రుణ మాఫీపై గంపెడాశలు | రుణ మాఫీపై గంపెడాశలు | Sakshi
Sakshi News home page

రుణ మాఫీపై గంపెడాశలు

Published Mon, May 26 2014 1:18 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

రుణ మాఫీపై గంపెడాశలు

  •      మారటోరియం విధిస్తామన్న బాబు
  •      అప్పులు చెల్లించని అన్నదాతలు
  •      ముక్కుపిండి వసూలు చేస్తామంటున్న బ్యాంకర్లు
  •  విశాఖ రూరల్, న్యూస్‌లైన్: కొత్త ప్రభుత్వం రుణాలను మాఫీ చే స్తుందా? చేయదా? బ్యాంకుల నుంచి తీసుకున్నవి తిరిగి చెల్లించాలా? వద్దా? ఇలా అనేక సందేహాలు అన్నదాతలను చుట్టుముడుతున్నాయి. అధికారంలోకి రాగానే రైతుల రుణ మాఫీ ఫైలుపై తొలిసంతకం చేస్తామని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హామీ పట్ల జిల్లా రైతాంగం గంపెడాశలు పెట్టుకుంది.

    ఈ అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో చేర్చిన నాటి నుంచి రుణాలు చెల్లింపునకు రైతులు ఆసక్తి కనబరచలేదు. జిల్లాలో సుమారు 2 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే  ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజునే రుణ మాఫీ కష్టమని, మారటోరియం విధిస్తామని బహిరంగంగానే చంద్రబాబు ప్రకటన చేశారు.

    దీంతో ఎన్నికల్లో హామీ మేరకు రుణ మాఫీ చేయాలంటూ సర్వత్రా ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ దీనిపై ఎటువంటి స్పష్టత   కానరావడంలేదు. బ్యాంకర్లు మాత్రం రుణాలు సకాలంలో చెల్లించాలంటూ రైతుల వెంటపడుతున్నారు. దీంతో విపక్షాల నుంచే కాకుండా, ఆ పార్టీ శ్రేణులు, రైతుల నుంచి ఆందోళనలు వ్యక్తం కావడంతో రుణమాఫీపై ఆలోచన చేస్తున్నట్లు మరోసారి ప్రకటించారు. ఇలా రోజుకో ప్రకటన రైతులను కలవరపెడుతోంది.

    రుణమాఫీ చేయకుంటే తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేందుకు ఏడాది లేదా రెండేళ్ల పాటు సమయం ఇవ్వడంతో పాటు ప్రస్తుత ఖరీఫ్‌నకు కొత్త రుణాలు అందించే అవకాశాన్ని కల్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఒకవేళ రుణమాఫీ చేయాల్సి వస్తే.. కొన్ని నిబంధనలు, ఆంక్షలు విధించి వీలైనంత తక్కువ మంది రైతులకు, తక్కువ మొత్తంలో రుణాలను మాఫీ చేయవచ్చని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఏదేమైనా ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకోవాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది.
     
    రూ.1046 కోట్లు రుణాలు


    జిల్లాలో గతేడాది ఖరీఫ్, రబీలకు కలిపి బ్యాంకర్లు రూ.1046 కోట్లు పంట రుణాలుగా రైతులకు ఇచ్చారు. ఖరీఫ్‌లో వరుస తుపాన్లు కారణంగా పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వ ఆంక్షల పేరుతో రైతులను మరింత కుంగదీసింది.
     
    ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అధికారులు నామమాత్రంగా నష్టపరిహారం జాబితాను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఇది జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమందలేదు. వరదలు కారణంగా పంటలు కోల్పోయిన రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో దాదాపుగా 2 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement