ఆశలన్నీ.. రుణమాఫీ పైనే | Hopes to expand on .. | Sakshi
Sakshi News home page

ఆశలన్నీ.. రుణమాఫీ పైనే

Published Fri, May 30 2014 1:38 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఆశలన్నీ.. రుణమాఫీ పైనే - Sakshi

ఆశలన్నీ.. రుణమాఫీ పైనే

  •     రైతులను నమ్మించి ఓట్లు దండుకున్న టీడీపీ
  •     జిల్లాలో రూ.9,137 కోట్ల పంట రుణ బకాయిలు
  •     అన్నదాతల్లో అయోమయం - హామీ అమలుపై సందిగ్ధం
  •  రైతు రుణమాఫీ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల్లో ప్రకటించిన ప్రధాన హామీ ఇది. ఆ పార్టీ గెలుపులో ఈ హామీ కూడా ప్రధాన భూమిక పోషించిందనడంలో సందేహం లేదు. మరికొద్దిరోజుల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పుడు రైతుల ఆశలన్నీ రుణాల మాఫీపైనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేసి చూపిస్తాం.. అంటూ మాట్లాడిన టీడీపీ నాయకులు.. ఫలితాల తర్వాత దాన్ని దాటవేస్తుండటం అన్నదాతలకు ఆందోళన కలిగిస్తోంది. రుణ మాఫీ అమలుపై అనుమానాలు రేకెత్తిస్తోంది.
     
    మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ రైతు రుణాల మాఫీ అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకుంది. దీన్ని విస్తృతస్థాయిలో ప్రచారం చేసింది. రుణమాఫీ చేసి తీరుతామంటూ అన్నదాతలను నమ్మించింది. ఎన్నికల్లో లబ్ధి పొంది అధికారం దక్కించుకుంది. అప్పులు తీర్చేస్తామంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నమ్మకంగా చెబుతున్నా.. అన్నదాతల్లో ఏదో మూలన సందేహం వెంటాడుతూనే వచ్చింది.

    అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లూ వ్యవసాయం, రైతులను పట్టించుకోకుండా.. హైటెక్ ముఖ్యమంత్రిగా వెలుగొందిన చంద్రబాబు రుణమాఫీ చేస్తారా అనే సందేహం ఉన్నా సరే ఓట్లు వేశారు. తీరా ఇప్పుడు చంద్రబాబు గానీ, ఆ పార్టీ నేతలు గానీ రుణమాఫీ హామీని అమలు చేస్తామని ఎక్కడా స్పష్టం చేయడం లేదు. ఇది రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అనుమానాలున్నా సరే టీడీపీని గెలిపించిన అన్నదాతలు రుణమాఫీపై మెండుగా ఆశలు పెట్టుకుని ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నారు.
     
    చంద్రబాబు హామీతో అప్పు చెల్లించని రైతులు...

    గత ఏడాది ఖరీఫ్‌తోపాటు అంతకు ముందు రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. జిల్లాలో దాదాపు రూ.9,137 కోట్ల బకాయిలున్నాయి. ‘అన్నదాతలారా ఎవరూ బ్యాంకులకు అప్పు కట్టకండి. మేం అధికారంలోకి వస్తే రుణాలు చెల్లిస్తాం...’ అంటూ చంద్రబాబునాయుడు పాదయాత్ర సమయంలో విస్తృతంగా ప్రచారం చేయడంతో  దాదాపు జిల్లా రైతులంతా తిరిగి అ్ష్మప్పులు చెల్లించలేదు. తన తొలి సంత కం రుణమాఫీపైనే చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అనంతరం ఆ ఫైలుపై తొలి సంతకం చేస్తారని జిల్లాలోని రైతులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
     
    అన్నదాతల్లో ఆందోళన...
     
    ఒక పక్క రుణాలు మాఫీ అవుతాయనే ఆశ.. మరోవైపు బ్యాంకర్ల వద్ద పరువుపోతుందనే భయం.. ఏం చేయాలో పాలుపోక రైతులు ఆవేదన చెందుతున్నారు. అప్పు చెల్లిద్దామంటే చేతిలో డబ్బు లేదు. ప్రభుత్వం చెల్లిస్తుందా.. అంటే స్పష్టత లేదు. బ్యాంకర్ల ఒత్తిళ్లు తట్టుకోలేక రైతులు సతమతమవుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం రుణాలు మాఫీ చేయకుంటే రైతు బతుకు అధోగతే. వడ్డీ రాయితీ లేక, లక్షలకు లక్షలు చెల్లించలేక ఆస్తులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తే ప్రమాదం ఉంది.  
     
     ఖరీఫ్ రుణాలు ఇచ్చేనా...
     పంట రుణమాఫీపై ప్రభుత్వం జూన్ 15లోగా స్పష్టమైన నిర్ణయం తీసుకుని బ్యాంకు అధికారులకు మార్గదర్శకాలు ఇస్తే ఖరీఫ్‌లో కొత్త రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందని రైతులు ఆశతో ఉన్నారు. రుణమాఫీపై ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వటంతో రైతులు రుణాలు చెల్లించకుండా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కొత్త రుణం మంజూరు చేస్తారా, లేదా అనే అనుమానాలు రైతులను వెంటాడుతున్నాయి. ఇప్పటి వరకు బ్యాంకు అధికారులు కూడా రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు జారీ చేయలేదు. ప్రభుత్వం నుంచి రుణమాఫీపై ఆదేశాలు వస్తే రైతులకు రుణమాఫీ చేయాలా, కొత్త రుణాలు మంజూరు చేయాలా అనే అంశంపై చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లు చెబుతున్నారు.
     
     హామీని నిలబెట్టుకోవాలి
     ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన రుణమాఫీని వెంటనే అమలు చేస్తే రైతులకు వెసులుబాటు ఉంటుంది. ఖరీఫ్ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుండగా ప్రస్తుత రుణమాఫీ వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే రెండు పంటల్లో నష్టపోయిన రైతులకు కొత్తగా అప్పులు తేవాలంటే తలకు మించిన భారమే.    
     - కూనసాని లకో్ష్మజీ,కొమాళ్లపూడి కోఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్
     
     అయోమయం తొలగించాలి
     ఖరీఫ్ సాగుకు రైతులు సంసిద్ధులు కావాలంటే ఆర్థిక వెన్నుదన్ను అవసరం. రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను రద్దు చేస్తారనే నమ్మకంతో బకాయిలు చెల్లించటం లేదు. బ్యాంకర్లు డిమాండ్ చేయటం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ పనులు ప్రారంభించాలంటే పెట్టుబడి కావాల్సిందే. రుణమాఫీ జరిగి రైతులకు పంట రుణాలు ఇస్తేనే సాగు సజావుగా సాగుతుంది.
     - కె.సత్యనారాయణ, రైతు, కొమాళ్లపూడి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement