ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రశాంతం
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 59,884 మంది విద్యార్థులకు గానూ 57,982 మంది మాత్రమే హాజరయ్యారు. 1,502 మంది గైర్హాజరయ్యారు. సంస్కృతం, తెలుగు, అరబిక్, ఉర్దూ హిందీ పరీక్షలు జరిగాయి. జిల్లాలో మాస్‌కాపీయింగ్‌కు తావులేకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని ఆర్‌ఐవో కె.వెంకట్రామయ్య ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. విజయవాడ నగరంలోని ప్రైవేటు కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను తాను పరిశీలించానని చెప్పారు.
విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులూ పరీక్షా కేంద్రాలకు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. తొమ్మిది గంట లకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా 8.30 గంటలకే అన్ని కేంద్రాల్లో విద్యార్థినీ, విద్యార్థులను లోపలకు అనుమతించారు. కొంతమంది విద్యార్థులు పరీక్షా సమయానికి పది నిమిషాల ముందు రావటంతో హడావిడి పడ్డా రు. పరుగులు తీస్తూ పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.