Mayor sridhar
-
సాక్షి విలేకరిపై మేయర్ అక్కసు
పటమట(విజయవాడ తూర్పు): విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్ మరోమారు తన నోటి దురుసుతనాన్ని ప్రదర్శిం చారు. ఈ సారి సాక్షి విలేకరిపై తన అక్కసు వెళ్లగక్కారు. సోమవారం సాక్షి విలేకరి మేయర్ చాంబర్లోకి వెళ్లగానే ‘కార్పొరేషన్‌కు ఎందుకు వస్తున్నారు...వ్యతిరేక వార్తలు రాయాలనుకుంటే తనను కలవటం ఎందుకంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా ఒక్క వార్త కూడా రాయరు.. ఇక ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటూ చిర్రుబుర్రులాడారు. కార్పొరేషన్లో చోటుచేసుకున్న అవినీతి, అధికార పార్టీ నాయకుల ప్రజావ్యతిరేక విధానాలపై సాక్షిలో వార్తలు రాస్తున్నారనే ఉద్దేశంతో విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటనలు, ఆగిపోయిన ప్రాజెక్టులు, తోటికార్పొరేటర్లతో మేయర్ కోనేరు శ్రీధర్ తీరు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు, స్థానిక ఎమ్మెల్యేలపై పొసగని వైనంపై అనేక కథనాలు సాక్షిలో ప్రచురితమయ్యాయి. ఇవన్నీ మనస్సులో పెట్టుకొని మేయర్ కోనేరు శ్రీధర్ విలేకరిపై ద్వేషాన్ని వెలిబుచ్చారు. మొదటి నుంచి వివాదాస్పదుడే... మేయర్ కోనేరు శ్రీధర్ కార్పొరేషన్ పాలక పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వివాదాస్పదుడిగానే వ్యవహరిస్తున్నారు. èగతంలో ఓ భవన నిర్మాణానికి సంబంధించి తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో వివాదం పెట్టుకున్నారు. సమీక్ష సమావేశాల్లో సైతం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇటీవల చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ అధికారి డాక్టర్ అర్జునరావుపై దురుసుగా ప్రవర్తించిన ఘటనలో ఆయన 10 రోజులు లాంగ్‌లీవ్‌పై వెళ్లారు. అంతకు ముందు కార్పొరేషన్ మేనేజర్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఆయన కార్పొరేషన్ ఇచ్చిన సిమ్‌కార్డును తిరిగి ఇచ్చేసి లాంగ్‌లీవ్‌పై వెళ్లారు. తోటి కార్పొరేటర్, కార్పొరేషన్ టీడీపీ ఫ్లోర్‌లీడర్ జి. హరిబాబుతో తలెత్తిన మనస్పర్థలతో కౌన్సిల్ సమావేశంలోనే హరిబాబు మేయర్తీరుపై ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని శ్రీధర్‌ను హెచ్చరించారు. కార్పొరేషన్‌లోని ప్రతి విభాగాన్ని, విభాగాధిపతులను ధూషిస్తూ తరచూ పతాక శీర్షికలెక్కే మేయర్ తన వైఖరి మార్చుకోవాలని ఇటీవల ఎంపీ కేశినేని నాని కూడా తనదైన శైలిలో మందలించటం చర్చనీయాంశంగా మారింది. ప్రశ్నిస్తే... శివాలు కార్పొరేషన్లో జరిగే దుబారాను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పే మేయర్ తన సొంతకారుకు కార్పొరేషన్ సొమ్ముతో ఇన్య్సూరెన్స్ చెల్లించటం వంటివి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై శివాలెత్తడం పరిపాటిగా మారింది. నగరంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్లు, కౌన్సిల్ సమావేశాల అంశాలపై సాక్షిలో రాస్తున్నందుకు మేయర్ తన విద్వేషాన్ని వ్యక్తం చేశారు. -
కొత్త ఏడాది మరింత అభివృద్ధి
విజయవాడ సెంట్రల్ : కొత్త సంవత్సరంలో మరింతగా నగరాభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తామని మేయర్ కోనేరు శ్రీధర్ పేర్కొన్నారు. మేయర్ తన చాంబర్లో శనివారం విలేకరులతో మాట్లాడారు. గడిచిన రెండున్నర ఏళ్ల పాలనలో సుమారు రూ.300 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. నగరపాలక సంస్థ నూతన భవనం పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతించినట్లు చెప్పారు. షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణంపై దృష్టి పెట్టినట్ల తెలిపారు. కాల్వల సుందరీకరణ, రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ వల్ల రానున్న కాలంలో నగర రూపురేఖలు మారతాయన్నారు. కృష్ణా పుష్కరాల నిధులు రూ.186 కోట్లతో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లను అభివృద్ధి చేశామని వివరించారు. డెప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు, ఫ్లోర్‌లీడర్ గుండారపు హరిబాబు, కార్పొరేటర్ హరనాథ్‌బాబు, మాజీ కార్పొరేటర్ కొట్టేటి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
భవన నిర్మాణానికి సహకరించండి
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో రూ.32 కోట్లతో నూతనంగా చేపట్టిన భవన నిర్మాణ పనులకు కాంట్రాక్టర్లు సహకరించాలని మేయర్ కోనేరు శ్రీధర్ కోరారు. ఆయన బుధవారం భవన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరలో నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులకు పాక్షింకగా అడ్డంగా ఉన్న భవనానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అత్యాధునిక పరికరాలతో తొలగించాల్సిందిగా సూచించారు. చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్, ఈఈ బి.ఉదయ్‌కుమార్, డీఈ ఏఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కాంప్లెక్స్ నిర్మాణ పనుల్లో పేచీ ఎన్టీఆర్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది. మొదటి, రెండో అంతస్తు నిర్మాణానికి సంబంధించి ఇటుకలు, ఇసుక, ఐరన్, సెంట్రింగ్ సామాన్లను కింద వేసేందుకు వీల్లేదంటూ పార్కింగ్ కాంట్రాక్టర్ అడ్డు చెప్పడంతో నిర్మాణ పనులకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో భవన నిర్మాణ కాంట్రాక్టర్ జనార్దన్ బుధవారం మేయర్ కోనేరు శ్రీధర్‌ను కలిసి సమస్య వివరించారు. మెటీరియల్ డంప్ చేసుకునేందుకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన మేయర్ ఎస్టేట్స్ అధికారి కృష్ణమూర్తితో ఫోన్లో మాట్లాడారు. పార్కింగ్ కాంట్రాక్టర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డంప్ చేసిన మెటీరియల్‌ను ఎప్పటికప్పుడు పైకి తరలించుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పర్యవేక్షణ బాధ్యతలను ఈఈ ధనుంజయకు అప్పగించారు. -
మేయర్‌ను అనర్హుడిగా ప్రకటించండి
నగరపాలక సంస్థ కమిషనర్‌కు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల వినతి విజయవాడ సెంట్రల్ : నగరపాలకసంస్థలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన మేయర్ కోనేరు శ్రీధర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కమిషనర్ జి.వీరపాండియన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఫ్లోర్‌లీడర్ బి.ఎన్.పుణ్యశీల ఆధ్వర్యాన కార్పొరేటర్లు గురువారం కమిషనర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా పుణ్యశీల మాట్లాడుతూ కేఎంకే ఈవెంట్ మేనేజ్మెంట్ (ప్రైవేట్ లిమిటెడ్)లో మేయర్ సతీమణి కోనేరు రమాదేవి గౌరవ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ యాక్టు సెక్షన్ 22 (హెచ్) ప్రకారం మేయర్ కుటుంబ సభ్యులు నగరపాలకసంస్థలో ఎటువంటి కాంట్రాక్ట్‌లు చేయకూడదని స్పష్టంగా ఉందని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంట్రాక్ట్‌లు దక్కించుకుంటున్న మేయర్ శ్రీధర్ పదవిలో కొనసాగేందుకు అర్హులు కాదన్నారు. కాబట్టి ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. కేఎంకే సంస్థకు కేటాయించిన కాంట్రాక్ట్‌లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో విచారణ నిర్వహించాలన్నారు. వాస్తవాలు తేలే వరకు ఆ సంస్థకు బిల్లులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీనిపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని కమిషనర్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు షేక్ బీజాన్బీ, పాల ఝాన్సీలక్ష్మి, టి.జమ్మలపూర్ణమ్మ, బుల్లా విజయ్, కె.దామోదర్ తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్ లోపు గృహ నిర్మాణాలు పూర్తిచేయండి
మేయర్ కోనేరు శ్రీధర్ విజయవాడ సెంట్రల్ : అజిత్‌సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వద్ద నిర్మాణం చేస్తున్న జెఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లను డిసెంబర్ నెలాఖరునాటికి పూర్తి చేయాలని మేయర్ కోనేరు శ్రీధర్ హౌసింగ్ అధికారుల్ని ఆదేశించారు. మంగళవారం గృహ నిర్మాణాలను పరిశీలించారు. రీ టెండర్లు పిలిచి రెండుప్యాకేజీల కింద 24 బ్లాక్‌ల నిర్మాణం చేపట్టినట్లు అధికారులు వివరించారు. ఎనిమిది బ్లాక్‌లు అక్టోబర్ నెలాఖరునాటికి పూర్తవుతాయన్నారు. మేయర్ మాట్లాడుతూ డిసెంబర్‌తో జెఎన్ఎన్యూఆర్ఎం గడువు ముగుస్తోందన్నారు. నిర్ణీతగడువులోపు గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఇందులో తేడా వస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. హౌసింగ్ ఈఈ బి.శ్రీనివాసరావు, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. -
పనులు చెత్తగా ఉన్నాయ్
విజయవాడ సెంట్రల్ : నగరంలో పారిశుధ్యం అధాన్నంగా ఉంది. అదనపు కార్మికుల్ని పెట్టారు. ఏం ప్రయోజనం? ఎక్కడి చెత్త అక్కడే ఉంది. డీసిల్టింగ్ సక్రమంగా జరగడం లేదు, ప్రైవేటు వర్కర్ల పనితీరు ఏం బాగోలేదు. బాగా పనిచేయగలిగే వాళ్ళను ఉంచి పని చేయని వాళ్ళను తీసేయండి అంటూ మేయర్ కోనేరు శ్రీధర్ ప్రజారోగ్యశాఖాధికారులకు క్లాస్‌తీశారు. సోమవారం 5, 6, 53 డివిజన్లలో పుష్కర పారిశుధ్య పనుల్ని ఆయన పరిశీలించారు. విశాలాంధ్ర రోడ్డు, మాచవరం డౌన్, దేవీనగర్ ప్రాంతాల్లో డీసిల్టింగ్ పనులు సక్రమంగా జరక్కపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అదనపు సిబ్బంది అందర్నీ ఒకేచోట ఎందుకు ఉంచారని అధికారుల్ని నిలదీశారు. వర్కర్లను గ్రూపులుగా విభజించాల్సిందిగా సూచించారు. పనిచేయని వాళ్ళను తొలగించి ఆ స్థానే కొత్తవాళ్ళను నియమించాల్సిందిగా ఆదేశించారు. డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు, 5వ డివిజన్ కార్పొరేటర్ కంచర్ల నాగశేషారాణి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్ తదితరులు పాల్గొన్నారు. –––– పర్యవేక్షణ శూన్యం పుష్కరాలకు నెలరోజుల ముందు నుంచే ప్రీ పుష్కర పనులు చేపట్టాలని కమిషనర్ జి.వీరపాండియన్ నిర్ణయించారు. నగరంలోని డ్రెయిన్లలో డీ సిల్టింగ్ పనులు చేపట్టడం, రహదారుల మార్జిన్లలో బ్రెష్ కొట్టడం, డివిజన్లలోని పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించాలని నిర్ణయించారు. ఈనెల 10వ తేదీ నుంచి అదనంగా వెయ్యి మంది కార్మికుల్ని ఏర్పాటు చేశారు. అదనపు సిబ్బందికి రోజుకు రూ.425 చెల్లించే విధంగా కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంట్రాక్టర్లు కాసుల కక్కుర్తి ప్రదర్శించి ఒక్కొక్కరికీ రూ.250 నుంచి రూ.300 ఇచ్చి మిగిలింది నొక్కేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కార్మికులు పనిపై శ్రద్ధ పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పారిశుధ్య పనుల్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన ప్రజారోగ్యశాఖాధికారులు కార్యాలయానికి పరిమితం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పనులు సక్రమంగా సాగడం లేదన్న విషయం మేయర్ పర్యటనలోనే బట్టబయలైంది. –––––––