తుమ్మపాల.. పీడకల
- మొరాయిస్తున్న పురాతన యంత్రాలు
- 30 వేల టన్నుల లోపే గానుగాట ?
- లక్ష టన్నుల లక్ష్యం ఫలించని స్వప్నం
- 8 శాతం లోపు రికవరీతో కలవరం
- ఏ క్షణం ఏమవుతుందోనన్న భయం
డెబ్భై ఐదేళ్లుగా అనకాపల్లి కీర్తికి నిలువెత్తు నిదర్శనం.. దశాబ్దాలుగా వేలాది మంది రైతులకు ఆధారం.. తుమ్మపాల చక్కెర కర్మాగారం! కానీ అంత ప్రశస్తి ఉన్న ఈ అన్నదాత ఆశాకిరణం ఇప్పుడు వెలవెలపోతోంది. కాలం చేసిన మాయాజాలం కారణంగా పడుతూ లేస్తూ ప్రయాణం సాగిస్తోంది. మూలకు చే రే తీరులో ఉన్న యంత్రాలు చీటికీ మాటికీ మొరాయిస్తుండడంతో భవిష్యత్తు భయపెడుతోంది. గానుగ లక్ష్యం దిగజరిపోతోంది. రికవరీ శాతం కలవరపెడుతోంది. లక్ష టన్నుల క్రషింగ్ దేవుడెరుగు.. అందులో పావుసగం సాధిస్తే గొప్పేనన్న నిర్లిప్తత నీరసం కలిగిస్తోంది.
అనకాపల్లి, న్యూస్‌లైన్: చేరువలో ఉన్న గోవాడ దూసుకు పోతూ ఉంటే, అనకాపల్లి వి.వి.రమణ (తుమ్మపాల) సహకార చక్కెర కర్మాగారం మాత్రం పడుతూ లేస్తూ పయనం సాగిస్తోంది. సుమారు 75 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కర్మాగారాన్ని యాంత్రిక వైఫల్యం శాపంలా వెంటాడుతోంది. కాలం చెల్లిన యంత్రాలు మొరాయిస్తుండడంతో ఏటేటా రికవరీ శాతం తగ్గిపోతోంది. లక్ష టన్నుల క్రషింగ్ కలేనన్న అభిప్రాయం బలపడుతోంది. పరువు కాపాడుకునేందుకైనా గానుగాట నిర్వహించాలని ముందుకు వచ్చిన తుమ్మపాల కర్మాగారానికి మళ్లీ కష్టాలు వచ్చి పడ్డాయి. ఒకవైపు చెరకు కొరత, మరొక వైపు సాంకేతిక సమస్యలు జంటగా వెంటాడుతున్నాయి. లక్ష టన్నుల మాట అటుంచి కనీసం గతేడాది చేపట్టిన క్రషింగ్ లక్ష్యాన్ని అధిగమించగలమా అనే అనుమానం తుమ్మపాల యాజమాన్యాన్ని వేధిస్తోంది.
30 వేల టన్నుల లోపే?
ఆశలు ఎన్ని ఉన్నా, వెంటాడుతున్న వాస్తవాలతో యాజమాన్యం బెంబేలెత్తుతోంది. తుమ్మపాల కర్మాగార ప్రస్తుత సీజన్ క్రషింగ్ 30 వేల టన్నుల లోపే ఉంటుందని ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం 25 వేల టన్నుల వరకు క్రషింగ్ చేపట్టినప్పటికీ రికవరీ శాతం దయనీయంగా మారింది. కేవలం 7.92 రికవరీ శాతం నమోదవుతున్న పరిస్థితుల్లో ఎంత గానుగాడినా ఆస్థాయిలో నష్టాలే వస్తాయని ఆర్ధిక నిపుణుల అంచనాగా ఉంది. ఈ నేపథ్యంలో గానుగాటను ఎంత పొడిగించినా లాభం లేదని ఇప్పటికే కర్మాగార వర్గ్గాలు ఒక అంచనాకు వచ్చాయి. ఇదే సమయంలో చెరకు కొరత ఆందోళన కలిగిస్తోంది. క్రషింగ్ ఏరోజైనా ముగించే పరిస్థితి కనిపిస్తోంది.
అటు ఉత్సాహం.. ఇటు నీరసం
పక్కనున్న గోవాడ కర్మాగారం దూసుకుపోతోంది. 3 లక్షల టన్నుల గానుగాటతో 9.27 రికవరీ శాతం నమోదయింది. తుమ్మపాల తీరు మరీ తీసికట్టుగా ఉంది. 25 వేల టన్నులు గానుగాడి 7.92 రికవరీ శాతం నమోదయిందంటే పరిస్థితి అర్ధమవుతుంది. వెంటాడుతున్న బకాయిల భయం, సిబ్బంది జీతాల సమస్య, కానరాని ఆధునికీకరణ నిధులు, చేరని క్రషింగ్ లక్ష్యం .. భవిష్యత్తు భయంగా ఉంది. రాజకీయంగా కూడా అనిశ్చిత వాతావరణం ఉండడంతో రాబోయే ప్రభుత్వం ద్వారానే తుమ్మపాలకు మేలు జరగాలని అన్ని వర్గాల వారు భావిస్తున్నారు.