రాజస్తాన్‌లోని జైపూర్ గణపతి ప్లాజా ప్రైవేటు లాకర్లలో మళ్లీ లక్షల్లో బ్లాక్ మనీ దొరికింది. ఆ లాకర్లలో కోట్లాది రూపాయల నల్ల డబ్బు దాచారన్న ఆరోపణల నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు.
శుక్రవారం ఇక్కడికి చేరుకున్న ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల బృందం రైడ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఒక లాకర్‌లో రూ.7.5 లక్షల అనధికార సొమ్మును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో లాకర్‌లోనూ భారీగా నగదును గుర్తించారు. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోంది. అధికారులు మరిన్ని లాకర్లను తెరవనున్నారు.
అదంతా పేపర్‌లీక్ సొమ్ము
రాజస్తాన్‌లో గత డిసెంబర్‌లో గ్రేడ్-2 టీచర్ నియామకానికి సంబంధించిన పేపర్‌లీక్ ఉదంతం బయటపడింది. 37 మంది అభ్యర్థులు సహా మొత్తం 55 మంది నిందితులు అరెస్టయ్యారు. కాగా ఈ పేపర్‌లీక్ ద్వారా సంపాదించిన అక్రమ సొమ్మునంతా జైపూర్ గణపతి ప్లాజా ప్రైవేటు లాకర్లలో దాచారని ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు కిరోరిలాల్ మీనా సంచలన ఆరోపణలు చేశారు.
ఇప్పటిదాకా రూ.7 కోట్ల నగదు, 12 కేజీల బంగారం
జైపూర్ గణపతి ప్లాజాలో మొత్తం 1100 లాకర్లు ఉన్నాయి. గత అక్టోబర్ 17న చేసిన సోదాల్లో రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్న ఆదాయపు పన్ను శాఖ బృందం.. అక్టోబర్ 21న చేపట్టిన సోదాల్లో ఏకంగా రూ.2.46 కోట్లు స్వాధీనపరుచుకున్నారు. ఆ లాకర్లు నుంచి ఇప్పటిదాకా రూ.7 కోట్లకు పైగా నగదు, 12 కేజీలకు పైగా బంగారాన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ స్వాధీనం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment