నిండా నూరు.. ప్రజలకేం చేశారు
► అన్నదాతల ఆక్రందనలు
► ఆడపడుచుల ఆవేదనలు
► నిరుద్యోగుల నిట్టూర్పులు
► చితికిన చేనేత బతుకులు
► ఇదీ నారా వారి నూరు రోజుల పాలన
సాక్షి, ఏలూరు/ఏలూరు (సెంట్రల్) : హామీలతో ప్రజల్ని నమ్మించి గద్దెనెక్కిన చంద్రబాబు పాలనకు మంగళవారం నాటికి వంద రోజులు పూర్తయింది. ఆక్రందనలతో అన్నదాతలు.. ఆవేదనతో ఆడపడుచులు.. చితికిన చేనేతలు.. నిరాశా, నిస్ప్పహలతో నిరుద్యోగుల నిట్టూర్పుల నడుమ వందరోజుల సంబ రాలు చేసుకునేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యూరుు.
ఒక్కటీ అమలు కాలేదు
ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబునాయుడు గొప్పగా ప్రచారం చేసుకుని లబ్ధి పొందిన అంశం వ్యవసాయ రుణాల మాఫీ. దీనిపైనే తొలి సంతకం పెడతామని ఆయన ప్రకటించారు. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్నారు. చివరగా ఇంటికో ఉద్యోగమంటూ యువతకు గాలం వేశారు. ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక.. గడచిన వంద రోజుల్లో హామీల ఊసెత్తకుండా పబ్బం గడిపేసుకున్నారు.
రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్న ఆయన ఆ అం శాన్ని మరుగునపెట్టి రుణాల మాఫీ సాధ్యాసాధ్యాలపై కమిటీ వేస్తూ తొలి సంతకం పెట్టారు. మొత్తంగా గడచిన వంద రోజుల్లో నవ్యాంధ్ర రాజధానిని సింగపూర్‌లా సింగారిద్దామా.. మలేసియాలా మలుద్దామా.. అంటూ పగటి కలలతోనే చంద్రబాబు కాలం గడిపారు. ‘ఆలూ లేదు చూలూ లేదూ.. కొడుకు పేరు సోమలింగం’ అన్న రీతిలో చంద్రబాబు పాలన సాగిందంటూ ప్రతిపక్ష పార్టీలు నూరు రోజుల నారా వారి పాలనపై పెదవి విరుస్తున్నాయి.
ప్రజలకు ఒరిగింది శూన్యం
అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలు. తెలుగుదేశం పాలన పండిందా లేదా తెలుసుకునేందుకు ఈ వంద రోజుల పాలన చాలు. గడచిన వంద రోజుల పాలనలో అధికారి పార్టీ వారికి సన్మానాలు, సత్కారాలు, ప్రచార పటాటోపాలు తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యం. ప్రతిపక్షం నోరు నొక్కే పనులు, రియల్టర్లకు లాభదాయక వ్యవహారాలు, తెలుగు తమ్ముళ్లకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు బాగా జరిగారుు. అన్నదాతల గోడు పట్టించుకోలేదు. డ్వాక్రా రుణాలు రద్దు చేయలేదు.
యువతకు ఒక్క ఉద్యోగమైనా ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి లేదు. చేనేత కార్మికులకు చేయూతనిచ్చే నాథుడు లేడు. నిత్యావసర సరుకుల ధరలను అదుపులో పెట్టలేదు. జిల్లా విషయానికి వస్తే ప్రతిష్టాత్మకం...ప్రతిష్టాత్మకం అన డమే తప్ప పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న దాఖలాలు లేవు. ఖరీఫ్ ప్రారంభమై మూడు మాసాలు గడుస్తున్నా ఒక్క రైతుకైనా రుణమివ్వలేదు. చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తున్నా రు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వారికి మేలు చేకూర్చేలా పోరాడతాం.
- ఆళ్ల నాని, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా
ప్రజల ఆలోచలన కు, ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు వంద రోజుల పాలన సాగింది. పదేళ్లలో ఏర్పడిన విద్యుత్ కోతలు అధిగమించడమేకాక 24 గంటల విద్యుత్ సరఫరాకు మార్గం సుగమం చేయడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. పారిశ్రామికీకరణ దిశగా కృషి చేస్తూ హీరో మోటార్స్ సంస్థను రాష్ట్రానికి తీసుకురావడం శుభపరిణామం. సంక్షేమ పథకాలను మరింత మెరుగుపరిచి పేద ప్రజ లకు మంచి చేయగలిగే దిశగా భవిష్యత్ పాలన సాగుతుంది.
- అంబికా కృష్ణ, అధ్యక్షుడు, టీడీపీ వాణిజ్య విభాగం
బాగుంది కానీ...
చంద్రబాబు వంద రోజుల పాలన బాగానే ఉంది కానీ.. కార్యక్రమాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆలోచనలు బాగానే ఉన్నాయి. ఆచరణే చాలా ఆలస్యంగా ఉంది. శషబిషలకు తావు లేకుండా రైతులకు రుణమాఫీ సక్రమంగా అమలు జరపాలి. రాజధాని తదితర అంశాలపై కూడా ప్రజల్లో అనుమానాలకు తావు లేకుండా స్పష్టంగా వ్యవహరించాలి.
- భూపతిరాజు శ్రీనివాసవర్మ, జిల్లా అధ్యక్షుడు, బీజేపీ
బడాయి పాలన
చంద్రబాబు ఎన్నికలకు ముందు తర్వాత ప్రజలకు వందకు పైగా వాగ్దానాలు చేశారు. వంద రోజుల్లో కనీసం ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు కానీ.. ఉన్న ఉద్యోగాలు చాలావరకు ఊడిపోయాయి. ప్రజలకు వీసమెత్తు మేలు చేయకపోగా, ఇప్పటికీ చంద్రబాబు వాగ్దానాల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది కచ్ఛితంగా మోసపూరిత పాలన. దీనిపై ప్రజల్లో ఇప్పటికే అసంతృప్తి పెల్లుబుకుతోంది. భవిష్యత్‌లో ఇది ఉద్యమ రూపం కూడా దాలుస్తుంది. వాటికి సీపీఎం నాయకత్వం వహిస్తుంది. - మంతెన సీతారామ్, జిల్లా కార్యదర్శి, సీపీఎం
వంద రోజుల పాలనలో జీరో
ఎన్నికల మేనిఫెస్టోలో ఘనంగా చెప్పుకున్న రుణమాఫీ హామీ అమలుపై చంద్రబాబునాయుడికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. ఉంటే గజిబిజి నిబంధనలతో కూడిన 174 జీవోను జారీ చేసేవారు కాదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇప్పిస్తానని వాగ్దానం చేశారు. ఆడిన మాట తప్పారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే 2.50 లక్షల మంది కౌలు రైతులుంటే.. ఇంకా రెండు లక్షల మందికి గుర్తింపు కార్డులే లేవు. రుణాలమాఫీ సంగతలా ఉంచితే, జిల్లాలో ఒక్క రైతుకు కూడా కొత్త రుణం పుట్టలేదు. మిగిలిన హామీలను పరిగణనలోకి తీసుకుంటే చంద్రబాబు వంద రోజుల పాలనలో సాధించింది జీరో.
-కె.శ్రీనివాస్, అధ్యక్షుడు, ఏపీ కౌలురైతుల సంఘం
డాబుసరి మాటలే
ఎన్నికల ముందు జాబు కావాలంటే బాబు రావాలన్నారు. ఇంటికో ఉద్యోగమన్నారు. లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిజమే కాబోలనుకుని యువత మొత్తం సైకిలెక్కి సవారీ చేశారు. తీరా బాబు వచ్చారు. కానీ ఎవరికీ జాబు రాలేదు. నిరుద్యోగ భృతి కూడా లేదు. గద్దెనెక్కించిన యువతకు చంద్రబాబు మొండిచేయి చూపారు. దీన్ని యువత క్షమించదు. సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధిచెప్పి తీరుతుంది.
-పెద్దిరెడ్డి ప్రదీప్, యువజన కాంగ్రెస్ నాయకుడు
బాబు పాలన భేష్
వాగ్దానాల అమలు దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు శరవేగంగా ముందుకు సాగుతున్నారు. రైతు రుణమాఫీ గురించి చిత్తశుద్ధితో ఆయన చేస్తున్న కృషే ఇందుకు నిదర్శనం. ఎన్నో ఆటంకాలు, ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ, నిధుల కొరత వేధిస్తున్నప్పటికీ ఎన్నికల హామీల అమలులో ఎలాంటి లోపం తలెత్తకుండా ఆయన పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాజధాని, జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్టుల విషయంలో ఆయన వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటున్న తీరు అభినందనీయం. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుని మరీ స్వాగతిస్తున్నారు.
- తోట సీతారామలక్ష్మి, ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు, టీడీపీ
పరనింద.. ఆత్మస్తుతి తప్ప పాలన శూన్యం
రుణమాఫీ పేరిట రైతులను, డ్వాక్రా మహిళలను, ఉద్యోగాల పేరిట యువతను మోసం చేసి అడ్డదారిలో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. వంద రోజుల పాలనలో ఆయన ప్రజలకు చేసింది శూన్యం. కాంగ్రెస్ పాలనలో కొద్దిపాటి ధరల పెరుగుదలకే గగ్గోలు పెట్టిన బాబుకు తన పాలనలో ఆకాశన్నంటిన ధరలు కనబడకపోవడం శోచనీయం. ఒక్క ముక్కలో చెప్పాలంటే పరనింద.. ఆత్మస్తుతితో నూరు రోజుల పాలనను పూర్తి చేశారు.
- ముత్యాల రత్నం, అధ్యక్షుడు, డీసీసీ
రాజధాని జపంతో సరి
ప్రజ సంక్షేమాన్ని, రైతు సమస్యలను గాలికొదిలి రాజధాని జపం చేస్తూ వంద రోజులు గడిపేశారు. ఈ వంద రోజుల్లో రియల్టర్లను ఎలా బాగు చేద్దామన్న యావ తప్ప తానిచ్చిన వాగ్దానాల వైపు చంద్రబాబు దృష్టి సారించలేదు. రైతుల్ని మోసం చేసి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా పాలన సాగింది. గత ప్రభుత్వాలను విమర్శిస్తూ.. ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు గుప్పిస్తూ కాలక్షేపం చేశారు. ఇకముందు కూడా ప్రజా సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తారన్న నమ్మకం లేదు.
-డేగా ప్రభాకర్, జిల్లా కార్యదర్శి, సీపీఐ