బదిలీల.. లాబీయింగ్!
► ఎంపీడీఓల స్థానచలనానికి రంగం సిద్ధం
► కీలక స్థానాల కోసం ‘భారీ’ పైరవీలు
► సొంత మండలంపై కొందరి ఆసక్తి
► చక్రం తిప్పుతున్న ఓ యూనియన్ నేత
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ జిల్లాలో ఎంపీడీఓల బదిలీలు ఏటా జరుగుతున్నా ఈసారి మాత్రం ప్రత్యేకత సంతరించుకుంది. పలువురు రాజకీయ నేతల ముద్ర ప్రత్యక్షంగా కనపించే అవకాశం ఉంటుందని, అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు తమ మాట వినని వారిని సాగనంపి, సన్నిహితులకు పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. బదిలీలు పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నవారు ప్రాతిపదిక ఏమిటో తెలియజేయాలని, ఒకటి లేదా రెండు ఆప్షన్లు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
కొందరు ఎంపీడీఓలు తమ రాజకీయ పలుకుబడితో కీలకస్థానాలను పొందాలని ప్రయత్నిస్తుండడం సహచర అధికారుల్లో ఆవేదన రగిలిస్తోంది. అలాగే తమకు సన్నిహితంగా ఉండే వారికి కీలకపోస్టింగ్‌లు ఇప్పించేందుకు చక్రం తిప్పుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో బదిలీల పర్వం పూర్తికానుందన్న ప్రచారం నేపథ్యంలో పలువురు అధికారులు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, ఇతర ముఖ్యనేతలను కలిసి మంచి పోస్టింగ్ ఇప్పించాలని ప్రాధేయపడుతున్నట్లు తెలుస్తోంది.
సొంత మండలంపై కొందరి గురి!
సాధారణంగా ఎంపీడీఓల బదిలీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా సడలింపు ఇవ్వాల్సి ఉంది. అయితే పరిపాలన అవసరాల రీత్యా బదిలీలను జిల్లాస్థాయి అధికారులు చేసి ప్రభుత్వాని కి నోటిఫికేషన్‌ను పంపించే సౌలభ్యం ఉండడంతో బదిలీల పర్వాన్ని వేగవంతం చేశారు. ఏ ప్రాతిపదికన.. ఏ ఎంపీడీఓను ఎక్కడికి బ దిలీ చేస్తున్నారన్న అంశం మాత్రం ఇప్పటికీ చిదంబర రహస్యంగానే ఉంది. గెజిటెడ్‌స్థాయి అధికారులు తమ సొంత మండలాల్లో పనిచేయడానికి అవకాశం లేదని నిబంధనలు ఉన్నా కొందరు ఎంపీడీఓలు మాత్రం తమ సొంత మండలంలోనే పోస్టింగ్ పొం దేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలి సింది. ఉద్యోగ సంఘాల నాయకులుగా చె లామణి అవుతున్న ఓ ఇద్దరు అధికారులు ప్ర స్తుతం ఉన్న డిప్యూటేషన్ పోస్టులో కాకుండా మహబూబ్‌నగర్ ఎంపీడీఓగా, జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మండలానికి ఎంపీడీఓగా వెళ్లేందుకు భారీ పైరవీలే చేస్తున్నారని ఉద్యోగవర్గాల్లో ప్రచారం సాగుతోంది.
అంతా గోప్యంగానే..!
జిల్లాలో 64 మండలాలకు అనేక మండలాల్లో ఇన్‌చార్జ్‌లే ఎంపీడీఓలుగా వ్యవహరిస్తున్నారు. కేవలం 41మంది మాత్రమే రెగ్యులర్ పోస్టింగ్‌లో ఉన్నారు. అయితే వీరిలో 25నుంచి 28 మంది ఎంపీడీఓలకు బదిలీ తప్పేలాలేదు. అధికారపార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఇప్పటికే తమకు కావాల్సిన అధికారుల జాబితాను జిల్లా అధికారులకు, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులకు అందజేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఐదేళ్లుగా ఎంపీడీఓల బదిలీలు జరగలేదని ఉన్నతాధికారులు చెబుతుండగా 2014 సాధారణ ఎన్నికల సమయంలో మూడు నెలల పాటు జిల్లాకు చెందిన అనేక మంది ఎంపీడీఓలు ఇతర జిల్లాలకు బదిలీలపై వెళ్లారని, అవి సర్వీస్ రిజిస్టర్‌లో నమోదుకాలేదని పేర్కొంటున్నారు.
సాంకేతికంగా జిల్లాలో రెండేళ్లకు పై బడిన అధికారులకు మాత్రమే బ దిలీ ఉంటుందని పలువురు అధికారులు విశ్లేస్తున్నారు. బదిలీల వి షయమై తమకు సూత్రప్రాయంగానైనా జిల్లా అధికారులు సమాచారం ఇస్తారని, కానీ అత్యంత రహస్యంగాా ప్రక్రియ జరుగుతుండడంతో పోస్టింగ్ ఎవరికి ఎక్కడ వస్తుందోనని ఎంపీడీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈనెల 13వ తేదీలోగా ఎంపీడీఓల బదిలీలను పూర్తిచేసి ప్రభుత్వాన్ని పంపించాలని జిల్లా అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.