కోల్‌కత్తా : చదివేది ఎల్‌కేజీ, యూకేజీ అయినా కేజీల కొద్దీ పుస్తకాలను మోయలేక చిన్నారులు పడే అవస్థలు వర్ణనాతీతం. ఈ మోత బరువుకు లేత వయసులోనే వారి నడుములు దెబ్బతింటున్నాయి. అనేక శారీరక సమస్యలకూ దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో లాకర్ సౌకర్యం కల్పించనుంది. దీంతో పిల్లలకు మోత బరువు నుంచి కాస్తయినా ఉపశమనం కలగనుంది.
పశ్చిమబెంగాల్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు బండెడు బరువుతో కూడిన పుస్తకాల సంచులను మోసే రోజులు త్వరలో కనుమరుగవనున్నాయి. సర్కారు బడుల్లో పుస్తకాల కోసం లాకర్ సౌకర్యం కల్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమే దీనికి కారణం. దీనికోసం పాఠశాల ప్రాంగణాల్లో ప్రభుత్వం స్థలం కేటాయించనుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ గురువారం వెల్లడించారు. ‘ఈ లాకర్లు అందుబాటులోకి వస్తే విద్యార్థులకు సంచుల భారం నుంచి విముక్తి కలుగుతుంది. తమ పుస్తకాలు, ఇతర సామగ్రిని రోజూ వారు ఇంటికి తీసుకెళ్లి మళ్లీ మోసుకొచ్చే అవసరం ఉండదు. అవసరమైన పుస్తకాలను ఇంటికి తీసుకెళితే సరిపోతుంది’అని పార్థ చెప్పారు.
నర్సరీ నుంచి పదో తరగతి పాఠశాలలకు ఈ వెసులుబాటు కల్పిస్తామన్నారు. అయితే ఎయిడెడ్ పాఠశాలలకు ఇది వర్తించబోదన్నారు. నిధుల కొరతే ఇందుకు కారణమన్నారు. నగరంలోని హిందు, హరే అండ్ బెథూన్ తదితర పాఠశాలల్లో ఇప్పటికే ఈ వసతి కల్పించినట్లు చెప్పారు. ఈ లాకర్ విధానం వల్ల పశ్చిమబెంగాల్లో కనీసం 1.5 కోట్ల మంది విద్యార్థులకు మోత బరువు నుంచి విముక్తి కలగనుంది. కాగా, ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాకర్లు అందుబాటులోకి వస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా, అమెరికా, జపాన్ లాంటి కొన్ని దేశాల్లో పిల్లల పుస్తకాల కోసం ఇలాంటి లాకర్ వసతి చాలా స్కూళ్లలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment