ఆదర్శం అదృశ్యం!
- ఆదర్శ రైతులకు ఏడాదిగా అందని భృతి
- బకాయిలు రూ.1.88 కోట్లు
- జిల్లాలో 389 పోస్టులు ఖాళీ
- నియామకంపై దృష్టి సారించని ప్రభుత్వం
- అన్నదాతలకు దూరమవుతున్న ప్రయోజనం
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ‘ఆదర్శ’ం మంటకలుస్తోంది. వ్యవసాయాభివృద్ధికి దోహదపడేందుకు ఏర్పాటు చేసిన ఆదర్శ రైతు వ్యవస్థ నిర్వీర్యమవుతోంది.ఏడాదిగా గౌరవ భృతి లేక.. ఖాళీ అయిన స్థానాల్లో కొత్త వారిని నియమించకపోవడంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది. ఈ వ్యవస్థను బలోపేతం చేయాలంటూ ఆదర్శ రైతులు ఉద్యమిస్తున్నా.. ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం రైతుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధిని చాటుతోంది.
విశాఖ రూరల్/నర్సీపట్నం, న్యూస్‌లైన్: అన్నదాతలకు అండగా ఉంటూ, ఆధునికసాగు పద్ధతులను రైతులకు చేరవేసే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి 2007లో ఆదర్శరైతు పథకాన్ని ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త విధానాల అమలుతోపాటు అధికారులు, రైతులకు అనుసంధానంగా వ్యవహరించడం దీని ముఖ్యోద్దేశం. పొలంబడి, శ్రీవరి వంటి నూతన ప్రయోగాలను రైతులకు వివరించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో 1958 మందిని ఆదర్శ రైతులుగా నియమించారు.
ఏడాదిగా గౌరవ వేతనం లేదు : ఆదర్శ రైతులు ఒక్కొక్కరికీ నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. కనీస వేతనం కోసం వారు డిమాండ్ చేస్తున్నప్పటికీ పట్టించుకోని ప్రభుత్వం వారికిచ్చే రూ.వెయ్యి కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఐదు ఆరు నెలలకు ఒకసారి నిధులను మంజూరు చేస్తోంది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు వీరికి రూపాయి కూడా విడుదల చేయలేదు. వ్యవసాయాభివృద్ధి కోసం రైతుల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నించాల్సిన ఆదర్శ రైతులు గౌరవ భృతి కోసం రోడ్డెకేలా చేసింది. ఇప్పట్లో వారికి రూ.1.88 కోట్లు అందించే అవకాశాలు కనిపించడం లేదు.
జిల్లాలో 389 ఖాళీలు : జిల్లాలో 1958 మంది ఆదర్శ రైతులను గతంలో నియమించగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనితీరు బాగోలేదంటూ వారిలో కొంత మందిని అధికారులు తొలగించారు. మరికొంత మంది వివిధ ఎన్నికల్లో పోటీ చేయడం, ఇతరత్రా కారణాల వల్ల జిల్లాలో 389 ఆదర్శ రైతుల పోస్టులు ఖాళీ అయ్యాయి. రెండేళ్లుగా వీటిని భర్తీ చేయలేదు. వాస్తవానికి కొత్త వారి నియామకానికి సంబంధించి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
రెండేళ్లలో జిల్లాకు ముగ్గురు ఇన్‌చార్జి మంత్రులు మారారు. ఏ ఒక్కరూ ఆ దిశగా ఆలోచన చేయకపోవడం గమనార్హం. ఇప్పట్లో ఖాళీలను భర్తీ చేసే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు. దీని బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వ భవిష్యత్తులో ఆదర్శ రైతు వ్యవస్థను కొనసాగిస్తుందా.. లేక నిర్వీర్యం చేస్తుందా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.