రాలని చినుకు
- అయోమయంలో అన్నదాతలు
- ప్రత్యామ్నాయ పంటలు సూచిస్తున్న వ్యవసాయాధికారులు
- అపరాలు, చిరుధాన్యాలు మేలు
అనకాపల్లి : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. మైదానంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఏజెన్సీలో అప్పుడప్పుడు చినుకులు పడుతున్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో సాధారణంలో సగం కూడా వర్షపాతం నమోదు కాలేదు. వర్షాలు పుంజుకుంటేనే పంటలసాగు మెరుగవుతుంది. ఖరీఫ్‌లో గట్టెక్కగలమన్న ఆశలు రైతుల్లో అడుగంటుతున్నాయి. జిల్లాలో ఈ సమయానికి 128.8 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా ప్రస్తుతం 39.8 మి.మీ. మాత్రమే నమోదైంది.
ఈ ఖరీఫ్‌లో మొత్తం 2,27,400 హెక్టార్లలో సాగు లక్ష్యంగా వ్యవసాయాధికారులు నిర్దేశించారు. లక్షా 10 వేల హెక్టార్లలో వరి, 40 వేల హెక్టార్లలో చెరకు, 25 వేల హెక్టార్లలో రాగులు, 20 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 32,400 హెక్టార్లలో ఇతర పంటలు చేపట్టాలని వ్యవసాయాధికారులు ప్రణాళికలు రూపొందిం చారు. గతేడాది ఖరీఫ్ జూలై చివరి వారంలో ప్రారంభమైంది. ఈ ఏడాది ఆగస్టు వరకు వేచి ఉండాల్సి వస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అప్పటికీ వర్షాలు అనుకూలించకుంటే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తామంటున్నారు.
జిల్లాలో భూ గర్బజాలాలూ అడుగంటుతున్నాయి. ఈ సీజన్‌లో సగటున 24.84 అడుగుల లోతున నీరు లభ్యం కావాల్సి ఉంది. కానీ వర్షాభావ పరిస్థితులు కారణంగా భూగర్భజలాలు 26 అడుగుల కిందకు వెళ్లిపోయాయి.
జూన్ నెలాఖరవుతున్నా వాన జాడ లేదు. రైతులతో పాటు, వ్యవసాయ విస్తరణ, పరిశోధన విభాగాల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి వర్షాలు అనుకూలిస్తే జూన్ 15నాటికి వరి నారుపోతలు పూర్తవ్వాలి. రోజులో 30 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైతేనే నారుమళ్లకు అవసరమైన తేమ లభిస్తుంది. ఈ పరిస్థితుల్లో చినుకు జాడలేకపోవడంతో రైతులు జూలై, ఆగస్టు వర్షాలపైనే ఆశలు పెట్టుకున్నారు. జూన్‌లో వర్షాలు అనుకూలిస్తే శ్రీకాకుళం సన్నాలు, స్వర్ణ, ఇంద్ర వంటి రకాలను చేపట్టవచ్చు. కానీ వర్షాలు కలిసి రాలేదు.
ఇప్పుడు జూలై వర్షాలే ఆదుకోవాలి. అదే జరిగితే వసుంధర, కాటన్‌దొర సన్నాలు, సురేఖ రకాలు నారుగా పోసుకోవాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సి.వి. రామారావు సూచిస్తున్నారు. జూలైలో కూడా వరుణుడు కరుణించకుంటే ఆగస్టులో స్వల్ప కాలిక వంగడాలను నేరుగా ఎదజల్లే పద్ధతిలో నాట్లు వేసుకోవాలన్నారు. అప్పుడు ఎంటీయూ 1001,ఎంటీయూ 1010 వంగడాలను వినియోగిస్తే మేలు. వీటిని డ్రమ్‌సీడర్ ద్వారా లేదా నేరుగా ఎదజల్లే పద్ధతిలో వేస్తే రైతులకు ప్రయోజకరంగా ఉంటుంది.
ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు సూచించడంతో వరి సాగుని తగ్గించి, మెట్టపంటలు వేసుకోవాలని వ్యవసాయాధికారులు పేర్కొం టున్నారు. నీటి వనరులు అధికంగా అవసరమయ్యే వరి విస్తీర్ణాన్ని తగ్గించి అపరాలు, చిరుధాన్యాలు, జోన్న వంటి పంటలను చేపట్టాలని చెబుతున్నారు.