సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కరువు ఛాయలు అలముకున్నాయి. వ్యవసాయశాఖ బుధవారం ప్రభుత్వానికి అందజేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 17 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. ఈ నెలలో ఇప్పటివరకు ఏకంగా 82 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం. కొన్ని జిల్లాల్లోనైతే వంద శాతం లోటు నమోదైంది. పైపెచ్చు ఎండలు మండిపోతున్నాయి. అనేక జిల్లాల్లో సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ఖరీఫ్‌లో వేసిన పంటల పరిస్థితి అధ్వానంగా మారింది. మరోవైపు రబీలో పంటల సాగు విస్తీర్ణం సాగిల పడింది. రబీ మొదలైన తర్వాత ఈ 25 రోజుల్లో కేవలం నాలుగు శాతం మేర మాత్రమే పంటలు వేశారు.
ఈ యాసంగిలో మొత్తం 33.06 లక్షల ఎకరాల సాధారణ సాగు అంచనా ఉండగా, ఇప్పటి వరకు 1.22 లక్షల ఎకరాల్లో సాగు నమోదైంది. ఇందులో శనగ పంట 30 వేల ఎకరాల్లో, వేరుశనగ 70 వేల ఎకరాల్లో, మొక్కజొన్న 12 వేల ఎకరాల్లో వేశారు. గత రెండేళ్లుగా సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు నిండి జలకళను సంతరించుకునేవని, కానీ ఈసారి ఆ పరిస్థితులు లేకపోవడంతో సాగు అంచనాలను చేరుతుందా లేదా అన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రబీలో ఇప్పుడే కరువు ఛాయలు కనిపిస్తున్నందున మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది.
ఖరీఫ్ పంటలపై ప్రభావం...
పంట చేతి కందే సమయంలో వర్షాలు కురవకపోవడం, ఎండలు తీవ్రంగా ఉండటంతో పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రధానంగా చివరి దశలో ఉన్న పత్తి, కంది ఎండిపోతుండటంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు ఆశాజనకంగా కురవక పోవడంతో అనేక మెట్ట పంటలు ఎండిపోతున్నాయి. జూన్‌లో 15 శాతం అధిక వర్షపాతం నమోదైనా, జూలైలో 30 శాతం లోటు నమోదైంది. ఆగస్టులో 18 శాతం అధిక వర్షపాతం కురవగా, సెప్టెంబర్‌లో ఏకంగా 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
ఇక అక్టోబర్‌లో ఇప్పటివరకు ఏకంగా 82 శాతం లోటు నమోదైంది. మొత్తంగా ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు 16 శాతం లోటు రికార్డు అయింది. కీలకమైన సెప్టెంబర్‌లో వర్షాలు కురవకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. మొత్తం 584 మండలాలుంటే, ఏకంగా 320 మండలాల్లో వర్షపాతం కొరత వేధిస్తుంది. ఎండల తీవ్రత, వర్షాభావం, గులాబీ పురుగు కారణంగా పత్తి దిగుబడి పడిపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అంచనా ప్రకారం 35 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి జరగాల్సి ఉండగా, కేవలం 30 లక్షల టన్నుల లోపు మాత్రమే ఉండొచ్చని అంటున్నారు. ఎండలు తీవ్రం కావడంతో గింజ పట్టే దశలో ఉన్న కంది పరిస్థితి దారుణంగా మారింది. లక్షలాది రూపాయలు అప్పులు చేసి పంటలను సాగు చేస్తే నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
కరువు ఛాయలు
Published Thu, Oct 25 2018 2:53 AM | Last Updated on Thu, Oct 25 2018 2:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment