పనులు చెత్తగా ఉన్నాయ్
Published Mon, Jul 25 2016 9:41 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
విజయవాడ సెంట్రల్ : నగరంలో పారిశుధ్యం అధాన్నంగా ఉంది. అదనపు కార్మికుల్ని పెట్టారు. ఏం ప్రయోజనం? ఎక్కడి చెత్త అక్కడే ఉంది. డీసిల్టింగ్ సక్రమంగా జరగడం లేదు, ప్రైవేటు వర్కర్ల పనితీరు ఏం బాగోలేదు. బాగా పనిచేయగలిగే వాళ్ళను ఉంచి పని చేయని వాళ్ళను తీసేయండి అంటూ మేయర్ కోనేరు శ్రీధర్ ప్రజారోగ్యశాఖాధికారులకు క్లాస్‌తీశారు. సోమవారం 5, 6, 53 డివిజన్లలో పుష్కర పారిశుధ్య పనుల్ని ఆయన పరిశీలించారు.
విశాలాంధ్ర రోడ్డు, మాచవరం డౌన్, దేవీనగర్ ప్రాంతాల్లో డీసిల్టింగ్ పనులు సక్రమంగా జరక్కపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అదనపు సిబ్బంది అందర్నీ ఒకేచోట ఎందుకు ఉంచారని అధికారుల్ని నిలదీశారు. వర్కర్లను గ్రూపులుగా విభజించాల్సిందిగా సూచించారు. పనిచేయని వాళ్ళను తొలగించి ఆ స్థానే కొత్తవాళ్ళను నియమించాల్సిందిగా ఆదేశించారు. డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు, 5వ డివిజన్ కార్పొరేటర్ కంచర్ల నాగశేషారాణి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్ తదితరులు పాల్గొన్నారు.
––––
పర్యవేక్షణ శూన్యం
పుష్కరాలకు నెలరోజుల ముందు నుంచే ప్రీ పుష్కర పనులు చేపట్టాలని కమిషనర్ జి.వీరపాండియన్ నిర్ణయించారు. నగరంలోని డ్రెయిన్లలో డీ సిల్టింగ్ పనులు చేపట్టడం, రహదారుల మార్జిన్లలో బ్రెష్ కొట్టడం, డివిజన్లలోని పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించాలని నిర్ణయించారు. ఈనెల 10వ తేదీ నుంచి అదనంగా వెయ్యి మంది కార్మికుల్ని ఏర్పాటు చేశారు. అదనపు సిబ్బందికి రోజుకు రూ.425 చెల్లించే విధంగా కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంట్రాక్టర్లు కాసుల కక్కుర్తి ప్రదర్శించి ఒక్కొక్కరికీ రూ.250 నుంచి రూ.300 ఇచ్చి మిగిలింది నొక్కేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కార్మికులు పనిపై శ్రద్ధ పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పారిశుధ్య పనుల్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన ప్రజారోగ్యశాఖాధికారులు కార్యాలయానికి పరిమితం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పనులు సక్రమంగా సాగడం లేదన్న విషయం మేయర్ పర్యటనలోనే బట్టబయలైంది.
–––––––
Advertisement
Advertisement