=అన్నదాతలో భయాందోళనలు
=వరద నష్టం లెక్కింపుపై కలవరం
=50శాతం పైగా నష్టపోతేనే పరిహారం
=అంతరపంటలకు హుళక్కి
=బ్యాంకు ఖాతా తప్పనిసరి
=నిబంధనల బాధలతో రైతు ఉక్కిరిబిక్కిరి
వరదలతో నిలువునా మునిగిన రైతన్నను నిబంధనల నయవంచనతో ప్రభుత్వం అతలాకుతలం చేస్తోంది. పంట నష్టం అంచనాకు సవాలక్ష నిబంధనలు పెట్టి పరిహా రం అందకుండా చూసేందుకు ఎన్నో ఎత్తులు వేస్తోంది. ‘50శాతం కన్న అధికంగా పంట నష్టపోతేనే పరిహారం. అంతర పంటలకైతే నో చాన్స్. బ్యాంకు ఖాతా లేకపోతే పరిగణనలోకి తీసుకోం.’ అంటూ ఆంక్షలు పెడుతోంది. ఈ నిబంధనలకు లోబడే పంట నష్టాన్ని అంచనా వేయనున్నట్టు స్పష్టం చేస్తోంది.
సాక్షి, విశాఖపట్నం : వరద నష్టం నిర్ణయం రైతులను కలవరపెడుతోంది. 50శాతం లోపు నష్టపోయిన రైతులు సంగతేంటని వారు ప్రశ్నిస్తున్నారు. అంతర పంటలు సాగు చేసిన వారంతా నష్టపోవల్సిందేనా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఖాతా లేకుంటే పరిగణన లోకి తీసుకోరా? అని నిలదీస్తున్నారు. కొండంత నష్టం వస్తే గోరంత సాయం చేస్తూ అన్నదాతను ప్రభుత్వం వంచిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నష్టం లెక్క కట్టే నిబంధనలతో జిల్లాలో వేలాది మంది రైతులు నష్టపోతున్నారు. గతేడాది నీలం తుఫాన్ సమయంలో సంభవించిన నష్టం అంచనా విషయంలో ఇదే జరిగింది. 2012నవంబర్‌లో వచ్చిన నీలం తుఫాన్ కారణంగా జిల్లాలో 80,915 ఎకరాల్లో పంట నీట మునిగింది. రూ.97.8 కోట్ల నష్టం వాటిల్లింది. దాదాపు 1,45,487 మంది రైతులు నష్టపోయారు. కానీ 50 శాతం పైబడి నష్టం లేదని, అంతర పంటలు వేశారని, బ్యాంకు ఖాతా లేదని కారణాలు చూపుతూ దాదాపు 39వేల మంది రైతులకు పరిహారం ఎగ్గొట్టేందుకు ఎత్తు వేశారు.
పంట నష్టానికి పరిహారంగా రూ. 30.24 కోట్లు మాత్రమే సరిపోతుందని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అందులో ఇంతవరకు రూ. 23 కోట్లు మాత్రమే విడుదల చేశారు. రూ. 10కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. బ్యాంకు ఖాతాల్లేవని మిగతా నిధులను పంపిణీ చేయలేదు. ఈ ఏడాది కొస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 75,580ఎకరాల పంటకు ముప్పు వాటిల్లింది. సుమారు రూ. 60 కోట్ల నష్టం జరిగినట్టు తాత్కాలిక అంచనా వేశారు. కానీ అంచనా లెక్కలపై ఉన్న ఆంక్షలతో ఆ నష్టంతో పాటు బాధిత రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది.
ముఖ్యంగా 50 శాతం లోపు నష్టం విలువ ఎకరాకు రూ.15 వేల నుంచి రూ. 30 వేలు మాత్రమే ఉంటోంది. దీంతో ఆ పరిధిలోకి వచ్చే రైతులంతా నష్టపోవల్సిందే. అంతర పంటల్ని కనీసం లెక్కలోకి కూడా తీసుకోలేదు. ఎన్యూమరేషన్ సమయంలో కూడా లెక్క కట్టరని తేల్చి చెప్పేశారు. వాస్తవానికైతే జిల్లాలో వేరుశనగ, పెసర, మినుములు, కంది, చోడి, తమలపాకులు, కూరగాయలు,గంటి, జొన్న తదితర అంతరపంటలు కూడా భారీ వర్షాలకు నీట మునిగాయి. వీటిని లెక్కలోకి తీసుకోమని చెప్పడంతో దీంతో దాదాపు 50వేల ఎకరాల్లో సాగు చేసిన అంతర పంటల రైతులు నష్టపోనున్నారు. ఈ విధంగా కళ్లెదుటే నష్టం కనిపిస్తున్నా.. 50 శాతం కంటే అధికంగా నష్టపోతేనే అంచనా లెక్కలు వేయాలన్న నిబంధన ఒకవైపు.. అంతర పంటల్ని లెక్కలోకి తీసుకోకపోవడం మరోవైపు... ఇలా అన్నదాతకు కుడిఎడమల దగాగా కనిపిస్తోంది.
వరద నష్టం రూ.416.76 కోట్లు
విశాఖ రూరల్ : అల్పపీడనం కారణంగా వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో రూ.416.76 కోట్లు నష్టం వాటిల్లినట్లు జిల్లా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. క్షేత్ర స్థాయిలో నష్టాల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు వివిధ శాఖలు వారి వారి నష్టాల అంచనాలను కలెక్టరేట్‌కు అందజేశారు. దీని ప్రకారం జిల్లాలో 364 గ్రామాలు వరద ప్రభావానికి గురవగా 67 గ్రామాలు నీట మునిగాయి. వరదలు కారణంగా ఐదుగు మరణించగా, ఇద్దరు గల్లంతయ్యారు. 12 పశువులు మృతి చెందాయి. ప్రధానంగా జిల్లాలో 27,285 హెక్టార్లలో ఆహార పంటలు నీట మునగడంతో రూ.54.57 కోట్లు, 1132 హెక్టార్లు ఉద్యానవన పంటలు దెబ్బతినడంతో రూ.5.05 కోట్లు నష్టం జరిగింది. అలాగే నీటి పారుదల శాఖకు సంబంధించి రూ.154.38 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.54.57 కోట్లు, ఉద్యానవన పంటలకు రూ.5.05 కోట్లు, ఆర్ అండ్ బీకు రూ.83.57 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.57.67 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.10.58 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ.1.41 కోట్లు, ఏపీఈపీడీసీఎల్‌కు రూ.1.21 కోట్లు, జీవీఎంసీకి రూ.32.90 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.3 లక్షలు, మత్స్యశాఖకు రూ.70లక్షలు, చేనేత శాఖకు రూ.లక్ష, పట్టుపరిశ్రమకు రూ.2 లక్షలు, హౌసింగ్‌కు రూ. 12.15 కోట్లు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అం చనా వేశారు. క్షేత్ర స్థాయిలో సర్వే అనంతరం ఈ నష్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
172 రోడ్లు ధ్వంసం
సాక్షి, విశాఖపట్నం : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంచాయతీరాజ్ శాఖకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వరదల కారణంగా రోడ్లు, పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి. దాదాపు రూ.57కోట్ల నష్టం సంభవించినట్టు అధికారులు అంచనా వేశారు. ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక పంపారు. భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 172 రోడ్లు శిథిలమయ్యాయి. 21జెడ్పీ పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలిక మరమత్తులకు రూ.8.5కోట్లు కావాలి. శాశ్వత నిర్మాణం చేపట్టాలంటే రూ.57కోట్లు అవసరం అవుతోంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రోడ్లు విషయానికి వస్తే విశాఖ డివిజన్‌లో 70, నర్సీపట్నం డివిజన్‌లో 44, పాడేరు డివిజన్‌లో 58 పాడయ్యాయి. ఇక పాఠశాల భవనాలకొస్తే విశాఖ డివిజన్‌లో ఒకటి, నర్సీపట్నం డివిజన్‌లో 11,పాడేరు డివిజన్‌లో 9 మరమ్మత్తుకు గురయ్యాయి. ఈమేరకు రోడ్లు, పాఠశాల భవనాల వారీగా అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు.
కొత్త మార్గదర్శకాలు
పంట నష్టం అంచనాకు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కమిటీలుంటాయి.
నష్టపోయిన రైతుల జాబితాను తెలుగులోనే తయారు చేసి తహశీల్దారు, ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో విధిగా ప్రదర్శించాలి. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితా రూపొందించాలి.
పంటల నష్టాన్ని లెక్కించేటప్పుడు, జాబితా తయారు చేసే క్రమంలో ఆదర్శరైతుల పాత్ర లేకుండా చూడాలి.
క్షేత్ర స్థాయిలో పంటల నష్టాన్ని అంచనా వేసే క్రమంలో పొలాన్ని సాగుచేస్తున్న రైతుకే పెట్టుబడి రాయితీ అందేలా చూడాలి. ఇందుకు కౌలు రైతుల పేర్లు, వారి బ్యాంకు ఖాతా నెంబర్లు సేకరించి జాబితాలో పొందుపర్చాలి.
ఏటా ఇదే దుస్థితి..
వరి పంటకోసం రూ. 6వేలు మదుపుగా పెట్టాను. భారీ వర్షాలకు పంటంతా నీటమునిగింది. వర్షాలు తగ్గుముఖం పట్టినా 20రోజుల వరకు నీరు పోయే మార్గం లేదు. చెరకు తోటదీ ఇదే దుస్థితి. దానికీ రూ.వేలల్లో పెట్టుబడి పెట్టాను. గతేడాది పరిహారం నేటికీ మంజూ రు కాలేదు. అప్పుడూ నీలం తుఫాన్‌లో పంటంతా నీట మునిగింది. నష్టం అయినా జీవనాధారమైన వ్యవసాయాన్ని వదులుకోలేక ఏటా చేపడుతున్నాను. - భీమర శెట్టి గణేష్‌నాయుడు, తిమ్మరాజుపేట
చెరకుకు పరిహారమేదీ?
గతేడాది నవంబర్‌లో సంభవించిన నీలం తుఫాన్ వల్ల చెరకు పంట నేలకొరిగింది. నీరు నిలిచిపోవడంతో పిలకలు వచ్చాయి. తర్వాత ఏదోలా నిలబెట్టినా దిగుబడి సగానికి పైగా తగ్గిపోయింది. భారీ వర్షాలు, వరదల వల్ల చెరకు తోటల దిగుబడి తగ్గిపోతుంది. నష్టపరిహారం ఇచ్చి చెరకు రైతును ఆదుకోవాలి.
- దొడ్డి చంద్ర అప్పారావు, రైతు నర్సాపురం