ప్రకృతి సేద్యంలో సాగైన వరి పొలం అతివృష్టిని తట్టుకున్న దృశ్యం
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే పంటలు అతివృష్టిని, అనావృష్టిని సైతం తట్టుకొని నిలిచి అధిక దిగుబడులిస్తాయని మరోసారి రుజువైంది. ముఖ్యంగా.. ప్రకృతి వ్యవసాయ మూలసూత్రాలకు అదనంగా వానకు ముందే విత్తనం (ప్రీ మాన్‌సూన్ డ్రై సోవింగ్–పి.ఎం.డి.ఎస్.) వినూత్న పద్ధతిని పాటించి ఏడాదిలో 365 రోజులూ పొలంలో పంటలు ఉండేలా చూసిన భూముల్లో పంటలు అతివృష్టికి, అనావృష్టికి కూడా తట్టుకొని అధిక దిగుబడులు ఇస్తున్నాయనిఆం.ప్ర. ప్రభుత్వానికి చెందిన రైతు సాధికార సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. డిసెంబర్ 5న ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్‌లో ఈ అంశాలపై చర్చ జరిగింది.
ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియాకు చెందిన నిపుణుడు డా. వాల్టర్ యన గత ఏడాది నవంబర్‌లో ఆం.ప్ర. రాష్ట్రంలో పర్యటించారు. ప్రకృతి వ్యవసాయం పూర్తి ఫలితాలను ఇవ్వాలంటే ప్రధాన పంటలకు ముందుగా అనేక రకాల పచ్చిరొట్ట ఎరువు పంటలు సాగు చేయటం తప్పనిసరి అని సూచించారు. ఆయన సూచనల ప్రకారం 365 రోజులు ప్రధాన పంటలు, అంతర పంటలు, పచ్చిరొట్ట పంటలు నిరంతరాయంగా సాగు చేస్తూ ఏడాది పొడవునా పొలంల్లో పచ్చని పంటలు ఉండేలా చర్యలు తీసుకోవటం ముఖ్యమైన అంశం. దీనితోపాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పూర్తిస్థాయిలో పాటించడం వల్ల రైతుల ఆదాయాలు పెరిగాయి. అతివృష్టిని, అనావృష్టిని తట్టుకోవటంతోపాటు భూమిలో జీవరాశిని, జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు అవకాశం కలిగింది.
అధిక వర్షాలకు దెబ్బతిన్న రసాయనిక సేద్యంలో సాగైన వరి పొలం
ఈ పద్ధతిని అనుసరించి లక్షకు పైగా రైతులు పంటలు పండిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారని రైతుసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి. విజయకుమార్ వెల్లడించారు. ఈ వివరాలను ఆయన వెబినార్‌లో వివరించారు. అనంతపురం, ప.గో. జిల్లా, తూ.గో. జిల్లా, గుంటూరు, విజయనగరం, కడప తదితర జిల్లాల్లో గత ఏడాది కాలంగా పీఎండిఎస్ పద్ధతిలో ప్రకృతి సేద్యం వల్ల ఏయే పంటల్లో ఎటువంటి మెరుగైన, ఆశ్చక్యకరమైన ఫలితాలు వచ్చాయో.. రసాయనిక ఎరువులు/పురుగుమందులు వేసి పండించిన పంటల స్థితిగతులు ఎలా ఉన్నాయో తులనాత్మక అధ్యయన వివరాలను జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు వివరించారు.
ఈ ఖరీఫ్ కాలంలో ఆం.ప్ర.లో పంటలకు అధిక వర్షాల వల్ల నష్టం చేకూరింది. అయితే, రసాయనిక ఎరువులతో సాగు చేసిన వరి, పత్తి పంటల పరిస్థితి ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి, పత్తి పంటలకు మధ్య వ్యత్యాసం ఎలా ఉందో తెలుసుకునేందుకు రైతుసాధికార సంస్థ అనేక కోణాల్లో అధ్యయనం చేసింది. తూ.గో. జిల్లాలో రసాయనిక వ్యవసాయంలో వరి పంట దుబ్బుకు 26 పిలకలు వచ్చాయి. వేర్లు 28 సెం.మీ. లోతుకు వెళ్లాయి. ప్రకృతి వ్యవసాయంలో 42 సెం.మీ. (33.3% అధికం) లోతుకు వెళ్లాయి. అందువల్ల వర్షాలు, గాలులకు పంట పెద్దగా పడిపోలేదు. 5% పంట మాత్రమే. అందులోనూ 80–85% పంట కోలుకుంది.
