‘చిల్లర రాజకీయాలను నేను పట్టించుకోను’
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. రైతులకు ఇచ్చే రూ.8వేల పథకంలో దొంగలు, దళారులకు అవకాశం ఇవ్వొద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు. (కాగా రైతులకు పెట్టుబడిగా ఎరువుల కోసం రెండు పంటలకు రూ.8వేలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే). అలాగే త్వరలో 500మంది అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ అధికారుల నియామకం చేస్తామన్నారు. వ్యవసాయ రంగమే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోందని కేసీఆర్ అన్నారు.
మంగళవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో రైతు హిత సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ,ఉద్యాన శాఖ అధికారులతో కేసీఆర్ సమావేశమై ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశానిర్దేశం చేశారు. త్వరలో గ్రామ రైతు సంఘాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సంఘాల్లో అవినీతిపరులకు చోటు కల్పించవద్దని ఏఈవోలను ముఖ్యమంత్రి సూచించారు.
ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలను తాను పట్టించుకోనని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతి నిర్ణయానికి ఓట్లతో ముడిపెట్టడం దిక్కుమాలిన చర్య అని ఆయన మండిపడ్డారు. తన ఫాంహౌస్‌లో లాగే ప్రతిరైతు పంటలు పండించాలని కేసీఆర్ సూచించారు. తనకు ప్రస్తుతం 64 ఏళ్లని, ఏ వ్యాపకం లేదని, పచ్చటి తెలంగాణను కళ్లారా చూడాలనేదే తన కోరిక అని ఆయన అన్నారు.