Urban Bank
-
అనంతపురం అర్బన్ బ్యాంక్ 12 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు
-
ముగ్గురు ఖాతాదారులు పరార్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి నగదు కొల్లగొట్టాలనే కుట్రకు గతేడాదే బీజం పడినట్లు తేలింది. దీనికోసం ప్రత్యేకంగా రెండు ఖాతాలు తెరిపించిన సైబర్ నేరగాళ్లు అప్పటికే ఉన్న మరో ఖాతాను వాడుకున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు ఖాతాదారులు పరారీలో ఉండటంతో వీరి సహకారంతోనే సైబర్ నేరగాళ్లు ఈ స్కామ్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వేర్వేరు సమయాల్లో తెరిచిన ఖాతాలు మహేష్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి చెస్ట్ ఖాతాను కొల్లగొట్టడానికి పథకం వేసిన సైబర్ నేరగాళ్లు రెండు నెలల క్రితమే రంగంలోకి దిగారు. అత్తాపూర్, సిద్ధిఅంబర్ బజార్లో ఉన్న బ్రాంచ్‌ల్లో రెండు ఖాతాలు తెరిపించారు. గత నెల 23న నాగోల్‌లోని శాన్విక ఎంటర్ప్రైజెస్ పేరుతో, ఈ నెల 11న షానవాజ్ బేగం పేరుతో కరెంట్, సేవింగ్ ఖాతాలు తెరిచారు. హుస్సేనిఆలంలో హిందుస్తాన్ ట్రేడర్స్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్న వినోద్‌కుమార్‌కు ఈ బ్యాంక్‌లో 2020 జూన్ నుంచి కరెంట్ ఖాతా ఉంది. ఈ మూడు ఖాతాలను సైబర్ నేరగాళ్లు చెస్ట్ ఖాతాలోని రూ.12.4 కోట్లు మళ్లించడానికి వినియోగించుకున్నారు. షానవాజ్ బేగం ఖాతా తెరిచే సమయంలో గోల్కొండ చిరునామా ఇచ్చినప్పటికీ... ఆమెను ముంబైకి చెందిన మహిళగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈమెను నగరానికి పంపడం ద్వారానే శాన్విక ఎంటర్‌ప్రైజెస్‌తో ఖాతా తెరిపించడంతోపాటు వినోద్‌కుమార్ ద్వారా హిందుస్తాన్ ట్రేడర్స్ ఖాతా వాడుకునేలా ఒప్పించి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ పరారీలో ఉండటం అనుమానాలకు ఊతమిస్తోంది. సర్వర్ హ్యాకింగ్‌కు సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ సర్వర్ ద్వారా యాక్సెస్ చేశారు. వాటికి సంబంధించిన ఐపీ అడ్రస్‌లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అవి అమెరికా సంస్థ ద్వారా జనరేట్ అయినట్లు తేలింది. వాటి మూలాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌ను కొల్లగొట్టడంలోనూ ఇదే పంథా అనుసరించారు. ఈ నేపథ్యంలో నైజీరియన్ల పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. -
Muddasani Kanakaiah: మూగబోయిన పోరాట గొంతుక
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించి, పలు రాజకీయ పార్టీల్లో తనదైన ముద్ర వేసిన ముద్దసాని కనకయ్య(67) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి అక్కడే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1970లో రాడికల్ ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా పని చేశారు. తర్వాత కాంగ్రెస్, బీఎస్పీ, టీఆర్ఎస్ పార్టీల్లో చురుకైన పాత్ర పోషించారు. విద్యార్థి ఉద్యమంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించారు. నాడు దొరల, భూస్వాముల, గడీల పాలనకు చరమగీతం పాడేందుకు విద్యార్థి ఉద్యమాన్ని నడిపారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో మీసా చట్టం కింద అరెస్టయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, మాజీ మేయర్ డి.శంకర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ లాంటి ప్రముఖులతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శిగా, అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా పని చేశారు. ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ సంతాపం.. ముద్దసాని కనకయ్య మృతి బాధాకరమని, ఎన్నో ఏళ్లు అనేక ఉద్యమాల్లో సహచరుడిగా ఉన్న ఆయన దూరమవ్వడం తాడిత, పీడిత ప్రజలకు తీరనిలోటని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌లు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
లాభాల బాటలో అర్బన్‌బ్యాంకు
కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు లాభాల బాటలో ఉందని ఆ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ తెలిపారు. నగరంలోని కృషిభవన్‌లో ఆదివారం బ్యాంకు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2015–16 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ.254 కోట్ల లావాదేవీలు నిర్వహించగా రూ.1.06లక్షలు లాభం ఆర్జించినట్లు తెలిపారు. నికర లాభం రూ.61,99,989 కోట్లు వచ్చిందని దీనికి గాను రూ.44 లక్షల ఆదాయపు పన్ను చెల్లించినట్లు వివరించారు. గతేడాది రూ.83 లక్షల లాభం ఆర్జించగా నికరలాభం రూ.54,84,625 వచ్చినట్లు తెలిపారు. ఇందుకుగాను రూ.28 లక్షల ఆదాయపు పన్ను చెల్లించినట్లు చెప్పారు. బ్యాంకు సీఈవో జి.చంద్రమౌళితో పాటు సభ్యులు పాల్గొన్నారు. -
నామినేషన్లో గందరగోళం
మిత్ర పక్ష బీజేపీ నేతపై టీడీపీ కార్యకర్తల దాడి ఏకపక్షంగా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ టీడీపీ దౌర్జన్యకాండను ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కొరిటెపాడు (గుంటూరు) : అర్బన్ బ్యాంకు పాలకవర్గ పదవులకు సంబంధించి బుధశారం నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్‌కు తుది గడువుగా ఉంది. దీంతో చైర్మన్ పదవిని ఆశిస్తూ బరిలో ఉన్న టీడీపీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్, వైస్ చైర్మన్ పదవి ఆశిస్తున్న బీజేపీ నేత, బ్యాంకు మాజీ చైర్మన్ ఆర్తిమళ్ళ వెంకటరత్నం ఆయా పార్టీల కార్యకర్తలు, నేతలతో కలిసి బ్యాంకు చేరుకున్నారు. ఈక్రమంలో టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు, నాయకులు నామినేషన్ వేయడానికి లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, బీజేపీ మధ్య ఘర్షణ తలెత్తింది. చివరకు టీడీపీ కార్యకర్తలు బీజేపీ నగర మాజీ ఉపాధ్యక్షుడు ఈదర శ్రీనివాసరెడ్డిపై దాడిచేశారు. దీంతో నామినేషన్లు వేయకుండానే బీజేపీ అభ్యర్థులు వెనుదిరిగారు. అనంతరం భారతీయ జనతా పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని టీడీపీ ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో సిట్టింగ్ చైర్మన్ కొత్తమాసు శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లగా టీడీపీ శ్రేణులు అడ్డుకుని ఎమ్మెల్యేల వద్దకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యేల జోక్యంతో కొత్తమాసు నామినేషన్ దాఖలు చేయకుండా వెళ్లిపోయారు. టీడీపీ, బీజేపీ మధ్య చర్చలు ఈ సందర్భంగా అమ్మిశెట్టి ఆంజనేయులు మాట్లాడుతూ ఇప్పటి వరకు అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా పని చేసిన కొత్తమాసు శ్రీనివాసరావు బ్యాంక్‌ను అభివృద్ధి బాటలో నడిపించారని తెలిపారు. దీంతో ఏకీభవించని టీడీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటిందని ఈ మిగిలిన మూడు సంవత్సరాలు చైర్మన్ పదవిని తమకు వదలి వేయాలని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ నుంచి బోనబోయిన శ్రీనివాసయాదవ్, బీజేపీ నుంచి వెంకటరత్నం నామినేషన్లు వేశారు. బీజేపీ నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులతోపాటు నాయకులు నేరేళ్ళ మాధవరావు, చెరుకూరి తిరుపతిరావు, శిఖాకొల్లి అభినేష్, జగన్మోహన్రావు, తోట రామకష్ణ, కె.వి.సుబ్బారావు తదితరులు ఉన్నారు. దౌర్జన్య కాండను ప్రశ్నించిన వైఎస్సార్సీపీ తెలుగుదేశం పార్టీ అడ్డగోలు రాజకీయం, దౌర్జన్యకాండను వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నించారు. పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫాలతో పాటు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు తరలి వచ్చారు. బ్యాంకులోకి ఎవ్వరిని వెళ్లనీయకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు బ్యాంకులోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అప్పిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలతో వాదనకు దిగారు. అనంతరం బ్యాంకులోకి వెళ్ళి ఏకగ్రీవంగా జరగాల్సిన ఎన్నికల్లో ఇలా అడ్డుకునే ధోరణి సరి కాదని, ఈ విధంగావ్యవహరిస్తే తాము న్యాయ పోరాటం చేసి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తామని హెచ్చరించారు. పార్టీ నాయకులు ఆతుకూరి ఆంజనేయులు, అంగడి శ్రీనివాస్, గులాం రసూల్, జగన్ కోటి, ఎలికా శ్రీకాంత్‌యాదవ్, కోట పిచ్చిరెడ్డి, ఆరుమండ్ల కొండారెడ్డి, పూనూరి నాగేశ్వరరావు, దాసరి కిరణ్, అంగడి శ్రీనివాసరావు, దుగ్గింపూడి యోగేశ్వరెడ్డి, కె.ప్రేమ్‌కుమార్, మొహమూద్, బడావీరు నాగరాజు, తోట మణికంఠ, కీసర వెంకటసుబ్బారెడ్డి, మేరుగ నర్సిరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, గనిక జాన్సీరాణీ, నిమ్మరాజు శారదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
తేలని లెక్కలు.. తెరవని లాకర్లు...
సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరం అర్బన్ బ్యాంకులో ఎన్నో ఏళ్లుగా లాకర్లు తెరవడానికి సంబంధిత ఖాతాదారులెవరూ రావడంలేదు. వాటిలో ఏమున్నాయో తెలియడం లేదు. లాకర్ల గలవారుంటే బ్యాంకును సంప్రదించాలని అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఎవ్వరూ స్పందించలేదు. ఇక చేసేదిలేక ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని మూడు రోజుల నుంచి లాకర్లు స్థానిక అధికారులే తెరుస్తున్నారు. కొన్నింటిలో ఆభరణాలు, డాక్యుమెంట్లు బయటపడుతున్నాయి. ఇక బ్యాంకులో డిపాజిట్ చేసినవారి పరిస్థితి కూడా అలాగే ఉంది. సుమారు 13వేల మంది ముందుకు రాకపోవడంతో రూ. కోటి 20లక్షల మేరకు చెల్లింపులు నిలిచిపోయాయి. వాళ్లెవరో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. క్లియర్ చేయాలని చూస్తున్నా... 102 ఏళ్ల చరిత్రగల విజయనగరం అర్బన్ బ్యాంకు పట్టణంలో విశేష సేవలందించింది. లావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తూ పురప్రజలకు నమ్మకాన్ని కూడగట్టుకుంది. వేలాది మంది డిపాజిట్లు చేశారు. బ్యాంకు కూడా పెద్ద ఎత్తున రుణాలిచ్చింది. కానీ కాలక్రమంలో సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఖాతాదారులకు చెల్లింపులు చేయలేని దయనీయ స్థితికి దిగజారింది. తప్పని సరి పరిస్థితుల్లో ప్రభుత్వం లిక్విడేషన్‌కు నిర్ణయం తీసుకుంది. లావాదేవీలను ముగించి బాధితులకు న్యాయం చేయాలని లిక్విడేటర్‌ను నియమించింది. ఇది జరిగి ఆరేళ్లవుతున్నా డిపాజిట్ చేసినవారు ముందుకు రాకపోవడంతో ఆ తతంగం పూర్తి కావట్లేదు. ఇక లాకర్లను క్లియర్చేయాలని చూస్తున్నా చాలామంది రావడంలేదు. ఖాతాదారులకు అన్యాయం జరగకుండా... అర్బన్ బ్యాంకుకు 17వేల మంది ఖాతాదారులుండేవారు. బ్యాంకు సంక్షోభంలోకి వెళ్లిపోవడంతో ఆస్తులు, అప్పులకు పొంతనలేకుండా పోయింది. బ్యాంకు ఆస్తులు రూ. 11.34కోట్లు ఉండగా, అప్పులు రూ. 11.19కోట్లకు చేరుకుంది. పరిస్థితి దయనీయంగా ఉండటంతో 2010జూన్ 23వ తేదీన లిక్విడేషన్‌కు నిర్ణయం తీసుకున్నారు. ఆర్బన్ బ్యాంకు ఆస్తుల్ని, చెల్లింపుల్ని మదింపు చేసి ఖాతాలను ముగించాలని నిర్ణయించారు. ఇంతవరకు రూ. లక్ష లోపు డిపాజిట్ చేసిన సుమారు 3,100 మందికి రూ. 6.40కోట్లు చెల్లించారు. ఇంకా రూ. 5కోట్లు వరకు చెల్లించాల్సి ఉంది. ఇందులో 13వేల మందికి సంబంధించి లావాదేవీలను పరిష్కరించేందుకు ఇబ్బందులేర్పడ్డాయి. డిపాజిట్ చేసినవారెవరూ ముందుకు రాకపోవడంతో సుమారు రూ. కోటి 20లక్షల వరకు అన్క్లైయిమ్డ్గా ఉండిపోయింది. ఈ లావాదేవీలన్నీ 1960, 1970, 1980, 1990లో జరిగినట్టుగా భావిస్తున్నారు. వీరిలో చాలా మంది చనిపోయి ఉండొచ్చని, మరికొందరు మైగ్రేషన్ అయిపోయి ఉండొచ్చని, ఇంకొందరు బ్యాంకులో డిపాజిట్ చేసిన వాటిని మరిచిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. లాకర్లపై తొలగని సందిగ్ధం బ్యాంకులో 70లాకర్లు దశాబ్దాలుగా తెరవకుండా ఉన్నాయి. వాటిలో ఏముందో ఎవరికీ తెలియదు. ఎన్నేళ్లైనా ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం అనుమతి తీసుకుని ఇప్పుడా లాకర్లు తెరుస్తున్నారు. ఇప్పటివరకు 39 లాకర్లు తెరిచారు. కొన్నింటిలో బంగారం, మరొక దాంట్లో వెండి, ఇంకొన్నింటిలో డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ఇంకా 31లాకర్లు తెరవాల్సి ఉంది. వాటిలో ఇంకేముంటాయో చూడాల్సి ఉంది. తెరుస్తున్న లాకర్లు, అన్క్లైయిమ్డ్ డిపాజిట్లపై ఆధారాలతో ఎవరైనా వస్తే వారికి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని లిక్విడేటర్, డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి నారాయణరావు ‘సాక్షి’కి తెలిపారు. -
కొత్త చిక్కులు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రుణమాఫీపై కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఇప్పటికే మాఫీ జాబితాను రూపొందించడంలో తలమునకలైన జిల్లా యంత్రాంగానికి తాజాగా.. పట్టణ ప్రాంత బ్యాంకుల్లో బంగారంపై తీసుకున్న రుణాలు రద్దు కావనే సర్కారు మెలికతో ఇబ్బందులు తలెత్తాయి. వాస్తవానికి ఈపాటికే రుణమాఫీ జాబితాను ఖరారు చేసి గత నెల 30న జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీలో ఆమోదించాల్సి ఉంది. కానీ జాబితా ఖరారులో నెలకొన్న ఇబ్బందులతో ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం ఏర్పడింది. ఈ క్రమంలో పలుమార్లు కేటగిరీలు, బ్యాంకుల వారీగా వివరాలను పరిశీలించి.. తుది స్థాయికి తీసుకొచ్చిన జాబితాపై సర్కారు కొత్తగా పెట్టిన మెలికతో కసరత్తు మళ్లీ మొదటికొచ్చింది. పట్టణ ప్రాంత బ్యాంకుల్లో తీసుకున్న బంగారం రుణాలు రద్దు చేయలేమని సర్కారు స్పష్టం చేసింది. దీంతో జిల్లాలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బ్యాంకుల్లో బంగారం రుణాల లెక్క తేల్చే పనిలో బ్యాంకర్లు బిజీ అయ్యారు. తగ్గనున్న రూ.40కోట్ల భారం! జిల్లా వ్యాప్తంగా వివిధ బ్యాంకులకు సంబంధించి ఆరువందల శాఖలున్నాయి. వీటిలో కేవలం 258 బ్యాంకులు మాత్రమే రైతులకు రుణాలు మంజూరు చేశాయి. ఇందులో పంట రుణాల కేటగిరీలో 2.03 లక్షల మందికిగాను 986.59కోట్లు, బంగారు ఆభరణాల రుణ కేటగిరీలో 13వేల మందికిగాను రూ. 82.95కోట్లుగా అధికారులు ప్రాథమికంగా తేల్చారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం మాఫీ చేయలేమని సర్కారు స్పష్టం చేసింది. ఈ క్రమంలో జిల్లాలో బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాల్లో దాదాపు సగభాగం పట్టణ ప్రాంత బ్యాంకులకు సంబంధించినవేనని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో హెచ్‌డీసీసీబీ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకుల్లోనే అధికంగా ఉన్నట్లు తెలస్తోంది. మొత్తంగా రూ.40 కోట్ల రుణాలు పట్టణ ప్రాంత బ్యాంకుల్లో ఉన్నందున సర్కారుకు ఈ భారం తగ్గే అవకాశం ఉంది. వచ్చేవారంలో డీసీసీ... రుణమాఫీకి సంబంధించి జాబితా ఖరారైన అనంతరం జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ (డీసీసీ)లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ కమిటీ ఆమోదిస్తేనే లబ్ధిదారులు రుణమాఫీకి అర్హులవుతారు. ఈ క్రమంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి బ్యాంకర్ల సమావేశం దాదాపు పూర్తయింది. దీంతో సోమవారం సాయంత్రానికల్లా జిల్లాస్థాయిలో తుది జాబితాను ఖరారు చేసేందుకు యంత్రాంగం చర్యలు వేగిరం చేసింది. మొత్తంగా వచ్చే వారంలో డీసీసీ ఆమోదం ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు సీనియర్ బ్యాంకు మేనేజర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
పట్టణ బ్యాంకు రుణాలనూ మాఫీ చేయాలి
* ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ * పార్టీని వీడిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారు సాక్షి, ఖమ్మం: పట్టణ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలనూ మాఫీ చేయాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మంలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ రైతులు చాలా మంది పట్టణ బ్యాంకుల్లో కూడా రుణం తీసుకున్నారని, వీరందరికీ రుణమాఫీ వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పార్టీ విధివిధానాలపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 6వ తేదీన ప్రకటన చేస్తారని తెలిపారు. కుంటి సాకులు చెప్పి ఇటీవల పార్టీని వీడిన వారికి రానున్న కాలంలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తాము కూడా పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ శానససభ పక్ష నేత తాటి వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడారు. కాగా, తాము పార్టీని వీడబోమంటూ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు వేదికపై వైఎస్సార్ విగ్రహం ముందున్న జ్యోతిపై ప్రమాణం చేశారు. -
అర్బన్ బ్యాంకుపై టీడీపీ కన్ను
పార్టీ అధికారంలోకి రావడంతో తెలుగుదేశం నేతలు జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వీరి కళ్లు సహకార రంగంలో నడుస్తున్న ఓ బ్యాంకుపై పడడంతో ఖాతాదారులు బెంబేలెత్తిపోతున్నారు. టీడీపీ రాజకీయాలు రేషన్ దుకాణాల నుంచి బ్యాంకు వరకూ వ్యాపించడంపై ప్రజలు, వ్యాపారస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాక్షి, గుంటూరు: గుంటూరులో కొన్నేళ్లుగా లాభాల బాటలో నడుస్తున్న అర్బన్ బ్యాంక్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సహకార రంగంలో కొనసాగుతున్నా ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో డిపాజిట్లు కలిగి ఉన్న ఈ బ్యాంకు ఇప్పటి వరకు ఓ మాజీ మంత్రి కనుసన్నల్లో నడుస్తోంది. ఆడిటర్ కొత్తమాసు శ్రీనివాసరావు బ్యాంక్ చైర్మన్‌గా ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల కన్ను ఈ బ్యాంక్‌పై పడింది. ఇక నుంచి ఇక్కడి వ్యవహారాలన్నీ తామే చూస్తామని, వెంటనే రాజీనామా చేసి వెళ్లాలని ఆ బ్యాంకు చైర్మన్, సీఈఓలకు టీడీపీ నేతలు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. చైర్మన్, డెరైక్టర్లుగా తమ పార్టీ వ్యక్తులను నియమించుకుంటామంటూ జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు వారం రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు సమాచారం. ఇదిలావుంటే, ఈ బ్యాంకులో ఇద్దరు డెరైక్టర్ల పదవీకాలం ఇటీవల ముగిసింది.ఆ స్థానంలో కొత్త వారిని తిరిగి ఎన్నుకునేందుకు ఈ నెల 30న ఎన్నిక నిర్వహించాల్సి వుంది. ఇది తెలుసుకున్న ఆ టీడీపీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఆ పదవులు తమ వారికే ఇవ్వాలని పట్టుపట్టారు. దీంతో బ్యాంక్ చైర్మన్ తన సామా జిక వర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ద్వారా ఎమ్మెల్యేల వద్దకు ఓ రాజీ ప్రతిపాదన పంపించారు. దీనిలో భాగంగా మరో ఆరు నెలలపాటు ప్రస్తుత చైర్మన్ కొనసాగేలా, డెరైక్టర్లుగా ఆ ఎమ్మెల్యేలు చెప్పిన వ్యక్తులను నియమించేలా ప్రతిపాదించారు. ఇలా రాజీ కుదరడంతో ఇద్దరు డెరైక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. ఈ ప్రక్రియ అంతా ఈ నెల 27న ముగిసినట్టు తెలిసింది. సీఈఓ విషయం ఇంకా ఎటూ తేల్చలేదని చెబుతున్నారు.టీడీపీ రాజకీయాలతో మసకబారుతున్న బ్యాంక్ ప్రతిష్ట. జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు అర్బన్ బ్యాంకు వ్యవహారంలో జోక్యం చేసుకోవడాన్ని జిల్లాకు చెందిన ఓ మంత్రి, అర్బన్ పరిధిలోని ఓ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్న ట్లు సమాచారం. ఇప్పటి వరకు సుమారు రూ. 280 కోట్ల డిపాజిట్లతో లాభాలతో నడుస్తున్న అర్బన్ బ్యాంక్ ప్రతిష్ట టీడీపీ గ్రూపు రాజకీయాల కారణంగా మసకబారనుందనిబ్యాంక్ సిబ్బంది, డిపాజిట్‌దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మాజీ మంత్రి తనకు అత్యంత ఆప్తుడైన ప్రస్తుత మంత్రి ద్వారా టీడీపీ ఎమ్మెల్యేలు బ్యాంక్ వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండేలా చెప్పించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలకు తెర లేపిందంటున్నారు. -
అర్బన్ బ్యాంక్‌లో లాకర్స్ ప్లాజా
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రప్రథమంగా సురక్షిత, ధృడమైన లాకర్స్ ప్లాజాను నెలకొల్పుతున్నట్లు ది గుంటూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కొత్తమాసు శ్రీనివాసరావు చెప్పారు. స్థానిక బ్రాడీపేటలోని బ్యాంక్ పరిపాలన కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు ఇష్టమైన ఆరు సైజుల్లో 4,000 లాకర్స్ తాయారు చేయిస్తున్నామన్నారు. మెరుగైన సేవలందించడానికి నూతన భవన నిర్మాణం చేపట్టి అందులో లాకర్స్ ప్లాజాను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. లాకర్స్ సైజును బట్టి వార్షిక అద్దె రూ.1,350 నుంచి రూ.8,000 నిర్ణయించినట్లు చెప్పారు. ఖాతాదారులు ఆధార్ కార్డు, ఒక ఫొటో తీసుకొచ్చి లాకర్లను బుక్ చేసుకోవాలని కోరారు. అనంతరం లాకర్స్ ప్లాజా బ్రోచర్‌ను ఆవిష్కరించారు. వివరాలకు 0863-2230737, 8008499323 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ అడపా వెంకటరత్నం, పాలక వర్గ సభ్యులు జాగర్లమూడి శ్రీనివాసరావు, బసివిరెడ్డి, అడపా కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, జి.నారాయణమూర్తి, సీఈవో సీతారాములు తదితరులు పాల్గొన్నారు. -
గుడివాడ అర్బన్ బ్యాంక్ ఎన్నికల నగారా
= 24న పోలింగ్ = ఎన్నికల అధికారి ఏసుదాసు వెల్లడి గుడివాడ, న్యూస్‌లైన్ : గుడివాడ అర్బన్ బ్యాంకు పాలకవర్గ నియామకానికి ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 24న ఎన్నికలు నిర్వహించనున్నట్లు బ్యాంకు ఎన్నికల అధికారి ఎంజే ఏసుదాసు విలేకరులకు చెప్పారు. గురువారం స్థానిక అర్బన్‌బ్యాంకు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నోటిఫికేషన్ వివరాలు ఆయన వెల్లడించారు. అర్బన్ బ్యాంకు పాలకవర్గ కాలపరిమితి ముగియటంతో ఎన్నికలు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ బ్యాంకుకు గుడివాడ మెయిన్ బ్రాంచితో పాటు పామర్రు, గుడ్లవల్లేరు, కైకలూరు, కానూరు లలో బ్రాంచిలు ఉన్నాయన్నారు. గుడివాడ బ్రాంచి పరిధిలో 4,456 ఓట్లు, గుడ్లవల్లేరు బ్రాంచి పరిధిలో 92, పామర్రు పరిధిలో 200, కానూరు పరిధిలో 227, కైకలూరు పరిధిలో 64 కలిపి మొత్తం 5,239 ఓట్లు ఉన్నట్లు చెప్పారు. తుది జాబితాను శుక్రవారం ప్రకటిస్తామని తెలిపారు. ఈ బ్యాంకు పరిధిలో మొత్తం 12 మంది పాలకవర్గ సభ్యులు ఉంటారని చెప్పారు. గుడివాడ బ్రాంచికి 10, గుడ్లవల్లేరుకు ఒకటి, పామర్రు బ్రాంచికి ఒక డెరైక్టర్ పోస్టులు కేటాయించినట్లు ఆయన వివరించారు. ఎన్నికల షెడ్యూలు ఇదీ... ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ నెల 15 ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు గుడివాడలోనే దాఖలు చేయాల్సిందిగా కోరారు. 16న నామినేషన్ల పరిశీలన, 17న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందన్నారు. ఆరోజు సాయంత్రం ఐదు గంటలలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చని చెప్పారు. అదేరోజు సాయంత్రం ఐదు గంటల తరువాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి గుర్తులు కేటాయిస్తామని తెలిపారు. గుడివాడలోని ఓటర్లకు స్థానిక గౌరీశంకరపురంలోని మాంటిస్సోరీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో, గుడ్లవల్లేరు, పామర్రు, కైకలూరు, కానూరు బ్రాంచి పరిధుల్లో ఉన్న ఓటర్లకు ఆయా బ్రాంచి కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. అదేరోజు మూడు గంటల నుంచి మాంటిస్సోరి పాఠశాలలో ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. మిగి లిన బ్రాంచిల్లో జరిగిన పోలింగ్ తాలూకు బ్యాలెట్ బాక్సులను కూడా గుడివాడకు తీసుకొచ్చి లెక్కిస్తారని వివరించారు. ఏవైనా సందేహాలుంటే గుడివాడ అర్బన్ బ్యాంకులోని తన కార్యాలయంలో సంప్రదించవచ్చని చెప్పారు.