కష్టాల‘సాగు’ | kharif season problems to farmers | Sakshi
Sakshi News home page

కష్టాల‘సాగు’

Published Thu, Jul 10 2014 3:41 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

కష్టాల‘సాగు’ - Sakshi

కష్టాల‘సాగు’

సాక్షి, ఒంగోలు: తొలకరి గడువు దాటేసింది. రుతుపవనాలు దోబూచులాడుతున్నాయి. నాలుగు రోజులుగా జిల్లాలో కమ్ముకున్న కారుమబ్బులు అడపాదడపా వర్షిస్తున్నాయి. సాగు ప్రారంభ అవసరానికి తగ్గట్టు నాన్చుడు వాన కురిసింది.   ప్రస్తుతం అన్నదాత దుక్కులు దున్నుకునేందుకు సిద్ధమవుతున్నాడు. భూమిలో తేమశాతం ఉన్నప్పుడే విత్తు నాటేందుకు సన్నాహాలు మొదలుపెడదామన్నా.. చేతిలో చిల్లిగవ్వలేక రైతు దిక్కులు చూస్తున్నాడు. పంట పెట్టుబడుల్లేక నానా అవస్థలు పడుతున్నాడు. పంట రుణాలు మాఫీ అవుతాయేమో.. మళ్లీ కొత్త రుణాలతో సాగుచేయవచ్చని తలచిన రైతుల ఆశ అడియాశగా మారింది. తాజాగా రుణాల రీషెడ్యూల్ గందరగోళం.
 
జిల్లాలో కర్షకుడి కష్టాలపై కథనం... వర్షపాతం నిరాశాజనకం
కిందటేడాది జూన్ మాసంలో సాధారణ వర్షపాతం కన్నా రెట్టింపు నమోదైనా.. ఈ ఏడాది మాత్రం చినుకే రాలలేదు. జూన్ సాధారణ వర్షపాతం 58 మిల్లీమీటర్లు కాగా, జిల్లాలో 12.3 మిల్లీమీటర్లు కురిసింది. జూలై మాసంలో సాధారణ వర్షపాతం 89.7 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటికి 55.4 మిల్లీమీటర్లు నమోదైంది. ప్రస్తుతానికి రెండు దుక్కుల వర్షం కురిసింది. వాస్తవానికి మూడు దుక్కుల వర్షం కురిస్తే విత్తునాటుకునేందుకు భూమి అనువుగా మారుతుందని రైతులు చెబుతున్నారు.  
 
సగం సాగు కూడా లేదాయే...
జిల్లాల్లో ఖరీఫ్ సీజన్‌లో సుమారు 2.13 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగుకావాల్సి ఉంది. పొగాకు, పత్తి, వేరుశనగ, మిర్చి తదితరాలు అధికంగా సాగవుతాయి. అయితే, సాధారణంగా వేసవిలో వర్షం కురిస్తే నువ్వు, పెసర, సజ్జ పంటలు సాగు చేస్తారు. జిల్లాల్లో నువ్వు 13 వేల హెక్టార్ల సాధారణ సాగువిస్తీర్ణం కాగా, పెసర 6 వేల హెక్టార్లలో సాగుచేసేవారు. జూన్ చివరి వారంలో దర్శి, మార్కాపురం ప్రాంతాల్లో సజ్జ సాగులోకి రావాల్సిఉన్నా.. చినుకు రాలక  పంటవేయలేదు.  ఆగస్టు నెలాఖరు వరకు కందిపంట సాగుకు అవకాశం ఉన్నప్పటికీ.. సాధారణ విస్తీర్ణంలో 50శాతం కూడా సాగయ్యే పరిస్థితి కనిపించడంలేదు.
 
పంట కాలువల్లో నీరేదీ...
వేసవి మండుటెండలకు బోరుబావుల్లోని నీటిమట్టాలు పడిపోవడంతో పంటలను రక్షించుకోవడానికి రైతులు పడుతున్న పాట్లు వర్ణణాతీతం. వేసవి పత్తితో పాటు ఆరుతడి పంటల సాగు ప్రశ్నార్థకమైంది. కృష్ణా డెల్టాకు 10 టీఎంసీల నీటి విడుదలంటూ.. ఆతర్వాత 3.6 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని నిర్ణయించారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చే సినప్పటికీ జిల్లాలోని కొమ్మమూరు కాలువకు నీటిబొట్టు కూడా రాలేదు. నాగార్జున సాగర్ నీటి సామర్థ్యం ప్రస్తుతం 517 అడుగులకు పడిపోయింది.
 
దీనిబట్టి కృష్ణాడెల్టా పరిధిలో ఆఖరున ఉన్న కొమ్మమూరు కాలువకు తాగు, సాగునీటి సమస్య పొంచిఉంది. కొమ్మమూరు కాలువ కింద లక్ష ఎకరాలు సాగవుతోంది. వందలాది మంచినీటి చెరువులున్నాయి. పర్చూరు, ఇంకొల్లు, బల్లికురవ, మార్టూరు, యద్ధనపూడి, సంతమాగులూరు మండలాల్లో ఇప్పటికే సాగయిన సుమారు 20 వేల ఎకరాల పత్తి నీటితడుపు లేక ఎండిపోతోంది. వరి సాధారణ సాగువిస్తీర్ణం 3,09,363 హెక్టార్లు కాగా ప్రస్తుత ఖరీఫ్‌లో 40 వేల నుంచి 50 వేల ఎకరాల్లో మాత్రమే సాగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.   
 
విత్తన పంపిణీ అంతంత మాత్రమే..
వర్షాభావంతో ఖరీఫ్ పంటలువేసే రైతులకు ముందుగా కొద్దిపాటి ఆదాయాన్ని ఇచ్చే నువ్వు, పెసర పంటలు దక్కకుండా పోయాయి. ప్రత్యామ్నాయ పంటలుగా కంది, ఆముదాలు, జొన్న మంచిదని అధికారులు చెబుతున్నా... విత్తన పంపిణీ మాత్రం అరాకొరాగానే ఉంది. జిల్లాలో కంది సాగుకు 2424 క్వింటాళ్ల విత్తనం అవసరం కాగా, ప్రస్తుతం 882 క్వింటాళ్లు మాత్రమే స్టాకు అందుబాటులో ఉంది. ఆముదాల విత్తనాలు 50 క్వింటాళ్లు అవసరమని తేల్చగా.. నిల్వలు అందుబాటులోకి రాలేదు. మొక్కజొన్న నిల్వలూ అదేపరిస్థితిలో ఉంది. మరోప్రధాన పంటగా ఉన్న వేరుశెనగ సాగుకు 3వేల క్వింటాళ్ల విత్తనం పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ.. ఒక్క క్వింటా కూడా నిల్వల్లేకపోవడం గమనార్హం.
 
రుణం కరువై...వడ్డీ భారమై
జిల్లా వ్యాప్తంగా 7.5 లక్షల మంది రైతులుండగా.. ఇందులో కౌలుై రెతులు 1.50 లక్షల మంది సాగుపై ఆధార పడి జీవిస్తున్నారు.  అధికార టీడీపీ మాటలు నమ్మి జాతీయ బ్యాంకులకు చెల్లించని బకాయిలు మొత్తం రూ.5,600 కోట్లు కాగా, 29 పీడీసీసీబీ శాఖల పరిధిలో రైతులు తీసుకున్న రుణాలపై మాఫీ వర్తిస్తే రూ. 488.67 కోట్ల మేర లబ్ధిచేకూరుతోంది.  దీంతో రైతులు కిందటేడాది పంట రుణాలను చెల్లిస్తేనే.. ప్రస్తుత ఖరీఫ్ సాగు పెట్టుబడికి రుణం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ తాత్సారంతో ఇప్పటికే వడ్డీ రాయితీ వర్తించకపోగా.. అసలు రుణమొత్తంతో పాటు 11.07శాతం వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement