పటమట(విజయవాడ తూర్పు): విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్ మరోమారు తన నోటి దురుసుతనాన్ని ప్రదర్శిం చారు. ఈ సారి సాక్షి విలేకరిపై తన అక్కసు వెళ్లగక్కారు. సోమవారం సాక్షి విలేకరి మేయర్ చాంబర్‌లోకి వెళ్లగానే ‘కార్పొరేషన్‌కు ఎందుకు వస్తున్నారు...వ్యతిరేక వార్తలు రాయాలనుకుంటే తనను కలవటం ఎందుకంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా ఒక్క వార్త కూడా రాయరు.. ఇక ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటూ చిర్రుబుర్రులాడారు. కార్పొరేషన్‌లో చోటుచేసుకున్న అవినీతి, అధికార పార్టీ నాయకుల ప్రజావ్యతిరేక విధానాలపై సాక్షిలో వార్తలు రాస్తున్నారనే ఉద్దేశంతో విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటనలు, ఆగిపోయిన ప్రాజెక్టులు, తోటికార్పొరేటర్లతో మేయర్ కోనేరు శ్రీధర్ తీరు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు, స్థానిక ఎమ్మెల్యేలపై పొసగని వైనంపై అనేక కథనాలు సాక్షిలో ప్రచురితమయ్యాయి. ఇవన్నీ మనస్సులో పెట్టుకొని మేయర్ కోనేరు శ్రీధర్ విలేకరిపై ద్వేషాన్ని వెలిబుచ్చారు.
మొదటి నుంచి వివాదాస్పదుడే...
మేయర్ కోనేరు శ్రీధర్ కార్పొరేషన్ పాలక పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వివాదాస్పదుడిగానే వ్యవహరిస్తున్నారు. èగతంలో ఓ భవన నిర్మాణానికి సంబంధించి తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో వివాదం పెట్టుకున్నారు. సమీక్ష సమావేశాల్లో సైతం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇటీవల చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ అధికారి డాక్టర్ అర్జునరావుపై దురుసుగా ప్రవర్తించిన ఘటనలో ఆయన 10 రోజులు లాంగ్‌లీవ్‌పై వెళ్లారు. అంతకు ముందు కార్పొరేషన్ మేనేజర్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఆయన కార్పొరేషన్ ఇచ్చిన సిమ్‌కార్డును తిరిగి ఇచ్చేసి లాంగ్‌లీవ్‌పై వెళ్లారు. తోటి కార్పొరేటర్, కార్పొరేషన్ టీడీపీ ఫ్లోర్‌లీడర్ జి. హరిబాబుతో తలెత్తిన మనస్పర్థలతో కౌన్సిల్ సమావేశంలోనే హరిబాబు మేయర్‌తీరుపై ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని శ్రీధర్‌ను హెచ్చరించారు. కార్పొరేషన్‌లోని ప్రతి విభాగాన్ని, విభాగాధిపతులను ధూషిస్తూ తరచూ పతాక శీర్షికలెక్కే మేయర్ తన వైఖరి మార్చుకోవాలని ఇటీవల ఎంపీ కేశినేని నాని కూడా తనదైన శైలిలో మందలించటం చర్చనీయాంశంగా మారింది.
ప్రశ్నిస్తే... శివాలు
కార్పొరేషన్‌లో జరిగే దుబారాను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పే మేయర్ తన సొంతకారుకు కార్పొరేషన్ సొమ్ముతో ఇన్య్సూరెన్స్ చెల్లించటం వంటివి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై శివాలెత్తడం పరిపాటిగా మారింది. నగరంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్లు, కౌన్సిల్ సమావేశాల అంశాలపై సాక్షిలో రాస్తున్నందుకు మేయర్ తన విద్వేషాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment