=ప్రభుత్వానికి కనిపించని అన్నదాత కష్టం
=కరువు జిల్లాల జాబితాలో విశాఖకు దొరకని స్థానం
=రైతుల కొంప ముంచిన అక్టోబర్ వర్షం
సాక్షి, విశాఖపట్నం : అనుకున్నట్టే అయింది... అన్నదాతకు ప్రభుత్వం చల్లగా షాకిచ్చింది. కరువు ఛాయలు జిల్లాలో లేనేలేవని స్పష్టం చేసింది. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల సాక్షిగా దుర్భిక్షానికి జిల్లాలో ఆస్కారం లేదని తేల్చేసింది. మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో కరువు లేనేలేదని తేల్చి చెప్పేసింది. రైతన్నకు మొండి చేయి చూపింది. పొరుగు జిల్లా విజయనగరంలోని ఐదు మండలాల్ని కరువు జాబితాలో చేర్చినప్పటికీ మన జిల్లాలో ఒక్క దానికీ చోటు కల్పించకుండా వింత పోకడ అనుసరించింది.
నిబంధనల కారణంగా ఇప్పటికే వరద పరిహారానికి దూరమైన జిల్లా రైతులకు ఇదొక షాక్ అయ్యింది. ఖరీఫ్ సీజన్‌కు ముందే రుతు పవనాలు ప్రవేశించడంతో ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని భావించి పంటలు సాగు చేశారు. సాధారణ విస్తీర్ణం 2.02,308 హెక్టార్లైతే అందులో 1,91,857 హెక్టార్లలో సాగు చేశారు. భారీ ఎత్తున వరి సాగు చేశారు. కానీ సీజన్ ప్రారంభం తర్వాత వరుణుడు ఎండగట్టేశాడు. దీంతో వేలాది హెక్టార్లు ఎండిపోయాయి. తక్కువ వర్షపాతం నమోదైన కారణంగా దాదాపు 30మండలాల్లో కరువు ఏర్పడిందని అధికారులు సూచన ప్రాయంగా తేల్చారు.
ఈ నేపథ్యంలో ఎన్ని ఎకరాలకు కరువు ముప్పు వాటిల్లిందో అంచనా వేసి, అక్టోబర్ నెలాఖరు కల్లా నివేదిక ఇవ్వాలని వ్యవసాయ అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. దీంతో కరువును ఎదుర్కొన్న రైతులంతా అధికారులపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ఈలోపే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలు దాదాపు పంటను ముంచేశాయి. అంతేకాకుండా అంతవరకు ఉన్న కరువు పరిస్థితుల్ని కన్పించకుండా చేశాయి.
కానీ కలెక్టర్ ఆదేశాల మేరకు కరువు నివేదిక తయారీ కోసం అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లేసరికి కరువు పరిస్థితులు కన్పించలేదు. సాధారణ విస్తీర్ణానికి సమానంగా సాగు విస్తీర్ణం జరిగిందని వారి సర్వేలో తేలింది. జూన్ నుంచి అక్టోబర్ వరకు వర్షపాతం తక్కువగానే ఉంది. ఒక్క అక్టోబర్‌లో అత్యధిక వర్షం పడింది. దీంతోఅధికారులు క్షేత్రస్థాయికి వెళ్లే చూసేసరికి ఎండి పొయిన పంటలు కన్పించలేదు. ఆవిధంగానే ప్రభుత్వానికి వ్యవసాయ అధికారులు నివేదిక పంపించారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ప్రాంతాల వారీ సాధారణ వర్షపాతం కన్న 25నుంచి15శాతం తక్కువ నమోదైన వాటినే కరువు మండలాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
అధికారుల నివేదిక ప్రకారం ఈ మార్గదర్శకాల పరిధిలోకి జిల్లాలో ఏ ఒక్క మండలం రాలేదు. దీంతో జిల్లాలో కరువే లేదని తేల్చేసింది. వరద పరిహారంలో కూడా రైతులకు న్యాయం జరగలేదు. నిబంధనల మేరకు 50 శాతం పైబడి పంట నష్టపోయిన రైతుల్ని మాత్రమే ఎంపిక చేయడంతో ఆ లోపు ఉన్న రైతులందరికీ అన్యాయం జరిగింది. మొత్తానికి అటు కరువుకు నోచుకోక, ఇటు వరద పరిహారానికి ఎంపిక కాక రైతులు తీవ్ర నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది.
కరువా! ఏదీ, ఎక్కడ?
Published Sat, Jan 4 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement