- జారీకాని ప్రీమియం చెల్లింపు నోటిఫికేషన్
- రైతాంగ సమస్యలపై దృష్టి సారించని సర్కార్
- పట్టనట్టు వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: అన్నదాతపై ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. రైతుల సంక్షేమ పార్టీ అని చెప్పుకుంటూ అధికారం చేజిక్కించుకున్న సర్కారు ఇప్పుడు వారి విషయాన్ని గాలికొదిలేసింది. ఖరీఫ్ సీజ న్ ప్రారంభమవుతున్నప్పటికీ ఇప్పటి వరకు అందుకు అవసరమైన ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదు. రైతు చైతన్య యాత్రలు నిర్వహించలేదు. యాంత్రీకరణ రాయితీ తేల్చలేదు. పంటల బీమా ఉందో లేదో స్పష్టత లేదు.
దీంతో రైతాంగంలో అయోమయం నెలకొంది. గత మూడేళ్లుగా వరుసగా నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు ఈ ఖరీఫ్ సీజన్ కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు వెన్నుదన్నుగా నిలిచి.. బీమా, ప్రత్యామ్నాయ పంటలు, కొత్త రుణాల అందించే కార్యక్రమాలు చేయాల్సిన ప్రభుత్వం కనీసం ఆ విషయాలపై దృష్టి సారించడం లేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
బీమా ఉన్నట్టా.. లేనట్లా.. : పంటల బీమాపై స్పష్టత లేకుండా పోయింది. ఏటా ఈ సమయానికి పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసేది. కాని ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లాలో మూడేళ్లుగా వాతావరణ బీమా అమలులో ఉంది. సాధారణంగా జూలై 15లోపు ప్రీమియం చెల్లించిన రైతులకు దీనిని వ ర్తింపజేస్తూ వస్తున్నారు. ఇందుకు నోటిఫికేషన్ మే నెలలోనే విడుదల చేసేవారు. కాని ఈసారి జూన్ నెలాఖరైనా నోటిఫికేషన్ ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వం రైతాంగ సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు.
జిల్లా ప్రజాప్రతినిధులు కూడా రైతులను పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వమేమో పంటల బీమాలో సమూలమైన మార్పులు తీసుకొస్తామని చెబుతోంది. బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. అది పూర్తయి అమల్లోకి వచ్చే సరికి ఈ ఏడాది పరిస్థితి ఏమిటన్నదే రైతాంగంలో అయోమయం నెలకొంది. గతేడాది జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో పాటు వరదలకు రైతులు నష్టపోయారు.
ఈ నష్టమెంతో ఇప్పటి వరకు తెలియకపోగా బీమా సంస్థ జిల్లాకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తుందో వెల్లడించలేదు. వాతావరణ బీమాను అమల్లోకి తీసుకొచ్చే సమయంలో మాత్రం సీజన్ పూర్తయిన నెల రోజుల్లోపు బీమా రైతుల ఖాతాల్లో జమవుతుందని ప్రకటించారు. కాని ఆచరణలో అది అమలు జరగడం లేదు.