ప్రభుత్వ తీరు.. అన్నదాత బేజారు..
కడప అగ్రికల్చర్ : రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో అన్నదాత బేజారు చెందుతున్నాడు. దిక్కుతోచకని స్థితిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పలు రకాల షరతులు విధించి జీఓ జారీ చేసింది. అయితే బంగారు రుణాలకు మాత్రం బంగారు తాకట్టుతో సంబంధం లేకుండా రుణం తీసుకున్న ఏడాదిలో జిల్లా కమిటీ నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంటసాగు కోసం తీసుకునే రుణానికి మాత్రమే మాఫీ వర్తిస్తుందని జీఓ నంబరు 164 లోని 14 నుంచి 16 వరకు ఉన్న అంశాల ప్రకారం రుణమాఫీ ఉంటుందని పేర్కొన్నారు. దీంతో బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంట రుణాలకు మాత్రం పట్టాదారు పాసుపుస్తకం బ్యాంకులో తాకట్టుపెట్టి రుణాలను రైతులు తీసుకున్నారు. అది కూడా 2013 మార్చి1 నుంచి, 2013 డిసెంబరు నెల 31వ తేదీ వరకు పంటల సాగుకు తీసుకున్న రుణాలకే రుణమాఫీ వర్తిస్తుందని, ఆ తర్వాత తీసుకున్న వారికి వర్తింపు ఉండదని పేర్కొన్నారు. ఉద్యాన పంటలకు తీసుకున్న రుణాలు మాఫీ చేసేది లేదని ప్రభుత్వం తెగేసి చెప్పింది.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే...:
ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో డీసీసీ బ్యాంకు చీఫ్ మేనేజరు, లీడ్‌బ్యాంకు మేనేజరు, అన్ని ప్రధాన బ్యాంకుల మేనేజర్లు, వ్యవసాయశాఖ జేడీ, ఉద్యానశాఖల ఏడీలు, మార్కెటింగ్‌శాఖ అధికారులు, ఒకరిద్దరు అభ్యుదయ రైతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఏఏ పంటకు ఎంతెంత పెట్టుబడి అవుతుందనే విషయమై చర్చిస్తారు. ముందుగా ఆయా శాఖల అధికారులు రూపొందించిన రుణ ప్రణాళికలను సమావేశం ముందుంచుతారు. అన్ని ప్రణాళికలపై చర్చ నిర్వహించి, అనంతరం ఒక కటాఫ్ పెట్టుబడి రుణాన్ని నిర్ణయించి రాష్ట్రస్థాయి కమిటీకి పంపుతారు. అక్కడ అటుఇటుగా ఒక మొత్తాన్ని నిర్ణయించి జిల్లాకు పంపిస్తారు. దాని ఆధారంగా బ్యాంకర్లు రుణాలను రైతులకు అందజేస్తారు. దీని ప్రకారం బ్యాంకర్లు రైతు బ్యాంకుకు సమర్పించే పాసుపుస్తకంలో ఉన్న భూమికి జిల్లా కమిటీ నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాన్ని ఇస్తారు.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 2013లో వరి పంటకు ఎకరాకు రూ. 18,000లు, జొన్నకు రూ. 8,000లు, కందికి 8,000లు, శనగకు రూ. 12,000, పొద్దుతిరుగుడుకు రూ. 10,000లు, వేరుశనగకు రూ. 11,000లు, పత్తి పంటకు నీటి ఆధారం, వర్షాధారం కింద రూ. 22 వేలు, ఆముదం పంటకు రూ. 8000లు ఇలా రుణాన్ని అన్ని పంటల సాగుకోసం రైతులకు అందజేశారు. ఉదాహరణకు రైతు ఒక ఎకరం పొలం ఉన్నప్పుడు ఆ ఎకరం పంటసాగుకు 5 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ లక్ష రుణం తీసుకుంటే ఆ పంటకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌లో ఎంత రుణం ప్రకటించారో అంతే మొత్తం మాఫీ అవుతుందిగాని లక్ష రూపాయలు మాఫీ కాదని బ్యాంకర్లు చెబుతున్నారు.