పంట కాల్వలు ఇలా..సాగుకు నీరెలా? | Like nirela streams .. the cultivation of the crop? | Sakshi
Sakshi News home page

పంట కాల్వలు ఇలా..సాగుకు నీరెలా?

Published Sun, Jun 8 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

Like nirela streams .. the cultivation of the crop?

  • పూడికతీత చేపట్టలేదు
  •  రసాయనాల పిచికారీకి అనుమతులు రావాలట
  •  దుస్థితిలో పంట కాలువలు
  •  సాగుపై అన్నదాతల ఆందోళన
  • ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది. మరికొద్దిరోజుల్లో రుతుపవనాలు వచ్చే అవకాశాలూ కనిపిస్తున్నాయి. దీంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. సాగునీటిని సరఫరా చేసే పంట కాలువల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. అనేక కాలువలు చెత్తాచెదారం, గుర్రపుడెక్కతో నిండిపోయాయి. కాలువ గట్లు బలహీనంగా ఉన్నాయి. దెబ్బతిన్న రివిట్‌మెంట్లకు మరమ్మతులు లేవు. డెల్టా ఆధునికీకరణ పేరుతో కాలువల్లో పూడికతీత పనులను పక్కన పెట్టేశారు. దీంతో ఈ ఏడాది సాగు జరిగేదెలా అని
    అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.
     
    మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే జూన్ నెలాఖరు నాటికి నారుమడులు పోసుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. సాగునీటి కాలువల్లో పూడికతీతకు కనీస చర్యలు చేపట్టకపోవటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

    గత నాలుగేళ్లుగా డెల్టా ఆధునికీకరణ పేరుతో సాగునీటి కాలువల్లో పూడికతీత పనులను పక్కన పెట్టేశారు. కేఈబీ తదితర కాలువలపై డెల్టా ఆధునికీకరణ పేరుతో వంతెనలను మాత్రమే నిర్మించారు. కాలువల్లో గుప్పెడు మట్టి తీసిన దాఖలాలు లేవు. 2011-12లో డెల్టా ఆధునికీకరణలో 20 శాతం, 2012-13లో  కేవలం ఎనిమిది శాతం మాత్రమే పనులు చేసి సరిపెట్టారు. జిల్లా రైతులు రెండేళ్లపాటు రెండో పంటను వదులుకున్నా ఆధునికీకరణ పనులు ఆశించిన స్థాయిలో జరగలేదు.
     
    రసాయనాల పిచికారీకి అనుమతులు రావాల్సిందే...

    ఏటా వేసవిలో సాగునీటి కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, తూటుకాడ, నాచులను నిర్మూలించేందుకు రసాయనాలు పిచికారీ చేస్తారు. మండు వేసవిలో ఈ రసాయనాలు పిచికారీ చేస్తే ఉపయోగం ఉంటుందని రైతులు చెబుతున్నారు. జూన్‌లో వర్షాలు కురిసే సమయంలో రసాయనాలు పిచికారీ చేసినా ఉపయోగం ఉండదనేది అధికారుల వాదన.

    రసాయనాలు పిచికారీ చేసిన ఒకటి రెండు రోజులకు వర్షం కురిస్తే నాచు, తూటుకాడ మళ్లీ పిలకలు తొడుగుతుందని రైతులు అంటున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సాగునీటి కాలువల్లో రసాయనాలను పిచికారీ చేసేందుకు రూ.2.50 కోట్లతో అంచనాలు తయారుచేసి అనుమతుల కోసం పంపినట్లు నీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు.

    ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే రసాయనాల పిచికారీ ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ పనులకు ఎప్పటికి అనుమతులిస్తుంది.. ఎప్పటికి పనులు పూర్తిచేస్తారనే అంశంపై రైతుల్లో సందిగ్ధత నెలకొంది.
     
    జిల్లాలోని పలు కాలువల పరిస్థితి ఇదీ...

    డెల్టా ప్రాంతానికి శివారున ఉన్న అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలకు సాగునీటిని సరఫరా చేసే ప్రధాన కాలువల్లో కనీస పూడికతీత పనులు చేయటం లేదు. అవనిగడ్డ, కేఈబీ కాలువకు పులిగడ్డ-అవనిగడ్డల మధ్య రిటైనింగ్ వాల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
     
     గుడివాడ తదితర ప్రాంతాల్లో బల్లిపర్రు, దోసపాడు తదితర చానళ్లు ఉన్నాయి. వీటిలో తూడుకాడ, గుర్రపుడెక్క పేరుకుపోవటంతో పాటు కాలువలు పూడుకుపోయాయి. గట్లు దెబ్బతిన్నాయి. ఈ కాలువల కనీస మరమ్మతులు ఇంతవరకు చేపట్టలేదని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు.
     
     బంటుమిల్లి చానల్‌కు సాతులూరు - చినతుమ్మిడి గ్రామాల మధ్య ఆధునికీకరణ పనుల్లో భాగంగా గత ఏడాది వంతెన నిర్మించారు. ఈ వంతెనకు అప్రోచ్ పనులను కాంట్రాక్టర్లు పక్కన పెట్టేశారని రైతులు చెబుతున్నారు.
     
     కోడూరు, నాగాయలంక కాలువలకు అండర్ టన్నెల్ నిర్మించేందుకు పునాదులు వేశారు. ఇవి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నాయని రైతులు మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. వీటి ప్రభావంతో రామకృష్ణాపురం, మందపాకల తదితర ప్రాంతాలకు సాగునీటి విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
     
     కైకలూరు, కలిదిండి తదితర ప్రాంతాలకు పోల్‌రాజ్ కాలువ, క్యాంప్‌బెల్ కాలువ, సీబీ చానల్ ద్వారా సాగునీటి సరఫరా జరుగుతోంది. ఈ ప్రధాన కాలువల్లో ఈ ఏడాది ఇంతవరకు పూడికతీత పనులే చేపట్టలేదు. క్రస్ట్ గేట్లు, లాకులకు కనీస మరమ్మతులు చేయలేదు.
     
     మైలవరంలో వెల్వడం, చెవుటూరు మేజర్ చానల్స్‌తో పాటు బొర్రగూడెం, మైనర్ కాలువలు పూడుకుపోయాయి. ఏళ్ల తరబడి ఈ కాలువలకు మరమ్మతులు చేయకపోవటంతో గట్లు దెబ్బతిన్నాయి. శివారు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు అధికంగా నీరు విడుదల చేస్తే గండ్లు పడుతున్న ఘటనలు ఏటా జరుగుతున్నాయి. దీంతో శివారుకు సాగునీందని పరిస్థితి నెలకొంటోంది.
     
     ఇబ్రహీంపట్నం కటికలపూడి ఎత్తిపోతల పథకం పనిచేయటం లేదు. ఎన్‌ఎస్‌పీ కాలువలో మూడేళ్ల క్రితం నామమాత్రంగా పూడికతీత పనులు చేశారు. ఈ పనుల వల్ల ఉపయోగం లేకుండాపోయిందని స్థానిక రైతులు చెబుతున్నారు.
     
     బందరు మండలంలోని నాగులేరు, రామరాజుపాలెం కాలువలకు గత పదేళ్లుగా మరమ్మతులు చేయలేదు. పూడికతీత పనులు చేపట్టలేదు. రామరాజుపాలెం కాలువ ద్వారా బందరు, పెడన, గూడూరు మండలాలకు సాగునీరు విడుదలవుతుంది. ఈ కాలువ గట్లు బలహీనంగా మారాయి. గూడూరు సమీపంలో కాలువ గట్లకు రివిట్‌మెంట్ పూర్తిగా దెబ్బతింది. కనీస మరమ్మతులు ఇక్కడ చేయటం లేదు.
     
     పెడన మండలానికి సాగునీటిని సరఫరా చేసే న్యూ ఎస్‌వీఎస్, ఓల్డ్ ఎస్‌వీఎస్, పుల్లపాడు చానళ్లకు  పదేళ్లుగా మరమ్మతులు లేవు. దీంతో ఈ కాలువలు పూడుకుపోయి శివారు ప్రాంతాలకు సాగునీరందని పరిస్థితి నెలకొంది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement