- కేపీఎస్‌సీ పోస్టుల వివాదంపై యథా తథ స్థితికి క్యాట్ ఆదేశం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్‌సీ) ద్వారా ప్రొబేషనరీ గెజిటెడ్ ఆఫీసర్లుగా 2011లో ఎంపికైన 362 మందిని పరిగణనలోకి తీసుకోరాదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టి వేయడానికి కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) నిరాకరించింది. దీనిపై దాఖలైన పిటిషన్‌ను బుధవారం విచారణకు స్వీకరించిన సందర్భంగా పలు ఆదేశాలను జారీ చేసింది.
కొత్త నియామకాలను చేపట్టకూడదని, అలాగే కొత్తగా నోటిఫికేషన్‌ను కూడా జారీ చేయకూడదని ఆదేశించింది. మూడు వారాల తర్వాత తదుపరి విచారణను చేపట్టనున్నట్లు తెలిపింది. కాగా కేపీఎస్‌సీ సభ్యులు అవకతవకలకు పాల్పడడం ద్వారా 362 మందిని ఎంపిక చేశారని ఆరోపణలు రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఎంపికలో అక్రమాలు జరిగాయని తేలడంతో రాష్ర్ట ప్రభుత్వం కేపీఎస్‌సీ పంపిన 362 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను తిరస్కరించింది. దీనిపై ఎంపికైన అభ్యర్థులు ఇక్కడి ఫ్రీడం పార్కులో దీర్ఘకాలం ఆందోళన చేపట్టారు. తదుపరి న్యాయ పోరాటానికి దిగారు.