అన్నదాతకు ఆపదొచ్చింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునగడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం
=బోరుమంటున్న రైతన్నలు
=18 మండలాల్లో 13,117 ఎకరాల్లో వరి ముంపు
=అనధికారిక లెక్కల ప్రకారం 50వేల ఎకరాలుంటుందని అంచనా
సాక్షి, విశాఖపట్నం: అన్నదాతకు ఆపదొచ్చింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునగడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం తో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అధికారుల ప్రాథమిక అంచనా ప్రకా రం జిల్లాలోని 18మండలాల్లో 13,117.5 ఎకరాల్లో వరి ముంపునకు గురయింది. 1925 ఎకరాల్లో చెరకు పంటకు నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. ఇది ఇంకా పెరగవచ్చంటున్నారు. పంటపొలాలు నీటమునిగి ఉండటంతో నష్టం విషయంలో అధికారులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. మరికొన్ని మండలాల్లో పరిస్థితి పరిశీలన దశలో ఉంది. ఆయా ప్రాంతాల నివేదికలొస్తే ఇంకెంత పెరగనుందో చూడాలి. కానీ అనధికారిక లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 50వేల ఎకరాలకుపైగా వరి ముంపునకు గురైనట్టు తెలుస్తోంది.
ఇక మబ్బుపట్టిన వాతావరణంతో వరికి అగ్గితెగులు,పాముపొడ ఆశించే ప్రమాదముందని అన్నదాతలు వాపోతున్నారు. ఆరుగాలం శ్రమ వర్పార్పణం కావడంతో లబోదిబోమంటున్నారు. రోజుల తరబడి నీటి నిల్వతో చెరకు పంటకు ముప్పు తప్పదంటున్నారు. ఏమాత్రం గాలి వీచినా నేలకొరిగే ప్రమాదముందంటున్నారు. అపరాల పంటలు కుళ్లిపోతున్నాయి. ముఖ్యంగా పెసర, మినుములతోపాటు పత్తి, పొగాకు పంటలకు నష్టం వాటిల్లింది. వరి కంకులు బయటకొచ్చే దశలో నిరంతరం వర్షంతో పువ్వంతా కరిగిపోయి దిగుబడి తగ్గుతుందని రైతులు వాపోతున్నారు.
మండలాల వారీ తాత్కాలిక అంచనాలివి వరి విషయానికొస్తే పాయకరావుపేటలో 375ఎకరాలు, కోటవురట్లలో 250, వి.మాడుగులలో 350, భీమిలిలో 125,ఆనందపురంలో 125, పద్మనాభంలో 250, చోడవరంలో 1300,రాంబిల్లిలో 1425, అచ్యుతాపురంలో1137.5, అనకాపల్లిలో 1550, కశింకోటలో 300, మునగపాకలో 500, బుచ్చియ్యపేటలో 100, దేవరాపల్లిలో 450, చీడికాడలో 350, కె.కోటపాడులో 105, యలమంచిలిలో 1550,ఎస్.రాయవరంలో 2800ఎకరాలు ముంపునకు గురైనట్టు నిర్ధారించారు.