సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలు.. నకిలీ విత్తనాలు.. గులాబీరంగు కాయ తొలుచు పురుగు.. ఈ మూడు అంశాలు రాష్ట్రంలో పత్తి దిగుబడులను తీవ్రంగా దెబ్బకొట్టాయి. దీంతో ఎన్నో ఆశలతో పత్తి పంట వేసిన రైతన్న పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. అకాల వర్షాలు, గులాబీరంగు పురుగు కారణంగా రాష్ట్రంలో పత్తి దిగుబడులు గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఈ నెలలో మార్కెట్‌కు పత్తి భారీగా తరలిరావాల్సి ఉండగా, ఆ పరిస్థితి ఏ మార్కెట్లోనూ కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈ సీజన్‌లో రోజుకు 20 వేల క్వింటాళ్ల పత్తి తరలిరావాలి. కానీ ఐదారు వేల క్వింటాళ్లకు మించి రావడం లేదని చెబుతున్నారు. ఈ సీజన్‌లో 3.30 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని మొదట్లో అంచనా వేయగా, ఇప్పుడు 2 కోట్ల క్వింటాళ్లకు మించి దిగుబడులు వచ్చే అవకాశం కనిపించడం లేదని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. పండించిన పత్తిలో దాదాపు సగం వరకు ఇప్పటికే మార్కెట్‌కు రావాల్సి ఉంది. కానీ మార్కెటింగ్ శాఖ లెక్క ప్రకారం ఈ నెల 4 నాటికి 64.12 లక్షల క్వింటాళ్ల పత్తి మాత్రమే వచ్చింది. భారతీయ పత్తి సంస్థ(సీసీఐ) 13.34 లక్షల క్వింటాళ్లు, ప్రైవేటు వ్యాపారులు 50.78 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశారు.
సగానికి తగ్గిన ఉత్పాదకత..
రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా.. అందులో అత్యధికంగా 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. గతేడాది పత్తికి మంచి ధర రావడంతో ఈసారి ఎక్కువ మంది రైతులు పత్తి వైపే మొగ్గారు. కానీ పత్తి రైతులకు తీవ్ర ఆవేదన మిగులుస్తోంది. అక్టోబర్‌లో భారీ వర్షాలకు లక్షలాది ఎకరాల్లో పత్తికి నష్టం జరిగింది. 15 జిల్లాల్లో మూడో వంతు పత్తి కాయలోని గింజలు మొలకెత్తాయి. వర్షాలతో పత్తి నల్లరంగులోకి మారింది. దీంతో దిగుబడి గణనీయం గా పడిపోయింది. మరోవైపు పత్తికి గులాబీ రంగు పురుగు సోకింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాభావం, డ్రైస్పెల్స్ ఏర్పడటం, ఎండల తీవ్రతతో గులాబీ పురుగు ఉధృతమైంది. విస్తారంగా వర్షాలు కురిస్తే ఈ పురుగు ఉధృతి తగ్గిపోతుంది. కానీ వర్షాలు పడినా.. పురుగు నాశనం కాకపోగా.. మరింత విజృంభించి పత్తికాయలను తొలిచేస్తుండటంతో దిగుబడులు దారుణంగా పడిపోయాయి. దాదాపు 10 లక్షల ఎకరాల్లో పత్తికి గులాబీ పురుగు పట్టి పంటంతా సర్వనాశ నమైంది. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్లు రావాలి. ఒక్కోసారి 13–14 క్వింటాళ్ల వరకు వస్తుంది. కానీ అనేకచోట్ల 6–7 క్వింటాళ్లకు మించలేదు.
నకిలీలు.. అనుమతిలేని పత్తి విత్తనాలూ
బీజీ–2 పత్తి విత్తనానికి గులాబీ పురుగును తట్టుకునే శక్తి లేదని తెలిసినా ప్రభుత్వం ఆ విత్తనం విక్రయించేందుకు బహుళజాతి కంపెనీలకు అనుమతి ఇచ్చింది. దీంతో గులాబీ పురుగు రాష్ట్రంలో పత్తి దిగుబడిని దెబ్బతీసి రైతులను కుదేలు చేసింది. గులాబీ పురుగు ఉధృతితో తీవ్ర నష్టం జరుగుతున్నా వ్యవసాయ శాఖ రైతులను అప్రమత్తం చేయలేకపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు అనుమతిలేని బీజీ–3 పత్తి విత్తనాలను కొన్ని కంపెనీలు రైతులకు అంటగట్టాయి. ఇప్పుడు సాగైన పత్తిలో బీజీ–3 విత్తనం 15 నుంచి 20 శాతం ఉంటుందని అంచనా. నకిలీ, అనుమతిలేని పత్తి విత్తనంతో అనేకచోట్ల రైతులు నష్టపోయారు. మూడు నెలల క్రితం ప్రభుత్వం వివిధ డీలర్ల నుంచి పత్తి సహా ఇతర విత్తనాల శాంపిళ్లను సేకరించింది. వాటిని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని డీఎన్‌ఏ లేబొరేటరీకి పంపింది. డీఎన్‌ఏ పరీక్షల్లో 100కు పైగా శాంపిళ్ల విత్తనాల్లో మొలకెత్తే లక్షణం తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇందులో 95 శాతం పత్తి విత్తనాలే. మొత్తంగా ఈసారి పత్తి దెబ్బకు రాష్ట్రంలో 15 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
పత్తి దిగుబడులు మటాష్..!
Published Sat, Dec 9 2017 3:57 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment