సాక్షి, రంగారెడ్డి జిల్లా: చినుకు కురవక.. నాటిన విత్తు మొలకెత్తక.. అన్నదాత తీవ్ర ఆందోళనచెందుతున్నాడు. 51 శాతం లోటు వర్షపాతం కారణంగా ఖరీఫ్ సీజన్‌పై జిల్లా రైతులు ఆశలు వదులుకుంటున్నారు. సీజన్ ప్రారంభంలో ఎంతో ఉత్సాహంతో సాగు పనులకు దిగిన రైతన్నకు అడుగడుగునా అవాంతరాలే ఎదురయ్యాయి. ఖరీఫ్ మొదలైన నాటినుంచి వర్షాలు ముఖం చాటేయగా.. మరోవైపు ఆర్థిక చేయూత ఇవ్వాల్సిన బ్యాంకులు రుణ వితరణకు బ్రేకులు వేశాయి. తాజాగా విత్తనాలు వేసే గడువు ముగిసిపోయింది. ముగిసేనాటికి సైతం పరిస్థితులు అనుకూలించకపోవడంతో జిల్లా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
సగానికి పడిపోయిన వర్షపాతం
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా జూన్ మొదటివారం నుంచి వర్షాలు కురుస్తాయి. కానీ ఈ సారి నెలకొన్న విచిత్ర పరిస్థితుల ప్రభావంతో వరుణుడు ముఖం చాటేశాడు. జూన్‌లో తొలకరి వర్షాలు పలకరించినా.. ఆ తర్వాత వర్షాల జాడ లేదు. జులైలో ఒకట్రెండు వర్షాలు కురిసినప్పటికీ వాటిప్రభావం విత్తనాలు వేసే స్థాయిలో లేకపోవడంతో రైతులు నిరాశలో కూరుకుపోతున్నారు. ఆగస్టు రెండోవారం నాటికి విత్తనాలు వేసే గడువు ముగుస్తుంది. అయితే ఈ సమయంవరకు వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. ఈ సీజన్లో జిల్లాలో 58.7 సెంటీమీటర్ల వర్షం కురవాలి. కానీ 15.4 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదు కావడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది.
ఇప్పటివరకు కనీసం 31.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా కొద్దోగొప్పో పంటలు చేతికందుతాయనే ఆశలుండేవి. ఇప్పటికే విత్తనాలు వేసినప్పటికీ సకాలంలో వర్షాలు పడకపోవడంతో ఆయా పంటలు చేతికొచ్చే అవకాశం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సగం కంటే తక్కువగా వర్షపాతం నమోదు కావడంతో జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఈమేరకు వారు నివేదికలు తయారు చేస్తున్నారు.
17 మండలాల్లో పడిపోయిన భూగర్భజలాలు..
వర్షాబావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా పడిపోయాయి. భూగర్భజల శాఖ తాజా గణాంకాల ప్రకారం జిల్లాలోని 37 మండలాలకు గాను 17 మండలాల్లో భూగర్భజలాలు పడిపోయాయి.
గతేడాది ఇదే సమయంలో ఉన్న నీటి మట్టాలతో ప్రస్తుత నీటి మట్టాలను పోల్చుతూ ఆయా నీటి మట్టాలు భారీగా పడిపోయినట్లు అధికారులు తేల్చారు. ఇందులో ఇబ్రహీంపట్నం, కీసర, కుత్భుల్లాపూర్, సరూర్‌నగర్, శామీర్‌పేట్, ఉప్పల్, బాలానగర్, గండీడ్, మల్కాజ్‌గిరి, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, శంకర్‌పల్లి, బంట్వారం, బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు, యాలాల మండలాలున్నాయి.
కరువు ఛాయలే..!
Published Sun, Aug 10 2014 11:25 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement