- ఆ ఊసేఎత్తని సర్కార్
- జెడ్పీ తీర్మానాలూ బుట్టదాఖలు
- ఆందోళనలో అన్నదాతలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఖరీఫ్ కాలం పూర్తయి, రబీ పంటల సాగు షురువైనా సర్కారు మాత్రం కరువు జిల్లా ప్రకటన ఊసెత్తడం లేదు. రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన అన్నదాతలు సరైన దిగుబడులు రాక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కొందరు రైతులు ఏకంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం నుం చి మాత్రం ఎటువంటి ప్రకటన రావడం లేదు. అధికార యంత్రాంగం నివేదికలకే కాదు, జిల్లాలో ప్రజాప్రతినిధులంతా కొలువుదీరే జిల్లా పరిషత్‌లో చేసిన తీర్మానాలకూ మోక్షం లభించడం లేదు.
సాధారణంగా నవంబర్ నెలాఖరులోపే కరువుపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. డిసెంబర్ ముగిసి.. జనవరి ప్రారంభమైనా ఆ ఊసే లేదు. దీంతో రబీ పంటలు సాగు చేస్తున్న అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటిస్తే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన అన్నదాతలకు కొంతలో కొంతైనా ఉపశమనం ఉండేది.
పడిపోయిన దిగుబడులు..
జిల్లాలో ప్రధాన పంటల్లో ఒకటైన సోయా దిగుబడి దారుణంగా పడిపోయింది. ఎకరానికి పది నుంచి 11 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, కేవలం ఒకటిన్నర, నుంచి రెండు క్వింటాళ్లకు మించ లేదు. దీంతో విత్తనాలు, ఎరువుల ఖర్చు కూడా చేతికందలేదు. ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 1.11 లక్షల హెక్టార్లలో సోయాను సాగు చేసిన రైతులు నిండా మునిగారు. సోయా గింజలు సట్టల్లా ఉన్నాయి. తీవ్రంగా నష్టపోయిన సోయా రైతులను ఆదుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కలెక్టర్‌ను కలిసి గతంలో వినతిపత్రం అందజేశారు.
కానీ.. ఇప్పటివరకు సోయా రైతులను ఆదుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పత్తి రైతులదీ ఇదే పరిస్థితి. కాస్తో కూస్తో దిగుబడి వచ్చినా, మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు నిండా మునుగుతున్నారు. ఈ ధరకు విక్రయిస్తే పెట్టిన పెట్టుబడులు కూడా రావని ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
33 శాతం తక్కువ వర్షపాతం నమోదు..
ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువ నమోదైంది. 998 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం కాగా కేవలం 737 మి.మీలు మాత్రమే నమోదైంది. సాధారణం కంటే 33 శాతం తక్కువ కురిసిందని అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో పేర్కొన్నారు. అలాగే జూన్, జూలై మాసాల్లో ఏకంగా డ్రైస్పెల్‌లు నమోదయ్యాయి. బజార్‌హత్నూర్, నార్నూర్, బెజ్జూరు, నెన్నెల తదితర మండలాల్లో అతితక్కువ వర్షపాతం నమోదైంది. దీనికితోడు విద్యుత్ కోతలతో కళ్లముందే పంటలు ఎండిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ పరిస్థితులను అధికారులు ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేకుండా పోయింది.
రబీపై ప్రభావం..
ఖరీఫ్ కరువు ప్రభావం రబీ పంటలపై తీవ్రంగా పడుతోంది. ఖరీఫ్‌లో తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొన్న అన్నదాతలు రబీ సాగుకు కాడి కిందపడేశారు. 90 వేల హెక్టార్లలో సాగు కావాల్సిన రబీ పంటలు ప్రస్తుతం 25 వేల హెక్టార్లకు మించలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఖరీఫ్‌లో 5.97 లక్షల హెక్టార్లకు గాను కేవలం 5.40 లక్షల హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగుచేశారు. ఈ పంటలు సరిగ్గా చేతికందక పోవడంతో రబీ పంటల సాగుకు రైతన్నలు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
అన్నదాత బలవన్మరణాలు..
జిల్లాలో 2014లో సుమారు 78 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అధికార యంత్రాంగం మాత్రం 51 మంది రైతుల ఘటనలను విచారించి కేవలం 18 మంది మాత్రమే రైతు ఆత్మహత్యలుగా గుర్తించింది. ఇందులో ఆత్మహత్యలు చేసుకున్న కేవలం 11 మంది రైతు కుటుంబాలకు మాత్రమే పరిహారం చెల్లించారు.
పంటల సాగు వ్యయం పెరిగి, దిగుబడులు పడిపోవడం, కళ్లముందే పంటలు ఎండిపోవడంతో తట్టుకోలేకపోతున్న అన్నదాతలు తనువు చాలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రబీలోనైనా అన్నదాతలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.