lockers
-
ప్రైవేట్ లాకర్లలో భారీగా బ్లాక్ మనీ.. కొనసాగుతున్న సోదాలు
రాజస్తాన్‌లోని జైపూర్ గణపతి ప్లాజా ప్రైవేటు లాకర్లలో మళ్లీ లక్షల్లో బ్లాక్ మనీ దొరికింది. ఆ లాకర్లలో కోట్లాది రూపాయల నల్ల డబ్బు దాచారన్న ఆరోపణల నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. శుక్రవారం ఇక్కడికి చేరుకున్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల బృందం రైడ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఒక లాకర్లో రూ.7.5 లక్షల అనధికార సొమ్మును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో లాకర్‌లోనూ భారీగా నగదును గుర్తించారు. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోంది. అధికారులు మరిన్ని లాకర్లను తెరవనున్నారు. అదంతా పేపర్‌లీక్ సొమ్ము రాజస్తాన్‌లో గత డిసెంబర్లో గ్రేడ్-2 టీచర్ నియామకానికి సంబంధించిన పేపర్‌లీక్ ఉదంతం బయటపడింది. 37 మంది అభ్యర్థులు సహా మొత్తం 55 మంది నిందితులు అరెస్టయ్యారు. కాగా ఈ పేపర్‌లీక్ ద్వారా సంపాదించిన అక్రమ సొమ్మునంతా జైపూర్ గణపతి ప్లాజా ప్రైవేటు లాకర్లలో దాచారని ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు కిరోరిలాల్ మీనా సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటిదాకా రూ.7 కోట్ల నగదు, 12 కేజీల బంగారం జైపూర్ గణపతి ప్లాజాలో మొత్తం 1100 లాకర్లు ఉన్నాయి. గత అక్టోబర్ 17న చేసిన సోదాల్లో రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్న ఆదాయపు పన్ను శాఖ బృందం.. అక్టోబర్ 21న చేపట్టిన సోదాల్లో ఏకంగా రూ.2.46 కోట్లు స్వాధీనపరుచుకున్నారు. ఆ లాకర్లు నుంచి ఇప్పటిదాకా రూ.7 కోట్లకు పైగా నగదు, 12 కేజీలకు పైగా బంగారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ శాఖ స్వాధీనం చేసుకుంది. -
కొత్త ఏడాది నుండి కొత్త నిబంధనలు..బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు!
త్వరలో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా బ్యాంక్ లాకర్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి కొత్త లాకర్ నిబంధనల్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఆర్బీఐ గైడ్‌లైన్స్ మేరకు..లాకర్ల విషయంలో బ్యాంకులు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించకూడదు. జనవరి 1, 2023 నాటికి ప్రస్తుతం లాకర్‌ను వినియోగిస్తున్న ఖాతాదారులు తమ లాకర్ అగ్రిమెంట్‌ను రెన్యువల్ చేయాలి. బ్యాంకులు ఐబిఎ రూపొందించిన మోడల్ లాకర్ ఒప్పందాన్ని ఉపయోగించవచ్చు. ఈ లాకర్ అగ్రిమెంట్స్ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉండాలి. బ్యాంకులే హామీ ఆర్బీఐ ఆగస్టు 8, 2021న లాకర్ల విషయంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ మార్గదర్శకాల ప్రకారం, సురక్షితమైన డిపాజిట్ వాల్ట్లను ఉంచిన ప్రాంగణాన్ని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత బ్యాంకులదే. ఒకవేళ అలసత్వం కారణంగా..బ్యాంకు లాకర్లో ఉన్న వినియోగదారుల విలువైన వస్తువులు పోతే.. అవి చెల్లించే బాధ్యత బ్యాంకులదే. అగ్నిప్రమాదాలు లేదా భవనం కూలిపోవడం వల్ల ఖజానాలో నిల్వ చేసిన విలువైన వస్తువులను దోచుకున్నా లేదా నాశనం చేసినా వినియోగదారులు బ్యాంకు ఛార్జీల కంటే 100 రెట్లు వరకు నష్టపరిహారం పొందవచ్చు. లాకర్ గదులను పర్యవేక్షించడానికి బ్యాంకులు సీసీటీవీని ఏర్పాటు చేయడం తప్పనిసరి అని ఆర్బీఐ తెలిపింది. దీంతో పాటు 180 రోజుల పాటు సీసీటీవీ డేటాను ఉంచాలని బ్యాంకులను కోరింది. బ్యాంకుల్లో డిస్ప్లే బోర్డుపై సమాచారం అందించడం ద్వారా బ్యాంకుల్లో లాకర్లు ఉన్నాయనే విషయంలో వినియోగదారులకు తెలుస్తుందని ఆర్బీఐ గుర్తించింది. అందుకే ఖాళీ లాకర్ల జాబితా, లాకర్ కోసం వెయిటింగ్ లిస్ట్, వెయిటింగ్ లిస్ట్ లోని నంబర్ గురించి వినియోగదారులకు తెలిసేలా డిస్ప్లే బోర్డ్‌లపై సమాచారం ఇవ్వాలి. ఎస్ఎంఎస్ అలెర్ట్ మోసాల నుంచి కస్టమర్లను రక్షించడానికి, కస్టమర్ తన లాకర్‌ను యాక్సెస్ చేసిన ప్రతిసారీ సంబంధిత బ్యాంకులు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్స్ పంపాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ అలర్ట్ కస్టమర్లు మోలా భారిన పడకుండా సంరక్షిస్తుంది. లాకర్ అద్దె మూడేళ్ల పాటు అద్దెగా తీసుకునే లాకర్‌పై వినియోగదారులకు బ్యాంకులకు టర్మ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ డిపాజిట్లు ఎగ్జిస్టింగ్ కస్టమర్లకు అవసరలేదని తెలుస్తోంది. -
రహస్య లాకర్లలో 431 కిలోల బంగారం, వెండి
న్యూఢ్లిలీ: బ్యాంకు లోన్ మోసం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ అభియోగాలపై దర్యాప్తులో భాగంగా బుధవారం రక్ష బులియన్ అండ్ క్లాసిక్ మార్బుల్స్ అనే సంస్థ కార్యాలయాలపై దాడులు చేసిన ఈడీ బృందానికి కళ్లు బైర్లు కమ్మాయి! రహస్య లాకర్లలో ఏకంగా 431 కిలోల బంగారు, వెండి కడ్డీలు బయటపడ్డాయి. వీటిలో 91 కిలోలు బంగారు, 340 కిలోల వెండి కడ్డీలున్నాయి. వీటి విలువ కనీసం రూ.47.76 కోట్లు ఉంటుందని తేల్చారు. పరేఖ్ అల్యుమినెక్స్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించి కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. బ్యాంకుల నుంచి రూ.2,296.58 కోట్ల మేరకు మోసపూరితంగా రుణాలు తీసుకున్నట్టు 2018లో పరేఖ్ సంస్థపై కేసు నమోదైంది. తర్వాత పలు షెల్ కంపెనీల ముసుగులో ఈ మొత్తాన్ని విదేశాలకు తరలించాలన్నది అభియోగం. దీనికి సంబంధించి గతంలోనే కంపెనీ తాలూకు రూ.205 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. ఇదీ చదవండి: విద్యుత్ బిల్లుపై వెనక్కి తగ్గేదేలే... -
లాకర్ల విషయంలో భరోసా ఉండాల్సిందే
న్యూఢిల్లీ: లాకర్ల నిర్వహణ విషయంలో బ్యాంకులు చేతులు కడిగేసుకుంటే సరిపోదంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. లాకర్ సదుపాయం నిర్వహణలో బ్యాంకులు పాటించాల్సిన నిబంధనలను ఆరు నెలల్లోగా తీసుకురావాంటూ ఆర్బీఐని ఆదేశించింది. జస్టిస్ ఎమ్ఎమ్ శాంతనా గోదార్, జస్టిస్ వినీత్ శరణ్‌తో కూడిన ధర్మాసనం లాకర్లకు సంబంధించి తమ ముందుకు వచ్చిన పిటిషన్‌పై విచారణ నిర్వహించింది. సామాన్యుని జీవితంలో బ్యాంకులు గణనీయమైన పాత్రను పోషిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారుతున్న క్రమంలో ప్రజలు లిక్విడ్ ఆస్తులను ఇళ్లలో ఉంచుకునేందుకు ఆసక్తిగా లేరని, అందుకే లాకర్ల వంటి సదుపాయాలకు డిమాండ్ పెరుగుతున్నట్టు పేర్కొంది. రెండు కీలతో కూడిన లాకర్ సదుపాయాల స్థానంలో ఎలక్ట్రానిక్‌గా నిర్వహించగలిగే లాకర్లకు మళ్లుతున్నామని గుర్తు చేస్తూ.. దుండగులు టెక్నాలజీలను దుర్వినియోగం చేయడం ద్వారా.. కస్టమర్ల అంగీకారం లేకుండానే వారి లాకర్లను తెరిచే అవకాశం ఉందన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఇటువంటి సందర్భాల్లో బ్యాంకులు తమకు బాధ్యత లేదనడం కుదరదని పేర్కొంది. ఇది వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్ట నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీయడమే అవుతుందని అభిప్రాయపడింది. కనుక లాకర్లు/ సేఫ్ డిపాజిట్ సదుపాయాల నిర్వహణకు సంబంధించి బ్యాంకులు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశిస్తూ సమగ్రమైన నిబంధనలను ఆర్బీఐ తీసుకురావాలని ధర్మాసనం ఆదేశించింది. ఇందుకు ఆరు నెలల సమయాన్నిచ్చింది. లాకర్ల విషయమై కస్టమర్లకు ఏదైనా నష్టం జరిగితే బ్యాంకుల బాధ్యత ఏ మేరకు నిర్ణయించే అంశాన్ని ఆర్బీఐకే విడిచిపెట్టింది. -
మోత బరువుకు తాళం
కోల్కత్తా : చదివేది ఎల్కేజీ, యూకేజీ అయినా కేజీల కొద్దీ పుస్తకాలను మోయలేక చిన్నారులు పడే అవస్థలు వర్ణనాతీతం. ఈ మోత బరువుకు లేత వయసులోనే వారి నడుములు దెబ్బతింటున్నాయి. అనేక శారీరక సమస్యలకూ దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో లాకర్ సౌకర్యం కల్పించనుంది. దీంతో పిల్లలకు మోత బరువు నుంచి కాస్తయినా ఉపశమనం కలగనుంది. పశ్చిమబెంగాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు బండెడు బరువుతో కూడిన పుస్తకాల సంచులను మోసే రోజులు త్వరలో కనుమరుగవనున్నాయి. సర్కారు బడుల్లో పుస్తకాల కోసం లాకర్ సౌకర్యం కల్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమే దీనికి కారణం. దీనికోసం పాఠశాల ప్రాంగణాల్లో ప్రభుత్వం స్థలం కేటాయించనుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ గురువారం వెల్లడించారు. ‘ఈ లాకర్లు అందుబాటులోకి వస్తే విద్యార్థులకు సంచుల భారం నుంచి విముక్తి కలుగుతుంది. తమ పుస్తకాలు, ఇతర సామగ్రిని రోజూ వారు ఇంటికి తీసుకెళ్లి మళ్లీ మోసుకొచ్చే అవసరం ఉండదు. అవసరమైన పుస్తకాలను ఇంటికి తీసుకెళితే సరిపోతుంది’అని పార్థ చెప్పారు. నర్సరీ నుంచి పదో తరగతి పాఠశాలలకు ఈ వెసులుబాటు కల్పిస్తామన్నారు. అయితే ఎయిడెడ్ పాఠశాలలకు ఇది వర్తించబోదన్నారు. నిధుల కొరతే ఇందుకు కారణమన్నారు. నగరంలోని హిందు, హరే అండ్ బెథూన్ తదితర పాఠశాలల్లో ఇప్పటికే ఈ వసతి కల్పించినట్లు చెప్పారు. ఈ లాకర్ విధానం వల్ల పశ్చిమబెంగాల్లో కనీసం 1.5 కోట్ల మంది విద్యార్థులకు మోత బరువు నుంచి విముక్తి కలగనుంది. కాగా, ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాకర్లు అందుబాటులోకి వస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా, అమెరికా, జపాన్ లాంటి కొన్ని దేశాల్లో పిల్లల పుస్తకాల కోసం ఇలాంటి లాకర్ వసతి చాలా స్కూళ్లలో కొనసాగుతోంది. -
దాచుకో పదిలంగా..
సాక్షి, నంద్యాల: అక్టోబర్ 19వ తేదీన ఇంటికి తాళం వేసి బంధువుల అంత్యక్రియలకు వెళ్లిన డిప్యూటీ తహసీల్దార్ రమాదేవి ఇంట్లో దొంగలు పడి 40తులాల బంగారు, రెండు కేజీల వెండి, రూ.2లక్షల నగదు అపహరించారు. 8 నవంబర్ 29వ తేదీన కర్నూలు శివారులో ఉన్న రామచంద్రనగర్, రామకృష్ణనగర్, వాసవీ నగర్లలో పట్టపగలే దొంగలు హల్చల్ చేసి దోపిడీకి పాల్పడ్డారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా మూడు ఇళ్లను లూఠీ చేశారు. ఈ చోరీలో 11తులాల బంగారం, 750గ్రాముల వెండి, రూ.1.70లక్షల నగదు అపహరించారు.ఎమ్మిగనూరు పట్టణంలోని వాల్మీకి సర్కిల్ వద్ద నవంబర్ 13వ తేదీన కిసాన్ మాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. షాపు షెట్టర్లు తొలగించి లోనికి జొరబడి రూ.1.29లక్షల నగదుతో ఉడాయించారు. ...ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో ఏదో ఒక చోట వారంలో రెండుమూడు చోరీలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చోరీలు జరుగుతున్నా ప్రజలు..బ్యాంకుల్లో ఉన్న లాకర్ల వసతిని వినియోగించుకోవడం లేదు. లక్షలు, కోట్ల రూపాయలు ఉంటేనే లాకర్ తీసుకోవాలి అనే వాటిని విస్మరించి తక్కువ నగదు ఉన్నా.. బంగారు ఆభరణాలు వాటిలో దాచుకోవచ్చు. ఇంట్లో దాచుకొని బయటకు వెళితే వచ్చేంత వరకు బీరువా చూసుకొని అన్ని వస్తువులు ఉండే వరకు మనసుకు శాంతి ఉండదు. అదే వస్తువులు, నగదు బ్యాంకు లాకరులో దాచుకుంటే సురక్షితంగా ఉండవచ్చని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇవీ లాకర్ చార్జీలు... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో పట్టణ ప్రాంతాల్లో చిన్న సైజు లాకర్‌కు వార్షికంగా రూ.1,500తోపాటు జీఎస్టీ వసూలు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,000+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద సైజులో ఉన్న లాకర్‌కు అయితే వార్షికంగా రూ.9వేలు, జీఎస్టీ వరకు ఎస్బీఐ వసూలు చేస్తున్నారు. ఆంధ్రాబ్యాంక్‌లో మూడు రకాల లాకర్లు ఉన్నాయి. చిన్నసైజు లాకరు ఏడాదికి పట్టణ ప్రాంతంలో రూ.1,050, గ్రామీణ ప్రాంతాల్లో రూ.850, మీడియం సైజు లాకర్ పట్టణంలో రూ.1,750, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,450, పెద్ద సైజు లాకరుకు పట్టణ ప్రాంతంలో రూ.5,750, గ్రామీణ ప్రాంతంలో రూ.4,400 వసూలు చేస్తారు. అదనంగా జీఎస్టీ ఉంటుంది. ఏపీజీబీ చిన్నసైజు లాకరు ఏడాదికి పట్టణ ప్రాంతంలో రూ.1,500, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,000, మీడియం సైజు లాకర్ పట్టణంలో రూ.2వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,500, పెద్ద సైజు లాకరుకు పట్టణ ప్రాంతంలో రూ.3వేలు, గ్రామీణ ప్రాంతంలో రూ.2,500 వసూలు చేస్తారు. అదనంగా జీఎస్టీ ఉంటుంది. లాకర్ కీ.. ప్రతి బ్యాంకులో లాకర్‌కి రెండు తాళాలు ఉంటాయి. వినియోగదారుని వద్ద ఒక కీ మాత్రమే ఉంటుంది. మరొకటి బ్యాంకు వద్ద ఉంటుంది. లాకర్ కీ పోగొట్టుకుంటే బ్యాంక్ దాన్ని భర్తీ చేస్తుంది. సాధారణంగా బ్యాంకులు సర్వీసు చార్జీలు , లాకర్‌ను పగులగొట్టి తెరవడం లేదా మరొక కీని తయారు చేయించడం వంటి వాటికి అయ్యే ఖర్చులతో కలిపి రూ.3వేల వరకు వసూలు చేస్తాయి. వినియోగించుకోవాలి ప్రజలు లాకర్ల సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. ఎస్బీఐ బ్రాంచ్‌లలో తక్కువ రేట్లకే లాకర్ల వసతి కల్పిస్తుంది. ఎక్కువ మంది లాకర్లను వినియోగించుకోవడం లేదు. వీటిపైన అవగాహన అవసరం. – రూపేష్‌కుమార్, ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ బ్యాంకులో భద్రత ఉంటుంది ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఖాతాదారులకు లాకర్ల సౌకర్యం కల్పిస్తుంది. లాకర్లో వస్తువులు పెట్టుకుంటే భద్రత ఉంటుంది. ఏడాదికి 12 సార్లు లాకర్లను తెరుచుకొనే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఆభరణాలు పెట్టుకోవడం కన్నా బ్యాంకులో పెట్టుకోవడం చాలా మంచిది. – ఎలిశెట్టి హరీష్, ఏపీజీబీ మేనేజర్, నంద్యాల పదేళ్ల నుంచి వినియోగించుకుంటున్నాం మేము ఏపీజీబీ బ్యాంకులో జాయింట్ హోల్డర్‌తో ఖాతా తెరిచాం. పది సంవత్సరాల నుండి మేము లాకర్‌ను వినియోగించుకుంటున్నాం. బంగారు ఆభరణాలు ఇంట్లో పెట్టుకుంటే దొంగల బెడద ఉంటుందని లాకర్లోనే పెట్టుకుంటాం. లాకర్లో పెట్టుకోవడం వల్ల దొంగల బెడద ఉండదు. అన్నింటికి లాకర్‌ను ఉపయోగించుకుంటే మంచిది. – సత్యనారాయణశర్మ, లలితాంబ, దంపతులు అన్నింటికీ క్షేమం ఏపీబీజీ బ్యాంకులో చాలా సంవత్సరాలుగా లాకర్ వినియోగించుకుంటున్నాను. ఏడాదికి రూ.1500తో లాకర్ వసతి ఇస్తున్నారు. పెళ్లిళ్లకు, ఏదైన పనిపైన బయటకు వెళ్లినప్పుడు ఇంట్లో డబ్బులు, ఆభరణాలు పెట్టుకోకుండా లాకర్లో పెట్టుకుంటాం. బయటకు ఎక్కడకు వెళ్లినా దొంగల బెడద భయం ఉండదు. –చంద్రశేఖర్, నంద్యాల -
ప్రైవేట్ లాకర్లలో కోట్లాది రూపాయలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని చాందినీ చౌక్‌లో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్న లాకర్లలో భారీగా సొత్తు బయటపడింది. ఖారి బౌలి, చాందినీ చౌక్, నయా బజార్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఈ సంస్థకు చెందిన 350 లాకర్లలో డబ్బు, నగలు దాస్తుంటారు. అయితే, వ్యాపారులు పన్నులు ఎగవేసేందుకు లెక్కల్లో చూపని ఆదాయాన్ని ఇక్కడున్న సుమారు 100 లాకర్లలో దాచి ఉంటారని ఆదాయ పన్ను శాఖ(ఐటీ) అధికారులు అనుమానిస్తున్నారు. 39 లాకర్లను తెరిచి చూడగా రూ. 30 కోట్ల నగదు బయటపడిందని, దీన్ని స్వాధీనం చేసుకున్నామని సోమవారం అధికారులు తెలిపారు. మిగతా లాకర్లను కూడా తనిఖీ చేస్తామన్నారు. అయితే, ఎలాంటి అక్రమాలు, అనధికార లావాదేవీలకు పాల్పడలేదని, తమ సంస్థకు 1992లోనే ఆర్బీఐ అనుమతి లభించిందని ఆ సంస్థ నిర్వాహకుడు స్పష్టం చేశారు. -
టెన్నిస్ కోర్ట్ లాకర్లలో కోట్ల సంపద
యశవంతపుర: బెంగళూరులోని బౌరింగ్ ఇన్స్టిట్యూట్ (టెన్నిస్ కోర్ట్) పాలకమండలి కార్యాలయంలో క్రీడాకారులు టెన్నిస్ సామగ్రి, దుస్తులు దాచుకునే లాకర్లలో రూ.100 కోట్లకు పైగా విలువైన సొత్తు బయటపడింది. ఇది బెంగళూరులో స్థిరపడిన రాజస్తానీ పారిశ్రామికవేత్త, ఫైనాన్షియర్, ప్రెస్టీజ్ కంపెనీ భాగస్వామి అయిన అవినాశ్ అమరలాల్కు చెందినదిగా గుర్తించారు. బెంగళూరులో టైర్ల షోరూంను నడుపుతున్న అవినాశ్ ఏడాది క్రితం ఇక్కడ మూడు లాకర్లను తీసుకుని వాటిల్లో రూ.3.60 కోట్ల నగదు, రూ.7.8 కోట్ల విలువైన వజ్రాలు, 650 గ్రాముల బంగారు బిస్కెట్లు, రూ.80 లక్షల విలువైన వాచీలు, రూ.100 కోట్ల ఆస్తి పత్రాలు, రూ.కోటి విలువైన చెక్కులను దాచాడు. ఎందుకు బద్దలు కొట్టారు? టెన్నిస్ కోర్టు అధికారులు లాకర్ గదుల నవీకరణలో భాగంగా అవినాశ్‌కు చెందిన మూడు లాకర్లను బద్దలు కొట్టి చూడగా ఈ సొత్తు బయట పడింది. విషయం బయటకు పొక్కకుండా చేస్తే రూ.5 కోట్లు ఇస్తామంటూ బౌరింగ్ క్లబ్ కార్యదర్శి ప్రకాశ్‌కు కొందరు వ్యక్తులు ఆశ చూపారు. అయితే, ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. ఇది తమ పరిధిలోని విషయం కాదని ఖాకీలు చెప్పడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలిపారు. వారు వచ్చి సొత్తును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అవినాశ్ ఎందుకు స్పందించలేదు? పక్షం రోజుల క్రితం టెన్నిస్ కోర్టు యాజమాన్యం ఇచ్చిన నోటీసులకు అవినాశ్ స్పందించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంత సొత్తును ఇక్కడే ఎందుకు దాచారనే అంశంపైన కూడా ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు. అవినాశ్ అమరలాల్ ప్రెస్టీజ్ గ్రూప్‌లో భాగస్వామి. ఈయనకు ఫైనాన్షియర్‌గా బెంగళూరులో పెద్ద పేరుంది. బడా బాబులు, సంస్థలకు 30 శాతం వడ్డీపై అప్పులిచ్చేవాడు. -
అక్రమార్జనలో రారాజు
సాక్షి, విశాఖ క్రైం : మున్సిపాలిటీలో వెలుగులు నింపాల్సిన ఆ అధికారి అవినీతి మురుగులో పీకల్లోతున కూరుకుపోయాడు. ఉద్యోగంలో చేరింది మొదలు... అందినకాడికి వెనకేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగడంతో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టేశాడు. ఎట్టకేలకు పాపం పండడంతో అక్రమార్జనలో రారాజుగా వెలుగొందిన శ్రీకాకుళం మున్సిపాలిటీ డీఈఈ గొట్టిముక్కల శ్రీనివాసరాజుతోపాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకకాలంలో సోదాలు చేసి రూ.30 కోట్లకు పైగా అక్రమాస్తులు వెనకేసుకున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర వెల్లడించారు. బంగారమే బంగారం శ్రీనివాసరాజు ఇంటిలో సోదాల సమయంలో 423.3గ్రాముల బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు అక్కయ్యపాలెం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని లాకర్లో భార్య పేరు మీద 151.78గ్రాములు బంగారు వస్తువులు, డాబాగార్డెన్స్‌లో గల బ్యాంకు ఆఫ్ ఇండియాలో భార్య జి.రాజేశ్వరి పేరు మీద లాకర్లో 221.970 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా 795 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలు గుర్తించారు. 1548 గ్రాముల వెంటి వస్తువులు లభ్యమయ్యాయి. అదేవిధంగా నగదు రూ.12 లక్షల 27వేలు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.5లక్షల 45 వేలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వం ధర ప్రకారం రూ.1.64కోట్లు ఉంటుందని, మార్కెట్ విలువ మాత్రం రూ.30 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. గుర్తించిన అక్రమాస్తులివీ... విశాఖ నగర పరిధిలోని సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్స్న్ దరి పాపాహోం సమీపంలో గల ఆర్.ఆర్.రెసిడెన్సీలోని ప్లాట్ నెంబర్ 302లో శ్రీనివాసరాజు నివాసముంటున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఆయన ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోవలి గ్రామంలో ఎక్కువగా శ్రీనివాసరాజు భూమి కొనుగోలు చేశారు. తొలిసారిగా ఈ గ్రామంలో 6.82 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. అదే గ్రామంలో 7.2 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. తల్లి జి.స్వరాజ్యం పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 417/1, 418/1లో 3.19 ఎకరాలు భూమి కోనుగోలు చేశారు. అదే గ్రామంలో తండ్రి జి.కృష్ణంరాజు పేరు మీద సర్వే నెంబర్ 417/2, 449/2లలో వ్యవసాయ భూమి 2.69 ఎకరాలు కోనుగోలు చేశారు. శ్రీనివాస రాజు మామయ్య వి.నారాయణరాజు పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 416/1లో 2.49ఎకరాల వ్యవసాయ భూమి కోనుగోలు చేశారు. అదే గ్రామంలో సర్వే నెంబర్ 416/52, 416/3, 417 – 1,418 లో 4.71 ఎకరాలు కోనుగోలు చేశారు. శ్రీనివాసరాజు అత్తమ్మ వి.వరలక్ష్మి పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 887/1, 887/2లో 3.6ఎకరాలు భూమి కోనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం నర్శింహపురం గ్రామంలో భార్య పేరిట సర్వే నెంబర్ 75/2లో 697.44 గజాల స్థలం. అదే గ్రామంలోని సర్వే నెంబర్ 75/2లో ఖాళీ స్ధలం 7.20 ఎకరాలను కుమార్తె జి.మౌనిక పేరు మీద కోనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పెద్ద అమిరాం గ్రామంలో భార్య రాజేశ్వరి పేరు మీద సర్వే నెంబర్ 487/1, 487/2, 487/2బిలలో 697.44 గజాల స్థలం. విశాఖ జిల్లా అడవివరం గ్రామంలో భార్య జి.రాజేశ్వరి పేరు మీద సర్వే నెంబర్ 275 / 30 – ఎలో 183 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు. అలాగే శ్రీనివాస రాజు రెండు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సర్వీసులో 25 ఏళ్లకుపైగా జీవీఎంసీలోనే అవినీతి ఊబిలో కూరుకుపోయిన శ్రీనివాసరాజు తన సర్వీసులో ఎక్కువ కాలంలో జీవీఎంసీలోనే తిష్ట వేశారు. బదిలీపై వెళ్లినప్పటికీ మళ్లీ వెంటనే వెనక్కు వచ్చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని వెంప గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు జీవీఎంసీలో 1988లో వర్క్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరారు. అనంతరం 2000వ సంవత్సరంలో ఏఈగా ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి 2012 వరకు జీవీఎంసీలో ఏఈగా పనిచేశారు. 2012లో బొబ్బిలి మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లారు. అక్కడ 18 నెలలు పని చేసి మళ్లీ ఏఈగా జీవీఎంసీకి బదిలీపై వచ్చారు. అనంతరం 2017లో ఉద్యోగోన్నతి రావడంతో శ్రీకాకుళం మున్సిపాలిటీకి డీఈఈగా వెళ్లారు. అయితే జీవీఎంసీలో పనిచేసిన కాలంలో కొందరు అధికారులతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఓ ప్రజాప్రతినిధితో కలిసి బినామీల పేరున భారీగా పనులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బినామీల గుట్టు విప్పేందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
రైల్వే క్లాక్‌రూమ్, లాకర్ల ఫీజు పెంపు!
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులు లగేజీని భద్రపరచుకునే క్లాక్రూములు, లాకర్ల ఫీజులను పెంచేందుకు రైల్వేశాఖ అంగీకరించింది. ఫీజుల్ని పెంచే అధికారాన్ని డివిజినల్ రైల్వే మేనేజర్ల(డీఆర్ఎం)కు కట్టబెట్టింది. ఈ సేవల ఆధునీకరణకు త్వరలో బిడ్లు ఆహ్వానించనున్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ కొత్త విధానంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఫీజుల్ని పెంచే అధికారం డీఆర్ఎంలకు ఉంటుంది. లగేజీని గరిష్టంగా నెలరోజుల పాటు భద్రపరుస్తామని, కొత్త విధానాన్ని తొలుత ‘ఏ’ క్లాస్ రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 24 గంటల పాటు వస్తువుల్ని భద్రపరిచేందుకు క్లాక్ రూమ్‌కు రూ.15, లాకర్‌కు రూ.20 వసూలు చేస్తున్నారు. -
తేలని లెక్కలు.. తెరవని లాకర్లు...
సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరం అర్బన్ బ్యాంకులో ఎన్నో ఏళ్లుగా లాకర్లు తెరవడానికి సంబంధిత ఖాతాదారులెవరూ రావడంలేదు. వాటిలో ఏమున్నాయో తెలియడం లేదు. లాకర్ల గలవారుంటే బ్యాంకును సంప్రదించాలని అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఎవ్వరూ స్పందించలేదు. ఇక చేసేదిలేక ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని మూడు రోజుల నుంచి లాకర్లు స్థానిక అధికారులే తెరుస్తున్నారు. కొన్నింటిలో ఆభరణాలు, డాక్యుమెంట్లు బయటపడుతున్నాయి. ఇక బ్యాంకులో డిపాజిట్ చేసినవారి పరిస్థితి కూడా అలాగే ఉంది. సుమారు 13వేల మంది ముందుకు రాకపోవడంతో రూ. కోటి 20లక్షల మేరకు చెల్లింపులు నిలిచిపోయాయి. వాళ్లెవరో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. క్లియర్ చేయాలని చూస్తున్నా... 102 ఏళ్ల చరిత్రగల విజయనగరం అర్బన్ బ్యాంకు పట్టణంలో విశేష సేవలందించింది. లావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తూ పురప్రజలకు నమ్మకాన్ని కూడగట్టుకుంది. వేలాది మంది డిపాజిట్లు చేశారు. బ్యాంకు కూడా పెద్ద ఎత్తున రుణాలిచ్చింది. కానీ కాలక్రమంలో సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఖాతాదారులకు చెల్లింపులు చేయలేని దయనీయ స్థితికి దిగజారింది. తప్పని సరి పరిస్థితుల్లో ప్రభుత్వం లిక్విడేషన్‌కు నిర్ణయం తీసుకుంది. లావాదేవీలను ముగించి బాధితులకు న్యాయం చేయాలని లిక్విడేటర్‌ను నియమించింది. ఇది జరిగి ఆరేళ్లవుతున్నా డిపాజిట్ చేసినవారు ముందుకు రాకపోవడంతో ఆ తతంగం పూర్తి కావట్లేదు. ఇక లాకర్లను క్లియర్చేయాలని చూస్తున్నా చాలామంది రావడంలేదు. ఖాతాదారులకు అన్యాయం జరగకుండా... అర్బన్ బ్యాంకుకు 17వేల మంది ఖాతాదారులుండేవారు. బ్యాంకు సంక్షోభంలోకి వెళ్లిపోవడంతో ఆస్తులు, అప్పులకు పొంతనలేకుండా పోయింది. బ్యాంకు ఆస్తులు రూ. 11.34కోట్లు ఉండగా, అప్పులు రూ. 11.19కోట్లకు చేరుకుంది. పరిస్థితి దయనీయంగా ఉండటంతో 2010జూన్ 23వ తేదీన లిక్విడేషన్‌కు నిర్ణయం తీసుకున్నారు. ఆర్బన్ బ్యాంకు ఆస్తుల్ని, చెల్లింపుల్ని మదింపు చేసి ఖాతాలను ముగించాలని నిర్ణయించారు. ఇంతవరకు రూ. లక్ష లోపు డిపాజిట్ చేసిన సుమారు 3,100 మందికి రూ. 6.40కోట్లు చెల్లించారు. ఇంకా రూ. 5కోట్లు వరకు చెల్లించాల్సి ఉంది. ఇందులో 13వేల మందికి సంబంధించి లావాదేవీలను పరిష్కరించేందుకు ఇబ్బందులేర్పడ్డాయి. డిపాజిట్ చేసినవారెవరూ ముందుకు రాకపోవడంతో సుమారు రూ. కోటి 20లక్షల వరకు అన్క్లైయిమ్డ్గా ఉండిపోయింది. ఈ లావాదేవీలన్నీ 1960, 1970, 1980, 1990లో జరిగినట్టుగా భావిస్తున్నారు. వీరిలో చాలా మంది చనిపోయి ఉండొచ్చని, మరికొందరు మైగ్రేషన్ అయిపోయి ఉండొచ్చని, ఇంకొందరు బ్యాంకులో డిపాజిట్ చేసిన వాటిని మరిచిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. లాకర్లపై తొలగని సందిగ్ధం బ్యాంకులో 70లాకర్లు దశాబ్దాలుగా తెరవకుండా ఉన్నాయి. వాటిలో ఏముందో ఎవరికీ తెలియదు. ఎన్నేళ్లైనా ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం అనుమతి తీసుకుని ఇప్పుడా లాకర్లు తెరుస్తున్నారు. ఇప్పటివరకు 39 లాకర్లు తెరిచారు. కొన్నింటిలో బంగారం, మరొక దాంట్లో వెండి, ఇంకొన్నింటిలో డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ఇంకా 31లాకర్లు తెరవాల్సి ఉంది. వాటిలో ఇంకేముంటాయో చూడాల్సి ఉంది. తెరుస్తున్న లాకర్లు, అన్క్లైయిమ్డ్ డిపాజిట్లపై ఆధారాలతో ఎవరైనా వస్తే వారికి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని లిక్విడేటర్, డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి నారాయణరావు ‘సాక్షి’కి తెలిపారు. -
ఈ-లాకర్ మీకూ కావాలా?
బ్యాంకుల్లో లాకర్లు దొరకటమంటే మాటలు కాదు. బ్యాంకులు చాలా అంశాలను పరిశీలించాక కానీ వీటిని కేటాయించవు. అయితే ఇపుడు మామూలు లాకర్లతో పాటు ఇంటర్నెట్ లాకర్లూ అవసరమవుతున్నాయి. డిజిటల్ రూపంలో ఉండే పత్రాలను దాచుకోవటానికి బోలెడన్ని వెబ్సైట్లు, గూగుల్ డ్రైవ్, డ్రాప్‌బాక్స్‌ల వంటివి ఉన్నా... వాటిల్లో సెక్యూరిటీ బాగానే ఉన్నా... అవన్నీ ప్రయివేటు సంస్థలు ఆఫర్ చేస్తున్నవే. అందుకే తొలిసారి మన కేంద్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా డిజిటల్ లాకర్‌ను అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్లాకర్.జీఓవీ.ఇన్ లేదా ఈలాకర్.జీవోవీ.ఇన్‌లోకి లాగిన్ కావటం ద్వారా ఈ లాకర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ లాకర్ తెరవటానికి కనీస నిబంధన ఏంటంటే... ఆధార్ నంబరు కలిగి ఉండటం. ఆ సైట్లో మీ ఆధార్ నంబరు ఎంటర్ చేయగానే... ఆటోమేటిగ్గా ఒన్ టెమ్ పాస్వర్డ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వస్తుంది. అంటే ఆ ఆధార్ నంబరు మీదో, కాదో తెలుసుకోవటానికి ఒక రకమైన చెకింగ్ అన్న మాట. ఆ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయటం ద్వారా లాకర్ ఆరంభించవచ్చు. అక్కడే మీరు మీ దగ్గరున్న డిజిటల్ పత్రాలను అప్లోడ్ చేయొచ్చు. విద్యార్హతల సర్టిఫికెట్లు, ప్రభుత్వ ఐడీ కార్డులు, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, టెలిఫోన్ - వాటర్ - కరెంటు బిల్లులు, రేషన్ కార్డు, ఆస్తిపన్ను రిసీట్లు... ఇలా డిజిటల్ రూపంలో ఉండే పత్రాల్ని దీన్లో దాచుకోవచ్చు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం 10 ఎంబీ స్టోరేజీ సౌకర్యం మాత్రమే కల్పిస్తోంది. దీన్ని మెల్లగా 1 జీబీకి పెంచాలన్నది ప్రభుత్వ యోచన. అయితే ప్రస్తుతం దీన్లో పీడీఎఫ్, జేపీజీ, జేపెగ్, పీఎన్జీ, బీఎంపీ, జీఐఎఫ్ తరహా ఫైళ్లను, అందులోనూ ఒక ఎంబీ మించని ఫైళ్లను మాత్రమే దాచుకునే అవకాశం ఉంది. ఇంకో చక్కని ఫీచర్ ఏంటంటే... దీన్లో మీరు దాచుకున్న ఫైళ్లలో దేన్నయినా, ఎవరికైనా పంపాలనుకుంటే షేర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అక్కడుండే షేర్ లింకును ప్రెస్ చేయటం ద్వారా... మీరు పంపాలనుకున్న ఈ మెయిల్‌ను ఎంటర్ చేసే లింకు ప్రత్యక్షమవుతుంది. అక్కడ పంపాల్సిన మెయిల్ ఐడీని రాసి, పంపాలనుకున్న ఫైల్‌ను క్లిక్ చేస్తే సరి. -
బ్యాంకు దోపిడీకి విఫలయత్నం
