ఆదర్శం అంతర్థానం!
- ఆదర్శ రైతులను తొలగిస్తామన్న సీఎం
- కొత్త ప్రభుత్వం కొలువుతీరిన వారానికే అన్నదాతల వెన్ను విరిచే ప్రయత్నం
విశాఖ రూరల్: చంద్రబాబు ప్రభుత్వం కొలువుతీరిన వారం రోజులకే రైతుల వెన్ను విరిచే కార్యక్రమాలు మొదలయ్యాయి. వ్యవసాయాభివృద్ధికి దోహదపడే ఆదర్శరైతు వ్యవస్థ నిర్వీర్యానికి పూనుకుంటోంది. అన్నదాతలకు అండగా ఉండే వీరిని తొల గించేందుకు సిద్ధమవుతోంది. ఏడాదిన్నరగా గౌరవ భృతి అంద కపోయినా.. రైతులకు వెన్నుదన్నుగా ఉంటున్నవారిని పక్కనపెట్టే ఆలోచన పట్ల రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
రైతులకు బాసటగా నిలుస్తూ, ఆధునికసాగు పద్ధతులను రైతులకు చేరవేసే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి 2007లో ఆదర్శ రైతు పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం జిల్లాలో 1958 మందిని ఆదర్శ రైతులుగా నియమించారు. వీరికి ఒక్కొక్కరికీ నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవ భృతి చెల్లించాలని నిర్ణయించారు.
వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదు. వారికి గౌరవభృతిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా సక్రమంగా అందించలేదు. ఇప్పట వరకు మొత్తం రూ.2.82 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనితీరు బాగోలేదంటూ వీరిలో కొందరిని అధికారులు తొలగించారు. అలాగే మరికొంత మంది వివిధ ఎన్నికల్లో పోటీ చేయడం, ఇతరత్రా కారణాల వల్ల జిల్లాలో 389 ఆదర్శ రైతుల పోస్టులు ఖాళీ అయ్యాయి. రెండేళ్లుగా వీటిని భర్తీ చేయలేదు.
ఇదేనా చిత్తశుద్ధి!
కొత్త ప్రభుత్వమైనా తమకు సక్రమంగా వేతనాలు ఇస్తుందని ఆదర్శరైతులు ఆశించారు. కానీ వారిని తెలుగుదేశం ప్రభుత్వం వారిని తొలగిస్తున్నట్టు ప్రకటించడంతో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వ్యవసాయాభివృద్ధి కోసం రైతుల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నించాల్సిన ఆదర్శ రైతులను టీడీపీ ప్రభుత్వం అప్పుడే రోడ్డెక్కి ఆందోళనలకు దిగేలా చేసింది. చంద్రబాబు నిర్ణయం పట్ల ఆదర్శ రైతుల సంఘం మండిపడుతోంది. నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రంలో ఉన్న 48 వేల ఆదర్శ రైతులందరూ ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి:
ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలి. వ్యవస్థను రద్దు చేసే కన్నా ప్రక్షాళన చేసి తప్పులు సరిదిద్దాలి. కార్మిక శాఖ ఆదేశాల మేరకు జీతం ఇవ్వాలి. వ్యవస్థ ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు.
- సోమునాయుడు, ఆదర్శరైతు, పరవాడ మండలం
బాగా పనిచేస్తున్నాం:
2007లో దివంగత సీఎం వైఎస్సార్ మంచి ఉద్దేశంతో ఈ వ్యవస్థను ప్రారంభించారు. నాటి నుంచి రైతులు, వ్యవసాయాధికారులు, బ్యాంకులతో అనుసంధానంగా పనిచేస్తున్నాం. పార్టీలకతీతంగా రైతుల పక్షానే ఉంటున్నాం. ఆదర్శరైతుల రిక్రూట్‌మెంట్ ఏకపక్షంగా జరిగిందనే నెపంతో సీఎం చంద్రబాబు వ్యవస్థను రద్దు చేస్తామనడం సమంజసం కాదు.
- పాటూరు వెంకట్రావు, కె.కోటపాడు మండలం
రుణమాఫీకి సహకరిస్తాం
రుణ మాఫీ అమలు కష్టతరం. అయినప్పటికీ సీఎం చంద్రబాబుకు సహకరిస్తూ మావంతు కృషి చేస్తాం. రైతుల రుణమాఫీకి మా వంతు సాయంగా ఒక నెల జీతం(వెయ్యి రూపాయల జీతాన్ని) అందిస్తాం. ఆదర్శరైతుల్లో డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు. వ్యవస్థను రద్దు చేయకుండా పనిచేయని వారిని తీసేసి మమ్మల్ని ఆదుకోవాలి.
- వంటాకు రెడ్డినాయుడు, గొండుపాలం
ఆభరణాలు వేలం వేస్తారట..
నాది చీడికాడ మండలం అర్జునగిరి. నాకు రెండెకరాల పొలం ఉంది. చెరకు పండిస్తాను. 2011లో నాలుగు తులాల బంగారు ఆభరణాన్ని కుదువపెట్టి రూ.40వేలు వ్యవసాయ రుణం తీసుకున్నారు. మెట్టభూమి కావడంతో రెండేళ్లుగా పంట కలిసిరాలేదు. అప్పు తీర్చలేకపోయాను. ఇంతలో చంద్రబాబునాయుడు వ్యవసాయ రుణాలు మాఫీ అంటూ హామీ ఇచ్చారు. సంతోషించాను. అయితే అప్పు ఇచ్చిన చోడవరం ఆంధ్రాబ్యాంక్ వారు చెల్లించాలంటూ శుక్రవారం నోటీసు పంపారు. లేదంటే ఈనెల 20న ఆభరణాన్ని వేలం వేస్తామని అందులో పేర్కొన్నారు. ఆందోళనగా ఉంది.
-బోడాల రాజబాబు, రైతు, అర్జునగిరి.