ప్రత్యామ్నాయమే
- 1.59,978 హెక్టార్లలోనే ఖరీఫ్ సాగు
- 19,700 హెక్టార్లలో ఆరుతడి పంటలకు కార్యాచరణ
- 8800 కింటాళ్ల విత్తనాలకు ప్రతిపాదనలు
ఖరీఫ్ సాగు నెమ్మదిగా సాగుతోంది. వర్షపాతం సాధారణం కంటే 66 శాతం తక్కువగా నమోదైంది. జిల్లాలో ఇప్పటి వరకు 60 శాతమే పంటలు చేపట్టారు. దీంతో ప్రత్యామ్నాయంపై దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నెల 15వ తేదీ వరకు వ్యవసాయాధికారులు, రైతులు వర్షాల కోసం ఆశతో ఎదురుచూశారు. అదను దాటిపోతుండడంతో రైతులను ప్రత్యామ్నాయ పంటలకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే స్వల్పకాలిక వంగడాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
విశాఖ రూరల్ : జిల్లాలో 2,80,783 హెక్టార్లలో ఖరీఫ్ సాగు లక్ష్యంగా పెట్టుకోగా వర్షాభావ పరిస్థితులతో 1,59,978 హెక్టార్లలోనే పంటలు సాగవుతున్నాయి. అదీ జలాశయాల నుంచి సాగునీటి విడుదలతో వాటి పరిధిలోనే ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. ఆగస్టులో సాధారణ వర్షపాతం 196.5 మిల్లీమీటర్లు. ఇంతవరకు కేవలం 68.5 మిల్లీమీటర్లే కురిసింది. దీంతో మిగతా ప్రాంతాల్లో ఆరు తడి పంటలు, స్వల్ప
కాలిక వంగడాలే గత్యంతరం. ఆగస్టు 15వ తేదీ వరకు వర్షాలు అనుకూలించకుంటే ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాలని అధికారులు ముందుగానే నిర్ణయించారు.
ఇందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటికీ కూడా వర్షాలు లేకపోవడంతో 19,700 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికలు రూపొందించారు. వరి, మొక్కజొన్న, అపరాలు, వేరుశనగ, రాజ్‌మా పంటలకు సంబంధించి స్వల్పకాలిక విత్తనాల అవసరాలను గుర్తించారు. ఇందులో తక్కువ కాల పరిమితి వరి విత్తనాలు 4700 క్వింటాళ్లు, అలాగే ఇతర పంటలకు సంబంధించి 8800 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపారు.
ఈమేరకు కేటాయింపులకు ఉన్నతాధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. విజయనగరంలో ఉన్న గోదాముల్లో ఈ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. మంగళ,బుధవారాల్లో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాల్లో వివిధ గ్రామాల రైతులు అధికారుల దృష్టికి ఇదే విషయాన్ని తీసుకొచ్చారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సరఫరా చేయాలని కోరారు. దీంతో మండలాల వారీ అవసరాలను గు ర్తించి సరఫరాకు అధికారులు చర్యలుచేపడుతున్నారు. అయితే బ్యాంకర్లు రు ణాలివ్వకపోవడంతో కొందరు రైతులు పెట్టుబడుల కోసం వెంపర్లాడుతున్నా రు. స్వల్పకాలిక పంటలకు కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.