మునగపాక ఎస్బీఐలో ఘటన లాకర్లలో ఆభరణాలు, నగదు సురక్షితం క్లూస్ టీమ్ వివరాల సేకరణ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మునగపాక : స్థానిక స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఇద్దరు యువకులు చోరీకి విఫలయత్నం చేశారు. బ్యాంక్‌లో చోరీ జరిగిందన్న ప్రచారంతో ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు. బ్యాంక్ అధికారులు, పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆభరణాలు గాని నగదుకాని చోరీ జరగలేదని ప్రకటించారు. వివరాలివి... మునగపాక మెయిన్ రోడ్డు పక్కనే ఎస్బీఐ బ్రాంచి ఉంది. ఈ నెల 28న రాత్రి 7 గంటల సమయంలో బ్రాంచ్ మేనేజర్ సుబ్రహ్మణ్యంతోపాటు సిబ్బంది బ్యాంక్‌కు తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. 29న వినాయక చవితి సెలవు కావడంతో తెరవలేదు. 30న ఉదయం 9.15 గంటలకు బీఎంతో పాటు అకౌంటెంట్ ఉమామణి మెయిన్‌గేటు తెరిచి లోపలికి వెళ్లారు. లోపల ఉన్న సర్వర్‌ను ఆన్‌చేసి వస్తుండగా లాకర్లు ఉన్న గది తెరిచి ఉండడాన్ని గమనించి ఒక్కసారిగా బీఎం ఆందోళనకు గురయ్యారు. అకౌంటెంట్‌ను పిలిచి ముందురోజు లాకర్ గదికి తాళాలు వేయడం మరిచారా అని వాకబు చేశారు. ఆమె తాళాలు వేశామని చెప్పడంతో చోరీ జరిగిందని భావించి హుటాహుటీన స్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకొని ఎస్ఐ రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ తన సిబ్బందితో బ్యాంక్‌కు చేరుకున్నారు. లాకర్ గది తాళాలు తీసి కింద పడేసిన విషయాన్ని గమనించి దొంగలు ప్రవేశించారని నిర్ధారించారు. పోలీసుల సమక్షంలో బ్యాంక్ సిబ్బంది అన్ని లాకర్లు తెరిచి చూడగా నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురికాలేదని నిర్ధారించుకున్నారు. సీసీ పుటేజ్ ఆధారంగా వివరాలు... ఎస్బీఐలో చోరీకి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు బ్యాంకుకు దక్షిణ దిశలో ఉన్న కిటికీని గునపాంతో పెకిలించి లోపలికుప్రవేశించారు. క్యాషియర్ రూమ్‌లో ఉన్న ఆలారం కనెక్షన్ తొలగించారు. అనంతరం లాకర్లు ఉన్న గది గేటుకున్న తాళం కప్పలను గునపంతో పెకిలించివేశారు. అదే సమయంలో ఓ దుండగుడు సీపీ కెమెరాను విరగ్గొట్టాడు. దీంతో ఆ తరువాతం ఏం జరిగిందన్న విషయం సీసీ పుటేజీలో కానరాలేదు. అనుభవం ఉన్న దొంగలపనే... ఇది చోరీల్లో అనుభవం ఉన్న వ్యక్తుల పనేనని క్లూస్‌టీమ్ ఇన్స్పెక్టర్ శ్రీనగేష్ తెలిపారు. ఎటువంటి అనవాళ్లు తెలియకుండా ఇద్దరు వ్యక్తులు ముఖాలకు గుడ్డలు కప్పుకొని, కాళ్ల కు సాక్సులు ధరించి బ్యాంకులోకి ప్రవేశిం చినట్టు గుర్తులు ఉన్నాయని చెప్పారు. ఆ ఇద్దరి వయస్సు 32 నుంచి 35 ఏళ్లు ఉండవచ్చన్నారు. 27న అర్ధరాత్రి దాటిన తరువాత 1.40 గంటలకు దొంగలు బ్యాంకులో చోరీకి యత్నించారని సీసీ పుటేజీలో గుర్తించామన్నారు. ఖాతాదారులు ఆందోళన వద్దు.. బ్యాంక్‌లో చోరీ జరిగిందన్న విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో ఖాతాదారులు శనివారం బ్యాంక్‌కు చేరుకున్నారు. తమ ఆభరణాలు జాగ్రత్తగా ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ ఖాతాదారులెవరూ ఆందోళన చెందవద్దని, నగదు, ఆభరణాలు లాకర్లలో భద్రంగా ఉన్నాయని చెప్పారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చోరీ విషయం తెలుసుకున్న అనకాపల్లి రూరల్ సీఐ భూషణం నాయుడు మునగపాక ఎస్బీఐకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. చోరీకి యత్నించిన వ్యక్తులను వదిలేదిలేదన్నారు. పోలీస్ సైరన్ వల్లే దొంగల పరారీ... దొంగలు బ్యాంకులో చోరీకి ప్రయత్నిస్తున్న సమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది వాహనం సైరన్ మోగించుకుంటూ వెళ్లడం వల్లే దొంగలు భయపడి పరారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.