సాక్షి, రంగారెడ్డి జిల్లా: రుణమాఫీపై కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఇప్పటికే మాఫీ జాబితాను రూపొందించడంలో తలమునకలైన జిల్లా యంత్రాంగానికి తాజాగా.. పట్టణ ప్రాంత బ్యాంకుల్లో బంగారంపై తీసుకున్న రుణాలు రద్దు కావనే సర్కారు మెలికతో ఇబ్బందులు తలెత్తాయి. వాస్తవానికి ఈపాటికే రుణమాఫీ జాబితాను ఖరారు చేసి గత నెల 30న జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీలో ఆమోదించాల్సి ఉంది.
కానీ జాబితా ఖరారులో నెలకొన్న ఇబ్బందులతో ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం ఏర్పడింది. ఈ క్రమంలో పలుమార్లు కేటగిరీలు, బ్యాంకుల వారీగా వివరాలను పరిశీలించి.. తుది స్థాయికి తీసుకొచ్చిన జాబితాపై సర్కారు కొత్తగా పెట్టిన మెలికతో కసరత్తు మళ్లీ మొదటికొచ్చింది. పట్టణ ప్రాంత బ్యాంకుల్లో తీసుకున్న బంగారం రుణాలు రద్దు చేయలేమని సర్కారు స్పష్టం చేసింది. దీంతో జిల్లాలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బ్యాంకుల్లో బంగారం రుణాల లెక్క తేల్చే పనిలో బ్యాంకర్లు బిజీ అయ్యారు.
తగ్గనున్న రూ.40కోట్ల భారం!
జిల్లా వ్యాప్తంగా వివిధ బ్యాంకులకు సంబంధించి ఆరువందల శాఖలున్నాయి. వీటిలో కేవలం 258 బ్యాంకులు మాత్రమే రైతులకు రుణాలు మంజూరు చేశాయి. ఇందులో పంట రుణాల కేటగిరీలో 2.03 లక్షల మందికిగాను 986.59కోట్లు, బంగారు ఆభరణాల రుణ కేటగిరీలో 13వేల మందికిగాను రూ. 82.95కోట్లుగా అధికారులు ప్రాథమికంగా తేల్చారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం మాఫీ చేయలేమని సర్కారు స్పష్టం చేసింది. ఈ క్రమంలో జిల్లాలో బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాల్లో దాదాపు సగభాగం పట్టణ ప్రాంత బ్యాంకులకు సంబంధించినవేనని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో హెచ్‌డీసీసీబీ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ తదితర బ్యాంకుల్లోనే అధికంగా ఉన్నట్లు తెలస్తోంది. మొత్తంగా రూ.40 కోట్ల రుణాలు పట్టణ ప్రాంత బ్యాంకుల్లో ఉన్నందున సర్కారుకు ఈ భారం తగ్గే అవకాశం ఉంది.
వచ్చేవారంలో డీసీసీ...
రుణమాఫీకి సంబంధించి జాబితా ఖరారైన అనంతరం జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ (డీసీసీ)లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ కమిటీ ఆమోదిస్తేనే లబ్ధిదారులు రుణమాఫీకి అర్హులవుతారు. ఈ క్రమంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి బ్యాంకర్ల సమావేశం దాదాపు పూర్తయింది. దీంతో సోమవారం సాయంత్రానికల్లా జిల్లాస్థాయిలో తుది జాబితాను ఖరారు చేసేందుకు యంత్రాంగం చర్యలు వేగిరం చేసింది. మొత్తంగా వచ్చే వారంలో డీసీసీ ఆమోదం ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు సీనియర్ బ్యాంకు మేనేజర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.
కొత్త చిక్కులు!
Published Fri, Sep 5 2014 11:52 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement