సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరం అర్బన్ బ్యాంకులో ఎన్నో ఏళ్లుగా లాకర్లు తెరవడానికి సంబంధిత ఖాతాదారులెవరూ రావడంలేదు. వాటిలో ఏమున్నాయో తెలియడం లేదు. లాకర్ల గలవారుంటే బ్యాంకును సంప్రదించాలని అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఎవ్వరూ స్పందించలేదు. ఇక చేసేదిలేక ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని మూడు రోజుల నుంచి లాకర్లు స్థానిక అధికారులే తెరుస్తున్నారు. కొన్నింటిలో ఆభరణాలు, డాక్యుమెంట్లు బయటపడుతున్నాయి. ఇక బ్యాంకులో డిపాజిట్ చేసినవారి పరిస్థితి కూడా అలాగే ఉంది. సుమారు 13వేల మంది ముందుకు రాకపోవడంతో రూ. కోటి 20లక్షల మేరకు చెల్లింపులు నిలిచిపోయాయి. వాళ్లెవరో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
క్లియర్ చేయాలని చూస్తున్నా...
102 ఏళ్ల చరిత్రగల విజయనగరం అర్బన్ బ్యాంకు పట్టణంలో విశేష సేవలందించింది. లావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తూ పురప్రజలకు నమ్మకాన్ని కూడగట్టుకుంది. వేలాది మంది డిపాజిట్లు చేశారు. బ్యాంకు కూడా పెద్ద ఎత్తున రుణాలిచ్చింది. కానీ కాలక్రమంలో సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఖాతాదారులకు చెల్లింపులు చేయలేని దయనీయ స్థితికి దిగజారింది. తప్పని సరి పరిస్థితుల్లో ప్రభుత్వం లిక్విడేషన్‌కు నిర్ణయం తీసుకుంది. లావాదేవీలను ముగించి బాధితులకు న్యాయం చేయాలని లిక్విడేటర్‌ను నియమించింది. ఇది జరిగి ఆరేళ్లవుతున్నా డిపాజిట్ చేసినవారు ముందుకు రాకపోవడంతో ఆ తతంగం పూర్తి కావట్లేదు. ఇక లాకర్లను క్లియర్‌చేయాలని చూస్తున్నా చాలామంది రావడంలేదు.
ఖాతాదారులకు అన్యాయం జరగకుండా...
అర్బన్ బ్యాంకుకు 17వేల మంది ఖాతాదారులుండేవారు. బ్యాంకు సంక్షోభంలోకి వెళ్లిపోవడంతో ఆస్తులు, అప్పులకు పొంతనలేకుండా పోయింది. బ్యాంకు ఆస్తులు రూ. 11.34కోట్లు ఉండగా, అప్పులు రూ. 11.19కోట్లకు చేరుకుంది. పరిస్థితి దయనీయంగా ఉండటంతో 2010జూన్ 23వ తేదీన లిక్విడేషన్‌కు నిర్ణయం తీసుకున్నారు. ఆర్బన్ బ్యాంకు ఆస్తుల్ని, చెల్లింపుల్ని మదింపు చేసి ఖాతాలను ముగించాలని నిర్ణయించారు. ఇంతవరకు రూ. లక్ష లోపు డిపాజిట్ చేసిన సుమారు 3,100 మందికి రూ. 6.40కోట్లు చెల్లించారు. ఇంకా రూ. 5కోట్లు వరకు చెల్లించాల్సి ఉంది. ఇందులో 13వేల మందికి సంబంధించి లావాదేవీలను పరిష్కరించేందుకు ఇబ్బందులేర్పడ్డాయి. డిపాజిట్ చేసినవారెవరూ ముందుకు రాకపోవడంతో సుమారు రూ. కోటి 20లక్షల వరకు అన్‌క్లైయిమ్డ్‌గా ఉండిపోయింది. ఈ లావాదేవీలన్నీ 1960, 1970, 1980, 1990లో జరిగినట్టుగా భావిస్తున్నారు. వీరిలో చాలా మంది చనిపోయి ఉండొచ్చని, మరికొందరు మైగ్రేషన్ అయిపోయి ఉండొచ్చని, ఇంకొందరు బ్యాంకులో డిపాజిట్ చేసిన వాటిని మరిచిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
లాకర్లపై తొలగని సందిగ్ధం
బ్యాంకులో 70లాకర్లు దశాబ్దాలుగా తెరవకుండా ఉన్నాయి. వాటిలో ఏముందో ఎవరికీ తెలియదు. ఎన్నేళ్లైనా ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం అనుమతి తీసుకుని ఇప్పుడా లాకర్లు తెరుస్తున్నారు. ఇప్పటివరకు 39 లాకర్లు తెరిచారు. కొన్నింటిలో బంగారం, మరొక దాంట్లో వెండి, ఇంకొన్నింటిలో డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ఇంకా 31లాకర్లు తెరవాల్సి ఉంది. వాటిలో ఇంకేముంటాయో చూడాల్సి ఉంది. తెరుస్తున్న లాకర్లు, అన్‌క్లైయిమ్డ్ డిపాజిట్లపై ఆధారాలతో ఎవరైనా వస్తే వారికి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని లిక్విడేటర్, డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి నారాయణరావు ‘సాక్షి’కి తెలిపారు.
తేలని లెక్కలు.. తెరవని లాకర్లు...
Published Fri, May 13 2016 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM
Advertisement
Advertisement