రాష్ట్రంలో ఈశాన్య రుతు పవనాలు రైతుకు గుండె కోతను మిగిల్చాయి. పలు జిల్లాల్లో నూర్పిడి దశలో ఉన్న వరి, వేరుశనగ దారుణంగా దెబ్బ తిన్నాయి.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఈశాన్య రుతు పవనాలు రైతుకు గుండె కోతను మిగిల్చాయి. పలు జిల్లాల్లో నూర్పిడి దశలో ఉన్న వరి, వేరుశనగ దారుణంగా దెబ్బ తిన్నాయి. మలెనాడు, కోస్తా జిల్లాల్లో వరి పంట నీట మునగగా, పాత మైసూరు ప్రాంతంలో వేరుశనగకు అదే గతి పట్టింది. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపి, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాల్లో వరి ప్రధాన పంట. కోతకు సిద్ధమైన తరుణంలో భారీ వర్షాలు కురవడంతో పంట చేలన్నీ నీటి మడుగులుగా మారిపోయాయి. చాలా మంది రైతులు కోతలను పూర్తి చేశారు. నూర్పిడికి సిద్ధమవుతున్న తరుణంలో భారీ వర్షాలు వాటిని ముంచేశాయి.
ఈ దశలో వాటిని ఇంటికి తెచ్చుకోలేక, పొలంలోనే ఉంచలేక రైతు సతమతమై పోతున్నాడు. సుమారు 25 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పాత మైసూరు ప్రాంతంలో సుమారు ఐదు వేల ఎకరాల్లో వేరుశనగకు నష్టం వాటిల్లి ఉండవచ్చని ప్రాథమిక అంచనా. అనేక జిల్లాల్లో వేరుశనగ నూర్పిడికి అవకాశం లేకపోవడంతో చేన్లపై వేసిన చెట్లలోని కాయలను ఫంగస్ ఆవరిస్తోందని రైతులు వాపోతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో తెరపినివ్వకపోతే గింజలన్నీ చేదుగా మారిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వేళ వేరుశనగను ఒలుచుకున్నా, ఎక్కడ ఆరబోయాలనే సమస్య ఎదురవుతోంది.
ఇక వరి విషయానికొస్తే...కూలీల సమస్య కారణంగా పలు చోట్ల యంత్రాలతో వరి కోతలను పూర్తి చేసినా, అంతా నీట మునిగాయి. దాదాపుగా బురదలో కూరుకుపోయాయి. దీని వల్ల ధాన్యం నాసి రకంగా మారుతుందని, రేపు విక్రయించాలనుకున్నా సగం ధర దొరకడం గగనమవుతుందని రైతులు వాపోతున్నారు.