సాక్షి ప్రతినిధి, వరంగల్ : కార్తెలు కరిగిపోతున్నాయి... నెలలు గడచి పోతున్నాయి... ఆకాశం వైపు ఆర్తిగా చూస్తున్న అన్నదాతల ఆశలు మాత్రం నెరవేరడంలేదు. వరుణుడు కరుణించడం లేదు. అదును దాటిపోతున్నా... వానలు కురవడం లేదు. పొడిపొడిగా కురిసిన తొలకరి వర్షాలకు వేసిన పంటలకు ఇప్పుడు తడి సరిపోవడం లేదు. వేసిన కొద్ది పంటలకు నీరు లేక... పడావుగా ఉన్న భూముల్లో పంటలు వేయలేక జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా ఉంది.
ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలు గడుస్తున్నా... ఇప్పటికీ ఓ మోస్తరు వర్షాలు కురియలేదు. దుక్కులు చేసుకునే స్థాయిలో కూడా వర్షాలు పడలేదు. ఫలితంగా ఈ ఏడాది జిల్లాలో సాగుకు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది అధిక వర్షాలతో చేతికి వచ్చిన పంటలు నష్టపోయిన రైతుకు... ఈ సంవత్సరం కరువు పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. పంటల సాగుకు కీలకమైన జూలైలో వానలు కురవకపోవడంతో వరి వంటి ప్రధాన ఆహార పంటల సాగుకు అదును దాటిపోతోంది. మెట్ట పంటలు వేసే అదును ముగియడంతో ఈ ఏడాది సాగుపై రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి.
2002 తర్వాత ఇదే మొదటిసారి...
వర్షాభావంతో జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నారుు. జూన్‌లో 137.2 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉంది. 53.2 శాతం తక్కువగా 64.2 మిల్లీ మీటర్ల వర్షమే కురిసింది. వరి నాట్లు, ఇతర పంటలన్నీ ఎక్కువగా సాగు చేసే జూలైలో శుక్రవారం (ఈ నెల 25) వరకు జిల్లాలో 232 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాలి. 87.2 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది.
సాగుకు కీలకమైన జూలైలోనే 59 శాతం తక్కువగా వానలు పడ్డాయి. ఖరీఫ్ ఆరంభమైన జూన్ 1 నుంచి జూలై 25 వరకు జిల్లాలో 369.2 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా.. 151.4 మిల్లీమీటర్ల వర్షాలే కురిశాయి. 59 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. జూన్, జూలైలో ఇంత తక్కువ వర్షాలు కురిసిన పరిస్థితి 2002 తర్వాత జిల్లాలో ఇదే మొదటిసారి.
47 శాతం భూములు పడావుగా మారే అవకాశం
వానలు లేకపోవడంతో జిల్లాలో పంట సాగు పరిస్థితి దయనీయంగానే ఉంది. ఖరీఫ్‌కు సంబంధించి జిల్లాలో 5.03 లక్షల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం ఉంది. వర్షాలు లేకపోవడంతో ఈ ఏడాది ఇప్పటికి కేవలం 3.06 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగు చేశారు. జిల్లాలో సాగుకు అనువైన భూముల్లో 47 శాతం వరకు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. పంటల సాగుకు అదును దాటిపోతుండడంతో ఈ భూములన్నీ ఈ ఏడాది పడావుగానే ఉండే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా వరి సాగుకు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నారుు.
జిల్లాలో వరి పంట సాధారణ సాగు విస్తీర్ణం 1,42,435 హెక్టార్లు. ఇప్పటికి కేవలం 22,600 హెక్టార్లలోనే నాట్లు వేసినట్లు వ్యవసాయ శాఖ నివేదిక చెబుతోంది. జూలైలోనే నాట్లు వేసేందుకు ఎక్కువ మంది రైతులు నార్లు పోసుకుంటుంటారు. ఇప్పుడు ఈ నార్లు ము దిరిపోయాయి. వర్షాలు వస్తాయనే ఆశలు సన్నగిల్లుతుండడం, ఇప్పుడు నార్లు పోసినా పంటలకు తెగుళ్ల బెడద పొంచి ఉండడంతో ఈ ఏడాది జిల్లాలో వరి సాగు విస్తీర్ణం పెద్దగా పెరిగే పరిస్థితి కనిపించడంలేదు.
జిల్లాలో మరో ప్రధాన పంటపత్తి సాధారణ సాగు విస్తీర్ణం2,40,881 లక్షలహెక్టార్లు. ఇప్పటికి 2,24,000 హెక్టార్లలో ఈ పంట సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. పత్తిలో ఎక్కు వ శాతం వర్షాధారంగా సాగు చేసినవే. వర్షాలు లేకపోవడంతో పత్తి మొక్కలు ఎండిపోతున్నాయి. వీటిని కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో సరిగా మొలకెత్తకపోవడంతో రైతులు రెండోసారి విత్తనాలు వేశారు. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నాయి. వర్షాల తీరు ఇలాగే ఉంటే పంటల చేతికి వచ్చే ఆశలు తక్కువేనని రైతులు వాపోతున్నారు.
వానల్లేవ్..పంటల్లేవ్
Published Sat, Jul 26 2014 2:07 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement