మార్కెట్‌కు వచ్చిన ధాన్యం బస్తాలు
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : మార్కెట్‌లో అన్నదాత నిలువు దోపిడీకి గురవుతున్నాడు. రబీలో చేతికొచ్చిన పంటలను అకాల వర్షాలు దెబ్బతీశాయి. మిగిలిన పంటను మార్కెట్‌కు తరలిస్తే వ్యాపారులు ధర పెట్టకపోవడంతో దిగాలు పడుతున్నాడు. వరంగల్ ఏనుమూముల వ్యవసాయ మార్కెట్‌లో ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్ల కోసం ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మండల, నియోజకవర్గాల కేంద్రాలు, చిన్నా, పెద్ద వ్యవసాయ మార్కెట్లలో ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు.
అయితే జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లో మాత్రం ఐకేపీ కేంద్రం ఏర్పాటు చేయలేదు. దీంతో వ్యాపారులు ఇష్టానుసారంగా ధర నిర్ణయిస్తూ ధాన్యం రైతులకు కుచ్చుటోపి పెడుతున్నారు. ఇక్కడి పరిస్థితిని గమనించిన రైతులు చాలావరకు మార్కెట్‌కు ధాన్యం తీసుకురావడం లేదు. తెచ్చినా.. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసే ప్రభుత్వరంగ సంస్థలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌కు రోజూ వెయ్యి బస్తాల వరకు ధాన్యం వస్తోంది. మార్కెట్‌లో ధాన్యం సన్నరకాలు క్వింటాల్‌కు రూ.1,250 నుంచి రూ.1,300 వరకు ధర పలుకుతోంది. దొడ్డు రకం ధాన్యానికి రూ.1,150 లోపే ధర పెడుతున్నారు. నిజానికి సన్నరకానికి మద్దతు ధర రూ.1,340, దొడ్డురకానికి రూ.1,300 ధర చెల్లించాలి. అయితే వ్యాపారులు కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా క్వింటాల్‌కు రూ.100 నుంచి రూ.150 వరకు తగ్గిస్తున్నారు.