అధిక వర్షాలకు తట్టుకున్న ప్రకృతి సేద్యంలో సాగైన పత్తి , అధిక వర్షాలకు దెబ్బతిన్న రసాయనిక సేద్యంలో సాగైన పత్తి
అదేప్రాంతంలో రసాయనిక ఎరువులతో పండించిన వరికి 24 పిలకలు వచ్చాయి. అధిక వర్షాలకు 90% పడిపోయి, దెబ్బతింది. 30–40% మాత్రమే కోలుకుంది. నీటి ముంపు విషయంలో కూడా గణనీయమైన వ్యత్యాసం గమనించారు. ప్రకృతి వ్యవసాయ పొలంలో నీరు త్వరగా ఇంకిపోయింది. ప్రకృతి వ్యవసాయంలో వరి పంటకు తెగుళ్లు సోకలేదు. రసాయనిక ఎరువులతో పండించిన వరి పంటకు బాక్టీరియా ఎండు ఆకు తెగులు సోకి ఎండిపోయింది.
ఇక గుంటూరు జిల్లాలో పత్తి పంటలో సైతం ప్రకృతి వ్యవసాయానికి, రసాయనిక వ్యవసాయానికి వ్యత్యాసం బాగా కనిపించింది. అధికవర్షాలకు రసాయనిక వ్యవసాయ క్షేత్రంలో పత్తి కాయలు చాలా వరకు పాడయ్యాయి. కొమ్మలు కూడా దెబ్బతిన్నాయి. ఈ నష్టం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో చాలా తక్కువగా ఉంది. ప్రకృతి వ్యవసాయంలో పత్తి పంట 5% పడిపోయి, 75% వరకు కోలుకుంది. రసాయనిక వ్యవసాయంలో పత్తి పంట 95% వరకు పడిపోయింది. ఏమాత్రం కోలుకోలేదు. పంటంతా పోయింది.
ప్రకృతి వ్యవసాయంలో పూత, కాయలు 10–11% దెబ్బతింటే, రసాయనిక వ్యవసాయంలో 89–90% దెబ్బతిన్నాయి. ప.గో. జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో సాగైన 41 వరిలో పంట కోత పరీక్షలు జరిపారు. రసాయనిక వ్యవసాయం చేసిన పొలాల్లో కన్నా పిఎండిఎస్+ప్రకృతి వ్యవసాయం చేసిన పొలాల్లో 22% అధిక దిగుబడి వచ్చినట్లు రైతు సాధికార సంస్థ అధికారులు వెబినార్‌లో వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పిఎండిఎస్‌తో కూడిన ప్రకృతి సేద్యంలో రైతులకు అందివస్తున్న ఫలితాలను తెలుసుకొని వివిధ ఖండాల్లోని వ్యవసాయ నిపుణులు ఆశ్చర్యానందాలను ప్రకటించటం విశేషం.
ప్రకృతి సేద్యంలో వరి, బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకిన వరి
భూతాపాన్ని తగ్గించవచ్చు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయదారులు సాధిస్తున్న ఫలితాలు ప్రపంచానికే దారిచూపేలా ఉన్నాయి. రైతులు తక్కువ ఖర్చుతో తమ ఆదాయాన్ని పెంచుకుంటూ భూములను పునరుజ్జీవింపజేయటం ఆదర్శప్రాయం. అయితే, ఒకే చోట 2 వేల హెక్టార్లలో పొలాలన్నిటిలోనూ ఏడాది పొడవునా తెంపులేకుండా ప్రకృతి సేద్యం చేపట్టాలి. ఇలా చేస్తే ఆ ప్రాంతంలో కొద్ది సంవత్సరాల్లోనే భూతాపాన్ని కూడా తగ్గించుకోవచ్చు. రుతుపవనాల్లో అపసవ్యతను సరిచేసుకోవచ్చు. భారత రైతులు ప్రపంచానికే దారిచూపిన వారవుతారు.
– డా. వాల్టర్ యన, ప్రసిద్ధ శాస్త్రవేత్త, ఆస్ట్రేలియా
మన రైతులను చూసి ప్రపంచం నేర్చుకుంటున్నది!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు సాధిస్తున్న ఫలితాలను ప్రపంచ దేశాలు ఆశ్చర్యంగా గమనిస్తున్నాయి. ఆస్ట్రేలియా శాస్త్రవేత్త వాల్టర్ యన సూచన మేరకు వివిధ జిల్లాల్లో లక్షకు పైగా చిన్న, సన్నకారు రైతులు పీఎండిఎస్‌తో కూడిన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. గణాంకాలను శాస్త్రీయంగా నమోదు చేస్తున్నాం. ఈ ఖరీఫ్‌లో రసాయనిక మందులు వాడిన రైతులకన్నా ఈ రైతులు 22% అధిక దిగుబడులు సాధించారు. వీరి వరి, పత్తి సహా అన్ని రకాల పంటలు చాలా వరకు అతివృష్టిని తట్టుకున్నాయి. ఆహార–వ్యవసాయ సంస్థతోపాటు 12 దేశాలకు చెందిన నిపుణులు ఈ ఫలితాలను తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. మన రైతుల అనుభవాల నుంచి వారు నేర్చుకోవడానికి సిద్ధమవుతుండటం విశేషం. – టి. విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్, ఆం.ప్ర. రైతు సాధికార సంస్థ
Comments
Please login to add a commentAdd a comment