పంట రుణాల మాఫీ హామీ అమలులో ప్రతిపాదనల దశలోనే సగం మంది రైతులకు ప్రభుత్వం టోపీ పెట్టింది. 4.73 లక్షల మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని బ్యాంకర్లు పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆమోదముద్ర వేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. నిబంధనల మేరకు రుణం తీసుకున్న రైతులకే మాఫీ వర్తింపజేస్తామని ప్రభుత్వం సరికొత్త మెలిక పెట్టడంపై బ్యాంకర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఒక్క సంతకంతో పంట రుణాలను మాఫీ చేసి.. రైతులకు ఉపశమనం కల్పిస్తామని ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఊరూవాడ ఊదరగొట్టిన విషయం విదితమే. జూన్ 8న సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక చంద్రబాబు చేసిన తొలి సంతకమే అపహాస్యం పాలైంది. పంట రుణాల మాఫీ విధి విధానాల రూపకల్పనకు కోటయ్య కమిటీని నియమిస్తూ సీఎం తొలి సంతకం చేశారు.
ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షల రుణం(రూ.లక్ష పంట రుణం, రూ. 50 వేలు బంగారం కుదవ పెట్టి తీసుకున్న పంట రుణం) మాఫీ చేస్తామన్నారు. ఆ మేరకైనా చేశారా అంటే అదీ లేదు.. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా మాఫీ చేసే రూ.1.5 లక్షను ఐదు దశల్లో అందిస్తామంటూ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే పంట రుణాల మాఫీకి లబ్ధిదారుల వివరాలు పంపాలని బ్యాంకర్లను ఆగస్టు 14న ప్రభుత్వం ఆదేశించింది. రుణ విముక్తికి ప్రతిపాదనలు పంపడానికి 30అంశాలతో కూడిన ప్రొఫార్మాను బ్యాంకర్లకు అందజేసింది.
ప్రతిపాదనల్లోనే వడపోత..
జిల్లాలో 40 జాతీయ, ప్రాంతీయ, సహకార బ్యాంకుల కింద ఉన్న 478 బ్రాంచుల్లో డిసెంబర్ 31, 2013 నాటికి 8,70,321 మంది రైతులు రూ.11,180.25 కోట్లను పంట రుణాలుగా తీసుకున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఆ రుణాలన్నీ మాఫీ చేయాలి. కానీ.. ఆ మేరకు రుణ మాఫీ చేయలేమని చేతులెత్తేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనల మేరకు జిల్లాలో 3.73 లక్షల మంది రైతుల పట్టాదారు పాసు పుస్తకాలు, బ్యాంకు ఖాతా నెంబరు, ఆధార్ కార్డు, రేషన్‌కార్డు తదితరాలను అనుసంధానం చేసి బ్యాంకర్లు అక్టోబర్ 31 నాటికి ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం గడువును పొడిగించడంతో శనివారం నాటికి మరో 90 వేల మంది రైతుల వివరాలు పంపారు. అంటే.. రెండు దశల్లోనూ 4.73 లక్షల మంది రైతులకు రుణ మాఫీ వర్తింపజేయాలని బ్యాంకర్లు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం విధించిన నిబంధనల వల్ల ప్రతిపాదనల దశలోనే 3.97 లక్షల మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదన్నది విశదమవుతోంది.
రోజుకో మాట.. పూటకో విధానం..
బ్యాంకర్లు పంపిన ప్రతిపాదనలను పరిశీలించి.. లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసి, ప్రకటించాల్సిన ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోంది. నిబంధనల మేరకు బ్యాంకర్లు రుణాలు ఇచ్చిన రైతులకే రుణ విముక్తి కల్పిస్తామంటూ రెండు రోజల క్రితం వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్పష్టీకరించారు. అంటే.. ఎస్‌ఎల్‌బీసీ(రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ)లో చేసిన తీర్మానం మేరకు మెట్ట, మాగాణి భూములు.. రైతులు సాగుచేసే పంటలను బట్టి ఏ మేరకు రుణాలు ఇవ్వొచ్చన్నది ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయిస్తుంది.
ఆ మేరకే బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలి. ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయించిన మొత్తం కన్నా బ్యాంకర్లు అధిక మొత్తం రుణం ఇచ్చి ఉంటే.. ఆ రుణాలను మాఫీ చేయలేమని వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించారు. రోజుకో మాట.. పూటకో విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తోండడంతో బ్యాంకర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రుణ విముక్తి లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉంటుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సగం మందికే.. రుణమాఫీ
Published Wed, Nov 26 2014 1:33 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement