ధాన్యం రైతు దైన్యం | Dine grain farmer | Sakshi
Sakshi News home page

ధాన్యం రైతు దైన్యం

Published Sat, Jan 3 2015 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

Dine grain farmer

⇒80 కేజీలకు రూ.900 దక్కడమే గగనం
⇒మిల్లర్లకే వంతపాడుతున్న కొనుగోలు కేంద్రాలు
⇒ఛీఛీ.. ఇవేం ధాన్యం మాకొద్దంటున్న మిల్లర్లు
⇒బతిమాలించుకొని తక్కువ ధరకు కొనుగోలు
⇒ మనస్తాపానికి గురవుతున్న అన్నదాత
⇒భయపెడుతున్న అప్పులు, పండుగ ఖర్చులు
⇒ధర వచ్చే వరకు నిరీక్షించలేని దుస్థితి
 పాలకొండ: భూమినే నమ్ముకొని బతుకుతున్న భూమిపుత్రుడు పండిన ఫలాన్ని అమ్ముకుందామన్నా వీలుకావడం లేదు. ఇటు కొనుగోలు కేంద్రాలు, అటు వ్యాపారులు నానారకాల సాకులు, సవాలక్ష నిబంధనలతో ధర విషయంలో రైతన్నను దోపిడీ గురిచేస్తూనే.. ఛీత్కారాలు, చీదరింపులతో మనస్తాపానికి గురి చేస్తున్నారు.

ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని చేతికొచ్చిన కొద్దిపాటి ధాన్యాన్నే అమ్ముకోలేక అన్నదాత అవస్థల పాలవుతున్నాడు. చివరికి ఎంతో కొంత ధరకు ధాన్యాన్ని అమ్ముకోక తప్పని దైన్యాన్ని ఎదర్కొంటున్నాడు. జిల్లాలో ఈ ఏడాది తుపాను కారణంగా ధాన్యంలో కొంతమేర పటుత్వం తగ్గిన మాట వాస్తవమే. ఇదే అవకాశాన్ని ఇటు మిల్లర్లు, దళారులు వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిబంధనలు వీరికి అనుకూలంగా మారాయి. అప్పులు, పండుగ ఖర్చుల కారణంగా నూర్పు చేసిన పంటను దాచుకునే పరిస్థితుల్లో లేని అన్నదాతల యథేచ్ఛగా దోచుకుంటున్నారు.

మిల్లర్లందరూ సిండికేట్‌గా మారి 80 కేజీల ధాన్యానికి రూ. 850 నుంచి రూ.900 లోపే ధర నిర్ణయించారు. నాణ్యత సాకుతో అంతకుమించి ధర ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ధాన్యం పట్టుకొని మిల్లు వద్దకు వెళ్లిన రైతులకు ‘ఛీఛీ.. ఈ పంట మాకొద్దు...పూర్తిగా విరిగిపోతున్నాయి.. మేము కొనలేం’ అని ఛీత్కరిస్తున్నారు. దీంతో దిక్కుతోచని రైతులు మిల్లర్లు చెప్పిన ధరకే అమ్మాల్సి వస్తోంది.
 
మిల్లర్ల మాటకే సై
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు రైతులకు విచిత్ర పరిస్థితిని కల్పిస్తున్నాయి. పరీక్షలకు శ్యాంపిల్‌గా ధాన్యం తీసుకెళితే నాణ్యత లేవని సమాధానం చెబుతున్నారు. కేంద్రాల్లో ఉన్న సిబ్బందికి దీనిపై అవగాహన లేకపోవడంతో తప్పించుకొనే  ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. మిల్లర్లు చెప్పిన నిబంధనలనే అమలు చేస్తున్నారు. మిల్లర్లు సరే అంటేనే ధాన్యం తీసుకొనే పరిస్థితిలో కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయి.
 
తగ్గిన డిమాండ్
ఈ ఏడాది ధాన్యానికి డిమాండ్ పూర్తిగా తగ్గింది. గతంలో ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేయడంతో మిల్లర్లు కొంతమేర భయపడే వారు. లెవీకి కూడా ధాన్యం సేకరించలేమన్న ఉద్దేశంతో ధర పెంచేవారు. అయితే ఇటీవల అక్రమంగా ధాన్యం తరలిపోతున్నాయంటూ అధికారులు హడావుడి చేయడంతో ఇతర ప్రాంతాల వ్యాపారులు జిల్లాకు రావడం రాలేదు. పొరపాటున అక్కడక్కడ కొనుగోలు చేసినా అధికారులు వాహనాలను అడ్డుకొని తనిఖీల పేరుతో రెండు మూడు రోజుల పాటు పోలీస్ స్టేషన్ల వద్దే నిలిపివేస్తుండటంతో ఎందుకీ తలనొప్పి అన్న ఉద్దేశంతో బయటి వ్యాపారులు రావడం మానుకున్నారు. స్థానిక వ్యాపారులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకొని రైతులను నిలువునా దోచుకుంటున్నారు.
 
రవాణా చార్జీల్లో మతలబు
రైతులకు రవాణా చార్జీల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. గత ఏడాది వరకు ఒక క్వింటాకు రూ.28 చొప్పున రైతుకు నేరుగా రవాణా చార్జీలు ఇచ్చేవారు. ఈ ఏడాది రైతుకు చెల్లించడం నిలిపివేశారు. ఇందుకోసం జిల్లాలో మూడు డివిజన్లను  ముగ్గురు కాంట్రాక్టర్లకు అప్పగించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తే అక్కడి నుంచి మిల్లుకు తరలించే బాధ్యత వీరికి అప్పగించారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలనే మరిచిపోయే పరిస్థితి కల్పించారు. ఈ విధానంపై రైతు సంఘాలు, వ్యవసాయ సంఘాలు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement