Bajra crop
-
సజ్జ పంట పరిశీలన
కణేకల్లు : తుంబిగనూరు గ్రామంలో దెబ్బతిన్న సజ్జపంటను జేడీఏ శ్రీరామమూర్తి, రాయదుర్గం ఏడీఏ మద్దిలేటి, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జాన్‌సుధీర్, రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుజాత, కణేకల్లు ఏఓ శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు. బేయర్, హైటెక్ కంపెనీల సహకారంతో గ్రామంలో 500 ఎకరాల్లో సాగు చేసిన సజ్జ ఫౌండేషన్ సీడ్ దెబ్బతినడంపై పత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో జేడీఏ స్పందించి స్వయంగా పంటను పరిశీలించారు. మగవిత్తనం 2282, ఆడ విత్తనం 2281 రకం సాగు చేశామని, మగ మొక్కకన్నా ముందే ఆడ మొక్కలో కంకిలొచ్చి పంటక్రాస్కు నోచుకోకపోవడంతో పంట మొత్తం సర్వనాశనమైందని బాధిత రైతులు జేడీఏ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. -
అధిక దిగుబడినిచ్చే సజ్జ ‘ధనశక్తి’!
సాగుబడి: ఆరుద్ర కార్తె (జూన్ 22 నుంచి) పశ్చిమ ఆఫ్రికాలో పుట్టిన సజ్జ పంటను 3 వేల ఏళ్ల క్రితం నుంచే మన రైతులు సాగు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు సజ్జ రొట్టెను ప్రతి రోజూ తింటున్నారు. ఈ నేపధ్యంలో కరువును, వేడిని, చౌడును తట్టుకుంటూ అధిక దిగుబడినివ్వడంతోపాటు వినియోగదారుల్లో రక్తహీనతను అతి త్వరగా తగ్గించే సరికొత్త సజ్జ వంగడాన్ని హైదరాబాద్‌లోని ‘ఇక్రిశాట్’ శాస్త్రవేత్తలు రూపొందించారు. తిరిగి వాడుకోదగిన ఈ సూటిరకం వంగడం పేరు ‘ఐసీటీపీ-8203ఎఫ్ఈ’. దీన్నే ‘ధనశక్తి’ అని పిలుస్తున్నారు. నిజానికి ‘ఐసీటీపీ-8203’ అనే సజ్జ వంగడం అందుబాటులోకి వచ్చి చాలా ఏళ్లయింది. ఈ వంగడాన్ని తీసుకొని.. మరింత ఎక్కువ ఐరన్‌ను అందించే విధంగా ‘ధనశక్తి’ని శాస్త్రవేత్తలు రూపొందించారు. బయోఫోర్టిఫికేషన్ అనే కొత్త పద్ధతిని అవలంభించి దేశంలోనే మొట్టమొదటిగా రూపొందిన తొలి వంగడం ఇదే. గత ఏడాది ఈ వంగడాన్ని వివిధ రాష్ట్రాల్లోని 30 వేల మంది రైతులకిచ్చి పండించి చూశారు. ఈ ఏడాది ఈ వంగడాన్ని దేశవ్యాప్తంగా రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ‘ఐసీటీపీ-8203’ కన్నా ధనశక్తి 11 శాతం అధిక దిగుబడినిచ్చిందని ‘ఇక్రిశాట్’ శాస్త్రవేత్త డా. ఎం గోవిందరాజ్ ‘సాక్షి’తో చెప్పారు. 12-16 ఏళ్ల వయసున్న విద్యార్థులకు ఈ సజ్జ పిండితో చేసిన రొట్టెను రోజూ మధ్యాహ్న భోజనంలో తినిపిస్తే.. 4 నెలల్లోనే రక్తహీనతను అధిగమించగలగడం విశేషంగా చెబుతున్నారు. రోజుకు 200 గ్రాముల ‘ధనశక్తి’ సజ్జ పిండిని ఆహారంగా తీసుకుంటే.. రోజువారీగా పిల్లలకు అవసరమైన ఐరన్ 100%, మహిళలకు అవసరమైన ఐరన్ 42%, పురుషులకు కావాల్సిన ఐరన్ 82% మేరకు అందుతున్నట్లు భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రకటించింది.