ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11న విడుదల చేసిన 61 పంటలకు సంబంధించిన 109 సరికొత్త వంగడాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాధార వ్యవసాయం చేసే రైతులకు ఉపయోగపడే పత్తి సూటి రకం ఒకటి ఉంది. దాని పేరు సిఐసిఆర్ హెచ్ బీటీ కాటన్ 40 (ఐసిఎఆర్–సిఐసిఆర్ పికెవి 081 బిటి). నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సిఐసిఆర్) ఈ బీటీ సూటి రకాన్ని రూపొందించింది.
ఇప్పటి వరకూ మార్కెట్లో ఉన్న జన్యుమార్పిడి బీటీ పత్తి వంగడాలన్నీ హైబ్రిడ్ రకాలే. ఇది హైబ్రిడ్ కాదు. ఓపెన్ పొల్లినేటెడ్ వంగడం. అంటే.. రైతులు ఈ విత్తనాన్ని ప్రతి సంవత్సరం కొనాల్సిన అవసరం లేదు. దూదిలో నుంచి తీసిన విత్తనాన్ని తిరిగి విత్తుకోవచ్చు. పత్తి సాగులో పెద్ద సమస్యగా మారిన పచ్చదోమ వంటి రసంపీల్చే పురుగులతో ΄ాటు తెగుళ్లను సైతం సమర్థవంతంగా తట్టుకుంటుందని సిఐసిఆర్ డైరెక్టర్ డాక్టర్ వై.జి. ప్రసాద్ ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు.
సిఐసిఆర్ హెచ్ బీటీ కాటన్ 40 రకాన్ని మూడేళ్లు 15 చోట్ల పండించి చూసిన తర్వాత సివీఐసి దీన్ని దక్షిణాది మెట్ట భూముల్లో సాగుకు ఎంపిక చేసింది. హెక్టారుకు సగటున 17.3 క్వింటాళ్ల పత్తి(సీడ్ కాటన్) దిగుబడి వచ్చింది. ఆదిలాబాద్‌లో 2023–24 సీజన్‌లో సాధారణ దూరంలో విత్తినప్పుడు అత్యధికంగా హెక్టారుకు 32.05 క్వింటాళ్ల దిగుబడినిచ్చింది. ఇతర రకాలతో ΄ోల్చితే 11–18% అధిక పత్తి దిగుబడినిస్తోంది. దూదిపింజ 26 ఎం.ఎం. పొడవుంటుంది. సగటు దూది పటుత్వం 25.8 జి/టెక్స్. 34–38% గింజల్లేని పత్తి దిగుబడినిస్తుంది. ఈ రకం చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. రసంపీల్చే పురుగులను దీటుగా తట్టుకునే ఈ సరికొత్త బీటీ కాటన్ జినోటైప్ వంగడం దక్షిణాది వర్షాధార తేలిక భూముల్లో అధిక దిగుబడినిస్తుందని సిఐసిఆర్ తెలిపింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనువైనది..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వర్షాధార తేలిక నేలల్లో అధిక సాంద్రతలో విత్తుకోవటానికి సూటిరకమైన సిఐసిఆర్ హెచ్ బీటీ కాటన్ 40 (ఐసిఎఆర్–సిఐసిఆర్ పికెవి 081 బిటి) చాలా అనువైనది. చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటూ అధిక దిగుబడినిస్తుంది. సర్టిఫైడ్ సీడ్ వచ్చే ఏడాది ఇవ్వగలం. బ్రీడర్ సీడ్ కొద్ది మొత్తంలో ఉంది. కిలో ధర రూ. 320. వచ్చే ఏడాది విత్తనం కావాలనుకునే వారు ముందుగా బుక్ చేసుకోవచ్చు. నాగపూర్ సిఐసిఆర్‌లోని విత్తన శాస్త్రవేత్త డా. శాంతిని 98906 84572 నంబరులో సంప్రదించవచ్చు. – డా. వై.జి. ప్రసాద్, డైరెక్టర్, కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ, నాగపూర్, మహారాష్ట్ర
Comments
Please login to add a commentAdd a comment