వానమ్మా.. రావమ్మా!
అన్నదాత చూపు.. ఆకాశం వైపు
- వర్షాకాలం ఆరంభమైనా కానరాని వాన
- నిరాశపర్చిన నైరుతి రుతుపవనాలు
- వెలవెలబోతున్న జలాశయాలు
- ఆందోళన చెందుతున్న రైతులు
‘‘వానమ్మా.. ఓ వానమ్మా.. యాడున్నవమ్మా..! తొలకరి జల్లులతో మురిపించావు.. నల్లటి మబ్బులతో మరిపించావు. హమ్మయ్యా.. ఈయేడు నీళ్లకు తిప్పలు ఉండవని సంబురపడుతుండగనే తలతిప్పుకు పోయావు. పోనిలే.. విత్తు వేసుకునే సమయానికైనా వస్తావని ఎదురుచూస్తే.. పత్తా లేవు. పొలం దున్నడం మొదలుపెట్టి.. ఎరువులు, విత్తనాలు తెచ్చుకోవడం దాకా.. అరువుదెచ్చుకోనైనా అన్నీ సిద్ధం చేసుకున్నం. కానీ ఏం లాభం..? అసలు నువ్వేలేంది.. ఇవన్నీ ఉట్టియే కదా..! పొద్దుగల్ల లేవంగనే మొదలు మొగులునే జూస్తున్నం.. ఇయ్యళ్లన్న చినుకు రాకపోతుందా అని. ఓ దిక్కు విత్తుకునే కాలం గడిసిపోతుంది.. దినదినం పరేషాన్ ఎక్కువైతుంది. ఆరుగాలం కష్టాలు పడుతూ.. అందరికీ అన్నం పెట్టడమే తెలిసినోళ్లం.. మాపై కోపమెందుకే తల్లీ..!’’ అంటూ అన్నదాత కోటిఆశలతో ఆకాశంకేసి చూస్తున్నడు. చినుకు జాడలేక పోవడంతో చింత పెంచుకుంటున్నడు.
కామారెడ్డి/నిజాంసాగర్: కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రై తన్నను జాడలేని వానలు ఆందోళన పెట్టిస్తున్నా యి. ఓవైపు సాగు సమయం మించిపోతున్నా.. చినుకులు కురవకపోవడంతో కర్షకులు కలవరపడుతున్నారు. తొలకరి జల్లులతో మురిపించిన వర్షం.. మళ్లీ కనిపించడం లేదు. కారుమబ్బులు కమ్ముకుంటున్నా.. నీటిచుక్కలు మాత్రం కురవడం లేదు.
బండెడు ఆశతో ఎదురుచూసిన నైరుతి రుతుపవనాలు నిరాశపర్చాయి. గత ఏడాది ఈ సమయానికి వ ర్షాలు కురిసి.. పల్లెలు పంటసాగులో నిమగ్నమయ్యా యి. ప్రతీసారి జూన్ రెండోవారానికి వానలు వచ్చేవి. ఇప్పుడు మూడోవారం కావస్తున్నా వర్షాల జాడలేదు. సీజన్ తొలినాళ్లలోనే పరిస్థితులు ఇలా ఉంటే మున్ముం దు ఎలాంటి ఇబ్బందులుంటాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
విత్తు మొలకెత్తేనా..!
ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులు భూములను దు క్కి చేసి విత్తనాలను అలికినా.. విత్తు మొలకెత్తడం లేదు. చినుకులు రాకపోవడంతో మొలకలు రావ డం కష్టంగా మారనుంది. వరితో పాటు పలు పంటలు వర్షాధారంపైనే పండిస్తారు. సోయా, మొక్కజొన్న, పెసర, మినుము వంటి పంటల సాగుకూ సమయం ఆసన్నమైంది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, వ్యవసాయ బోరుబావుల కింద వరి సాగుకు సమాయత్తమైన రైతులు సైతం వర్షాల కోసం వేచిచూస్తున్నారు. నారుమడుల కోసం విత్తనాలను విత్తుకున్నారు.
పడిపోయిన వర్షపాతం
వర్షాకాలం మొదలై వారాలు గడుస్తున్నా వానల కురవకపోవడంతో జిల్లాలో వర్షపాతం నమోదు పడిపోయింది. జూన్ ఆరంభం నుంచి నెలాఖరు వరకు జిల్లాలో 181 మిల్లీమీటర్ల సాధార ణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 51.8 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్లు నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొన్నారు.
గత ఏడాది జూన్ మూడోవారం నాటికి జిల్లాలో 171.50 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో పోలిస్తే ఈ నెలలో రెండింతల కన్నా తక్కువగా వర్షం కురిసింది. నిరుడు మృగశిర కార్తె నుంచి వర్షాలు కురవడంతో జిల్లాలోని జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఈసారి జిల్లా వరప్రదాయని నిజాంసాగర్, ఉత్తర తెలంగాణ పెద్దదిక్కు శ్రీరాంసాగర్‌లతో పాటు ఏ ప్రాజెక్టులోనూ చుక్కనీరు చేరలేదు.
తగ్గనున్న సాగు విస్తీర్ణం..!
ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 3.98 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని జిల్లా అధికారులు అంచనా వేశారు. ఇందులో ముఖ్యంగా వర్షాధార పంటలైన సోయా, మొక్కజొన్న 2లక్షల హెక్టార్లలో సాగవుతాయని భావించారు. అయితే ఇప్పటి వరకు వర్షాల జాడలేకపోవడంతో వర్షాధార పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడనుంది. మరో వారం దాకా వర్షాలు కురవకుంటే వరి, సోయా పంటల సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గవచ్చని భావిస్తున్నారు. వరణుడి కరుణ కోసం గ్రామాల్లో దేవతామూర్తులకు పూజలు చేస్తూ.. బోనాలు సమర్పిస్తున్నారు. వనభోజనాలకూ వెళ్తున్నారు.