చెత్తే కదాని పారేస్తే..
-
కాలువలు, రోడ్లు, ఖాళీ స్థలాల్లో వేస్తే జరిమానా
-
బహిరంగ మల, మూత్ర విసర్జనకూ ఫైన్
-
జాతీయ పారిశుధ్య సర్వేకు కేంద్రం శ్రీకారం
-
కరీంనగర్, రామగుండంలో స్వచ్ఛ సర్వేక్షణ్–2017
కరీంనగర్ కార్పొరేషన్ : చెత్త కదా అని ఎక్కడ పడితే అక్కడ పారేస్తే ఇక మీదట చెల్లదు. ఒకవేళ అలా చేస్తే మీ జేబులు గుల్లకావడం ఖాయం. రెండో జాతీయ పారిశుధ్య సర్వేలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్వచ్ఛ సర్వేక్షణ్–2017 పేరుతో కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందుకోసం దేశంలోని లక్ష జనాభా దాటిన 500 నగరాలను ఎంపిక చేసింది. అందులో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు ఉన్నాయి. బహిరంగ ప్రాంతాల్లో మల, మూత్ర విసర్జన, చెత్త వేయడాన్ని అరికట్టేందుకు జరిమానాలు విధించాలని సూచించింది. ప్రజల అలవాట్లలో మార్పు తీసుకొచ్చేందుకు స్వయం సహాయక గ్రూపు మహిళల సేవలను వినియోగించుకోవాలని తెలిపింది. బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై చెత్త వేయడం, మల, మూత్ర విసర్జన చేయడం వంటి చర్యలకు పాల్పడితే అక్కడికక్కడే జరిమానాలు విధించే విధంగా కొత్త నిబంధనలను రూపొందించింది. ఇలా చేస్తే జాతీయ స్థాయి పారిశుధ్య ర్యాంకుల్లో ప్రోత్సాహక మార్కులను కేటాయిస్తామని కేంద్రం వెల్లడించింది.
మన స్థానం వెనక్కి...
2013–14 సంవత్సరానికి స్వచ్ఛ భారత్‌పై కేంద్రం సర్వే నిర్వహించింది. లక్ష జనాభా దాటిన నగరాలు, పట్టణాలను ఎంపిక చేసుకొని 476 పట్టణాల్లో సర్వే చేసింది. పరిశుభ్రత ర్యాంకుల్లో కరీంనగర్ 259వ ర్యాంకుకు పడిపోగా, రామగుండంకు 142వ ర్యాంకు వచ్చింది. ఆరుబయట మల, మూత్ర విసర్జన, మరుగుదొడ్ల ఉపయోగం, చెత్తను రోడ్లపై వేయడం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని సర్వే నిర్వహించారు.
స్మార్ట్‌కు చాలెంజ్...
కరీంనగర్ స్మార్ట్‌సిటీకి పరుగులు పెడుతున్న తరుణంలో స్వచ్ఛత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. స్మార్ట్‌సిటీల్లో పారిశుధ్యం, స్వచ్ఛభారత్‌కు పెద్దపీట వేస్తుండడమే ఇందుకు కారణం. స్మార్ట్ రేసులో ఉండాలంటే వందశాతం ఇంటింటి చెత్త సేకరణ కచ్చితంగా చేపట్టాల్సిన అవసరముంది. స్వచ్ఛభారత్‌పై ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యపరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. పారిశుధ్య పనులు కొంత మెరుగ్గానే ఉన్నా, చెత్త తరలింపులో వెనుకబడ్డట్టు కనిపిస్తోంది. సరైన ప్రణాళిక లేకపోవడంతో రోడ్లపైనే చెత్త దర్శనమిస్తోంది.
మరుగుదొడ్ల నిర్మాణంపై అశ్రద్ధ...
నగరంలో యూజీడీ పైపులైన్ లేని ప్రాంతాల్లో 133 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటివరకు 71 వరకు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 62 మరుగుదొడ్లు పూర్తిచేయాల్సి ఉంది. మురుగు కాల్వలు శుభ్రం చేయడం, రోడ్లు ఊడ్చడం వరకే పరిమితమవుతున్నారు. ఆరుబయట మల, మూత్ర విసర్జనను అరికట్టడంలో విఫలమవుతున్నారు.
పక్కాగా అమలు చేస్తేనే...
కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ స్థాయి పారిశుధ్య సర్వేలో ఉత్తమ ర్యాంకు సాధించాలంటే నిబంధనలు కఠినతరం చేయాల్సి ఉంది. నగరంలో ప్రతి రోజు 180 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోంది. చెత్తను ఊడ్చడం, తరలించడం, ఘన వ్యర్థాల పునర్వినియోగం, పబ్లిక్ టాయిలెట్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, బహిరంగ స్థలాల్లో చెత్త వేయడం, మల, మూత్ర విసర్జణపై కఠినంగా వ్యవహరిస్తూ జరిమానాలు వేసి ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ప్రజల్లో చైతన్యం వస్తేనే పారిశుధ్యం, స్వచ్ఛభారత్‌లో మంచి ర్యాంకు సాధించే అవకాశముంది. అధికారులు ఆ దిశగా సంస్కరణలు చేపట్టాలి.