భవన నిర్మాణానికి సహకరించండి
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో రూ.32 కోట్లతో నూతనంగా చేపట్టిన భవన నిర్మాణ పనులకు కాంట్రాక్టర్లు సహకరించాలని మేయర్ కోనేరు శ్రీధర్ కోరారు. ఆయన బుధవారం భవన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరలో నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులకు పాక్షింకగా అడ్డంగా ఉన్న భవనానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అత్యాధునిక పరికరాలతో తొలగించాల్సిందిగా సూచించారు. చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్, ఈఈ బి.ఉదయ్‌కుమార్, డీఈ ఏఎస్‌ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ కాంప్లెక్స్ నిర్మాణ పనుల్లో పేచీ
ఎన్టీఆర్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది. మొదటి, రెండో అంతస్తు నిర్మాణానికి సంబంధించి ఇటుకలు, ఇసుక, ఐరన్, సెంట్రింగ్ సామాన్లను కింద వేసేందుకు వీల్లేదంటూ పార్కింగ్ కాంట్రాక్టర్ అడ్డు చెప్పడంతో నిర్మాణ పనులకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో భవన నిర్మాణ కాంట్రాక్టర్ జనార్దన్ బుధవారం మేయర్ కోనేరు శ్రీధర్‌ను కలిసి సమస్య వివరించారు. మెటీరియల్ డంప్ చేసుకునేందుకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన మేయర్ ఎస్టేట్స్ అధికారి కృష్ణమూర్తితో ఫోన్లో మాట్లాడారు. పార్కింగ్ కాంట్రాక్టర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డంప్ చేసిన మెటీరియల్‌ను ఎప్పటికప్పుడు పైకి తరలించుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పర్యవేక్షణ బాధ్యతలను ఈఈ ధనుంజయకు అప్పగించారు.