కణేకల్లు : తుంబిగనూరు గ్రామంలో దెబ్బతిన్న సజ్జపంటను జేడీఏ శ్రీరామమూర్తి, రాయదుర్గం ఏడీఏ మద్దిలేటి, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జాన్‌సుధీర్, రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుజాత, కణేకల్లు ఏఓ శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు. బేయర్, హైటెక్ కంపెనీల సహకారంతో గ్రామంలో 500 ఎకరాల్లో సాగు చేసిన సజ్జ ఫౌండేషన్ సీడ్ దెబ్బతినడంపై పత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో జేడీఏ స్పందించి స్వయంగా పంటను పరిశీలించారు. మగవిత్తనం 2282, ఆడ విత్తనం 2281 రకం సాగు చేశామని, మగ మొక్కకన్నా ముందే ఆడ మొక్కలో కంకిలొచ్చి పంటక్రాస్‌కు నోచుకోకపోవడంతో పంట మొత్తం సర్వనాశనమైందని బాధిత రైతులు జేడీఏ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.