వేరుశనగ గింజల ప్యాకెట్లను చెన్నై వ్యాపారులకు విక్రయించారు. మార్కెట్ ధరకన్నా కిలోకు రూ. 15 అధిక ధర లభించింది. మొత్తం రూ. 1.10 లక్షల ఆదాయం వచ్చింది. విత్తనాల కొనుగోలుకు రూ. 20 వేలు, కూలీలకు మరో రూ. 20 వేలు ఖర్చయ్యాయి. ఖర్చులు పోను రూ. 70 వేల నికరాదాయం లభించింది.

 సార్వా పంటగా మూడెకరాల్లో వరిని సాగు చేశారు. ఎకరాకు 42 బస్తాల దిగుబడి వచ్చింది. మార్కెట్ రేటు కన్నా బస్తా రూ. 200 అధిక ధరకు విక్రయించారు. ఎకరాకు రూ. 60 వేల ఆదాయం లభించింది. నాట్లు, కోత కోసేందుకు కూలీలకు ఎకరాకు రూ. 5 వేలు ఖర్చయ్యింది. ఎకరాకు రూ. 55 వేల నికరాదాయం లభించింది. దాళ్వాలో ఎకర ం పొలంలో 40 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది.  

 అరెకరంలో రాగి పంటను మొక్కలు నాటు వేసే పద్ధతిలో సాగు చేస్తే ఎనిమిది బస్తాల (బస్తా 40 కిలోలు) దిగుబడి వచ్చింది. బస్తా రూ. 1,600 చొప్పున విక్రయించారు. అప్పుడు ఉన్న మార్కెట్ ధర కన్నా బస్తాకు రూ. 100 అధిక ధర  లభించింది. పెట్టుబడి ఖర్చులన్నీ పోను రూ.12 వేల ఆదాయం లభించింది.
 
 ఏడాది పొడవునా కూరగాయల సాగు
 సీజనల్ పంటలతోపాటు వివిధ రకాల కూరగాయ పంటలను యశోద ఏడాదంతా సాగు చేస్తున్నారు. తాను పండించిన కూరగాయలను పొలం వద్ద విక్రయించటంతో పాటు.. నేరుగా గ్రామంలోని వినియోగదారుల ఇళ్లకు కూడా సరఫరా చేస్తున్నారు. తొలినాళ్లలో మార్కెట్ ధర కన్నా కిలోకు ఒక్క రూపాయి ఎక్కువ ఆదాయం వచ్చేది. ప్రస్తుతం పొలం వద్ద కొనుగోలు చేసేవారి నుంచి మార్కెట్ రేటు కన్నా రూ. 5, ఇంటికి పంపితే కిలోకు రూ. 10 అధికంగా ఆదాయం వస్తోంది. మిగిలిన కూరగాయలను యశోదమ్మ స్వయంగా గ్రామంలోని మార్కెట్లో విక్రయిస్తున్నారు. కొన్ని కూరగాయలను కడపలో సేంద్రియ ఉత్పత్తులు విక్రయించే దుకాణానికి కూడా సరఫరా చేస్తున్నారు.
 
 కందకాలు, నీటి కుంటలతో జలకళ
 వర్షపు నీటి సంరక్షణకు పొక్లెయిన్‌తో పొలం చుట్టూ మీటరు వెడల్పు, మీటరు లోతు కలిగిన కందకాలను యశోదమ్మ తవ్వించారు. 2012లో ఉపాధి హామీ పథకం ద్వారా తమ పొలంలో రెండు నీటి కుంటలను కూడా తవ్వించారు. దీంతో గట్టి వర్షం ఒక్కటి పడినా ఏడాదంతా ఫారం పాండ్‌లో నీళ్లు నిల్వ ఉంటున్నాయి. బెట్ట సమయంలో నీటిని ఇంజిన్‌తో తోడి పంటలకు అందిస్తున్నారు. నడి వేసవిలోను పశువుల దాహర్తి తీరుతోంది.  
 
 ప్రకృతి సేద్య బాటన సగం మంది రైతులు
 ఒక మహిళా రైతు సేద్యంలో సాధిస్తున్న వరుస విజయాలు సాటి రైతుల్లో ఆసక్తిని పెంచాయి. 2006లో ముగ్గురు రైతులు ప్రకృతి సేద్యాన్ని చేపట్టగా నిలకడగా వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం గ్రామంలో మొత్తం రైతుల సంఖ్య 110 వరకు ఉండగా.. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల సంఖ్య 57. ఆసక్తి ఉన్న ప్రతి రైతుకు యశోద జీవామృతం, కషాయాల తయారీలో శిక్షణనిచ్చింది. వారంతా ప్రకృతి వ్యవసాయాన్నే నమ్ముకుని, రసాయనాలు, పురుగు మందుల వాడకాన్ని పూర్తిగా మానేశారు. కొందరు తమ పొలం మొత్తంలో ప్రకృతి వ్యవసాయం చేస్తుండగా మరికొందరు కొంత భాగంలో చేస్తున్నారు. వరి, టమాటా, రాగులు, సజ్జలు, ఉలవలు, జొన్నలు, వేరుశనగ వంటి పంటలను వారు సాగు చేస్తున్నారు. కరవు పరిస్థితుల్లో ప్రకృతి సేద్యంతో రసాయన ఎరువులు, పురుగుమందు ఖర్చు తప్పింది. రైతు స్వావలంబన అనే కల వాస్తవ రూపం దాల్చింది.

 అన్నింటికి మించి వారు ప్రకృతి సేద్యం వల్ల పూర్తి సంతృప్తితో జీవిస్తున్నారు. ఇప్పుడు యశోద విజయం వ్యక్తిగతం కాదు. అది గ్రామ విజయంగా మార్పు చెందింది. పదేళ్ల క్రితం పరిస్థితులను తలచుకొని.. ప్రకృతిసేద్యం నిస్సందే హంగా తమ తలరాతను మార్చిందని చిన్నర్సుపల్లె రైతులు సగర్వంగా చెపుతున్నారు. పొరుగు గ్రామాల రైతులు తమ గ్రామం కూడా చిన్నర్సుపల్లె బాటలో నడవాలని కోరుకుంటున్నారు.  
 - దుగ్గమ్మగారి నాగభూషణ రెడ్డి సాక్షి, రాయచోటి గ్రామీణం, వైఎస్సార్ జిల్లా  
 
 కొద్ది భూమిలో ప్రారంభించాలి...
 దిగుబడి బాగా రావటం, ఖర్చులు తగ్గటంతో మేము మొత్తం ఆరెకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నాం. లాభదాయకమైన ఈ పద్ధతులను ప్రతి రైతూ కష్టం అనుకోకుండా ఆచరించాలి. అప్పుడే రైతు ఆర్థికంగా నిలదొక్కుకుని తలెత్తుకు తిరగగలడు. మా గ్రామంలో తొలుత సందేహించిన రైతులూ.. ఇప్పుడు ప్రకృతి సేద్యం చేస్తున్నారు. తొలుత కొద్ది విస్తీర్ణంలో ప్రకృతి సేద్యం ప్రారంభించాలి.
 - అప్పన్నగారి యశోద (88979 31488) ఆదర్శ మహిళా రైతు, చిన్నర్సుపల్లె, చిన్నమండెం మండలం, వైఎస్సార్ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement