machilepatam
-
ఆశలన్నీ.. రుణమాఫీ పైనే
రైతులను నమ్మించి ఓట్లు దండుకున్న టీడీపీ జిల్లాలో రూ.9,137 కోట్ల పంట రుణ బకాయిలు అన్నదాతల్లో అయోమయం - హామీ అమలుపై సందిగ్ధం రైతు రుణమాఫీ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల్లో ప్రకటించిన ప్రధాన హామీ ఇది. ఆ పార్టీ గెలుపులో ఈ హామీ కూడా ప్రధాన భూమిక పోషించిందనడంలో సందేహం లేదు. మరికొద్దిరోజుల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పుడు రైతుల ఆశలన్నీ రుణాల మాఫీపైనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేసి చూపిస్తాం.. అంటూ మాట్లాడిన టీడీపీ నాయకులు.. ఫలితాల తర్వాత దాన్ని దాటవేస్తుండటం అన్నదాతలకు ఆందోళన కలిగిస్తోంది. రుణ మాఫీ అమలుపై అనుమానాలు రేకెత్తిస్తోంది. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ రైతు రుణాల మాఫీ అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకుంది. దీన్ని విస్తృతస్థాయిలో ప్రచారం చేసింది. రుణమాఫీ చేసి తీరుతామంటూ అన్నదాతలను నమ్మించింది. ఎన్నికల్లో లబ్ధి పొంది అధికారం దక్కించుకుంది. అప్పులు తీర్చేస్తామంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నమ్మకంగా చెబుతున్నా.. అన్నదాతల్లో ఏదో మూలన సందేహం వెంటాడుతూనే వచ్చింది. అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లూ వ్యవసాయం, రైతులను పట్టించుకోకుండా.. హైటెక్ ముఖ్యమంత్రిగా వెలుగొందిన చంద్రబాబు రుణమాఫీ చేస్తారా అనే సందేహం ఉన్నా సరే ఓట్లు వేశారు. తీరా ఇప్పుడు చంద్రబాబు గానీ, ఆ పార్టీ నేతలు గానీ రుణమాఫీ హామీని అమలు చేస్తామని ఎక్కడా స్పష్టం చేయడం లేదు. ఇది రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అనుమానాలున్నా సరే టీడీపీని గెలిపించిన అన్నదాతలు రుణమాఫీపై మెండుగా ఆశలు పెట్టుకుని ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నారు. చంద్రబాబు హామీతో అప్పు చెల్లించని రైతులు... గత ఏడాది ఖరీఫ్‌తోపాటు అంతకు ముందు రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. జిల్లాలో దాదాపు రూ.9,137 కోట్ల బకాయిలున్నాయి. ‘అన్నదాతలారా ఎవరూ బ్యాంకులకు అప్పు కట్టకండి. మేం అధికారంలోకి వస్తే రుణాలు చెల్లిస్తాం...’ అంటూ చంద్రబాబునాయుడు పాదయాత్ర సమయంలో విస్తృతంగా ప్రచారం చేయడంతో దాదాపు జిల్లా రైతులంతా తిరిగి అ్ష్మప్పులు చెల్లించలేదు. తన తొలి సంత కం రుణమాఫీపైనే చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అనంతరం ఆ ఫైలుపై తొలి సంతకం చేస్తారని జిల్లాలోని రైతులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అన్నదాతల్లో ఆందోళన... ఒక పక్క రుణాలు మాఫీ అవుతాయనే ఆశ.. మరోవైపు బ్యాంకర్ల వద్ద పరువుపోతుందనే భయం.. ఏం చేయాలో పాలుపోక రైతులు ఆవేదన చెందుతున్నారు. అప్పు చెల్లిద్దామంటే చేతిలో డబ్బు లేదు. ప్రభుత్వం చెల్లిస్తుందా.. అంటే స్పష్టత లేదు. బ్యాంకర్ల ఒత్తిళ్లు తట్టుకోలేక రైతులు సతమతమవుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం రుణాలు మాఫీ చేయకుంటే రైతు బతుకు అధోగతే. వడ్డీ రాయితీ లేక, లక్షలకు లక్షలు చెల్లించలేక ఆస్తులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. ఖరీఫ్ రుణాలు ఇచ్చేనా... పంట రుణమాఫీపై ప్రభుత్వం జూన్ 15లోగా స్పష్టమైన నిర్ణయం తీసుకుని బ్యాంకు అధికారులకు మార్గదర్శకాలు ఇస్తే ఖరీఫ్‌లో కొత్త రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందని రైతులు ఆశతో ఉన్నారు. రుణమాఫీపై ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వటంతో రైతులు రుణాలు చెల్లించకుండా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కొత్త రుణం మంజూరు చేస్తారా, లేదా అనే అనుమానాలు రైతులను వెంటాడుతున్నాయి. ఇప్పటి వరకు బ్యాంకు అధికారులు కూడా రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు జారీ చేయలేదు. ప్రభుత్వం నుంచి రుణమాఫీపై ఆదేశాలు వస్తే రైతులకు రుణమాఫీ చేయాలా, కొత్త రుణాలు మంజూరు చేయాలా అనే అంశంపై చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లు చెబుతున్నారు. హామీని నిలబెట్టుకోవాలి ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన రుణమాఫీని వెంటనే అమలు చేస్తే రైతులకు వెసులుబాటు ఉంటుంది. ఖరీఫ్ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుండగా ప్రస్తుత రుణమాఫీ వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే రెండు పంటల్లో నష్టపోయిన రైతులకు కొత్తగా అప్పులు తేవాలంటే తలకు మించిన భారమే. - కూనసాని లకో్ష్మజీ,కొమాళ్లపూడి కోఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ అయోమయం తొలగించాలి ఖరీఫ్ సాగుకు రైతులు సంసిద్ధులు కావాలంటే ఆర్థిక వెన్నుదన్ను అవసరం. రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను రద్దు చేస్తారనే నమ్మకంతో బకాయిలు చెల్లించటం లేదు. బ్యాంకర్లు డిమాండ్ చేయటం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనులు ప్రారంభించాలంటే పెట్టుబడి కావాల్సిందే. రుణమాఫీ జరిగి రైతులకు పంట రుణాలు ఇస్తేనే సాగు సజావుగా సాగుతుంది. - కె.సత్యనారాయణ, రైతు, కొమాళ్లపూడి -
బందరు టీడీపీలో పదవుల లొల్లి
చైర్మన్, వైస్ పదవుల కోసం పైరవీలు రేసులో పలువురు మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ కౌన్సిలర్లలో పదవుల లొల్లీ కొనసాగుతోంది. పట్టణంలో ఉన్న 42 మున్సిపల్ వార్డులకు గానూ 29 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థులు అత్యధిక వార్డుల్లో గెలుపొందటంతో ఆ పార్టీ పాలకవర్గమే పాలన కొనసాగించనుంది. దీంతో చైర్మన్, వైస్‌చైర్మన్, కో-ఆప్షన్ సభ్యుల పదవుల కోసం గెలుపొందిన కౌన్సిలర్లలో, పార్టీ విజయానికి కృషి చేసిన ద్వితీయశ్రేణి నాయకుల్లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ పదవుల కోసం కౌన్సిలర్లు పోటీ పడుతున్నా....చైర్మన్, వైస్‌చైర్మన్ ఎవరనేదానిపై పార్టీ అధినాయకులు నోరు మెదపటం లేదు. నాయకులు ఎవరిపేరునూ ప్రకటించకపోవడంతో ఎన్నికైన కౌన్సిలర్లలో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. 14వ వార్డులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు మోటమర్రి వెంకట బాబాప్రసాద్ను చైర్మన్ చేస్తామని, దీనికి గానూ వైశ్య సామాజిక వర్గం వారు పార్టీకి ఫండ్ ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు అప్పట్లో కోరారు. నాయకులు ఇచ్చిన హామీతో వైశ్య పెద్దలు లక్షలాది రూపాయలను పోగేసి నాయకులకు అందజేశారని తెలుస్తుంది. బాబాప్రసాద్ వదిన మోటమర్రి శ్రీదేవి కూడా 35వ వార్డులో కౌన్సిలర్‌గా గెలుపొందింది. ఒకే కుటుంబంలో పోటీచేసిన ఇద్దరూ విజయం సాధించారు. బాబాప్రసాద్కు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తారనే నమ్మకంతో పట్టణంలోని వైశ్యులు మునిసిపల్ ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకే ఓట్లేశారని ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొల్లు రవీంద్రను ఇటీవల ప్రశ్నిస్తే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పంపే సీల్డ్ కవర్లో ఉన్న పేర్ల ప్రకారమే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ప్రకటిస్తామని చెప్పారు. చైర్మన్ పదవి కోసం కౌన్సిలర్లు బత్తిన దాసు(1వ వార్డు), పంచపర్వాల కాశీవిశ్వనాధం(5వ వార్డు), కొట్టే అంకావెంకట్రావు(9వ వార్డు), నారగాని ఆంజనేయప్రసాద్(28వ వార్డు), పల్లపాటి వెంకటసుబ్రహ్మణ్యం(38వ వార్డు) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గండం నుంచి ఎలా గొలా గట్టెక్కాలనే ఉద్దేశంతోనే నాయకులు పదవుల ఎంపిక వ్యవహారాన్ని పార్టీ అధినేతకు అప్పగించి సీల్డ్ కవర్లో వచ్చిన పేర్ల వారికే ఈ పదవులను కట్టబెట్టి ఎంపికలో తమ ప్రయేయం లేదని అనిపించుకుని చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రశాంతం
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 59,884 మంది విద్యార్థులకు గానూ 57,982 మంది మాత్రమే హాజరయ్యారు. 1,502 మంది గైర్హాజరయ్యారు. సంస్కృతం, తెలుగు, అరబిక్, ఉర్దూ హిందీ పరీక్షలు జరిగాయి. జిల్లాలో మాస్‌కాపీయింగ్‌కు తావులేకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని ఆర్ఐవో కె.వెంకట్రామయ్య ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. విజయవాడ నగరంలోని ప్రైవేటు కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను తాను పరిశీలించానని చెప్పారు. విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులూ పరీక్షా కేంద్రాలకు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. తొమ్మిది గంట లకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా 8.30 గంటలకే అన్ని కేంద్రాల్లో విద్యార్థినీ, విద్యార్థులను లోపలకు అనుమతించారు. కొంతమంది విద్యార్థులు పరీక్షా సమయానికి పది నిమిషాల ముందు రావటంతో హడావిడి పడ్డా రు. పరుగులు తీస్తూ పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.