మేయర్‌ను అనర్హుడిగా ప్రకటించండి
నగరపాలక సంస్థ కమిషనర్‌కు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల వినతి
విజయవాడ సెంట్రల్ :
నగరపాలకసంస్థలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన మేయర్ కోనేరు శ్రీధర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కమిషనర్ జి.వీరపాండియన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఫ్లోర్‌లీడర్ బి.ఎన్.పుణ్యశీల ఆధ్వర్యాన కార్పొరేటర్లు గురువారం కమిషనర్‌ను ఆయన చాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా పుణ్యశీల మాట్లాడుతూ కేఎంకే ఈవెంట్ మేనేజ్‌మెంట్ (ప్రైవేట్ లిమిటెడ్)లో మేయర్ సతీమణి కోనేరు రమాదేవి గౌరవ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ యాక్టు సెక్షన్ 22 (హెచ్) ప్రకారం మేయర్ కుటుంబ సభ్యులు నగరపాలకసంస్థలో ఎటువంటి కాంట్రాక్ట్‌లు చేయకూడదని స్పష్టంగా ఉందని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంట్రాక్ట్‌లు దక్కించుకుంటున్న మేయర్ శ్రీధర్ పదవిలో కొనసాగేందుకు అర్హులు కాదన్నారు. కాబట్టి ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. కేఎంకే సంస్థకు కేటాయించిన కాంట్రాక్ట్‌లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో విచారణ నిర్వహించాలన్నారు. వాస్తవాలు తేలే వరకు ఆ సంస్థకు బిల్లులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీనిపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని కమిషనర్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు షేక్ బీజాన్‌బీ, పాల ఝాన్సీలక్ష్మి, టి.జమ్మలపూర్ణమ్మ, బుల్లా విజయ్, కె.దామోదర్ తదితరులు పాల్గొన్నారు.