దాచుకో పదిలంగా.. | Bank Provide Locker Facility To People In Kurnool District | Sakshi
Sakshi News home page

దాచుకో పదిలంగా..

Published Thu, Dec 12 2019 8:31 AM | Last Updated on Thu, Dec 12 2019 8:32 AM

Bank Provide Locker Facility To People In Kurnool District - Sakshi

సాక్షి, నంద్యాల: అక్టోబర్‌ 19వ తేదీన ఇంటికి తాళం వేసి బంధువుల అంత్యక్రియలకు వెళ్లిన డిప్యూటీ తహసీల్దార్‌ రమాదేవి ఇంట్లో దొంగలు పడి 40తులాల బంగారు, రెండు కేజీల వెండి, రూ.2లక్షల నగదు అపహరించారు.  8  నవంబర్‌ 29వ తేదీన కర్నూలు శివారులో ఉన్న రామచంద్రనగర్, రామకృష్ణనగర్, వాసవీ నగర్‌లలో పట్టపగలే దొంగలు హల్‌చల్‌ చేసి దోపిడీకి పాల్పడ్డారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా మూడు ఇళ్లను లూఠీ చేశారు. ఈ చోరీలో 11తులాల బంగారం, 750గ్రాముల వెండి, రూ.1.70లక్షల నగదు అపహరించారు.ఎమ్మిగనూరు పట్టణంలోని వాల్మీకి సర్కిల్‌ వద్ద నవంబర్‌ 13వ తేదీన కిసాన్‌ మాల్‌లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. షాపు షెట్టర్లు తొలగించి లోనికి జొరబడి రూ.1.29లక్షల నగదుతో ఉడాయించారు.

...ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో ఏదో ఒక చోట వారంలో రెండుమూడు చోరీలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చోరీలు జరుగుతున్నా ప్రజలు..బ్యాంకుల్లో ఉన్న లాకర్ల వసతిని వినియోగించుకోవడం లేదు. లక్షలు, కోట్ల రూపాయలు ఉంటేనే లాకర్‌ తీసుకోవాలి అనే వాటిని విస్మరించి తక్కువ నగదు ఉన్నా.. బంగారు ఆభరణాలు వాటిలో దాచుకోవచ్చు. ఇంట్లో దాచుకొని బయటకు వెళితే వచ్చేంత వరకు బీరువా చూసుకొని అన్ని వస్తువులు ఉండే వరకు మనసుకు శాంతి ఉండదు. అదే వస్తువులు, నగదు బ్యాంకు లాకరులో దాచుకుంటే సురక్షితంగా ఉండవచ్చని బ్యాంకర్లు చెబుతున్నారు. 

ఇవీ లాకర్‌ చార్జీలు... 

  • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో పట్టణ ప్రాంతాల్లో చిన్న సైజు లాకర్‌కు వార్షికంగా రూ.1,500తోపాటు జీఎస్‌టీ వసూలు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,000+ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద సైజులో ఉన్న లాకర్‌కు అయితే వార్షికంగా రూ.9వేలు, జీఎస్‌టీ వరకు ఎస్‌బీఐ వసూలు చేస్తున్నారు.  
  • ఆంధ్రాబ్యాంక్‌లో మూడు రకాల లాకర్లు ఉన్నాయి. చిన్నసైజు లాకరు ఏడాదికి పట్టణ ప్రాంతంలో రూ.1,050, గ్రామీణ ప్రాంతాల్లో రూ.850, మీడియం సైజు లాకర్‌ పట్టణంలో రూ.1,750, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,450, పెద్ద సైజు లాకరుకు పట్టణ ప్రాంతంలో రూ.5,750, గ్రామీణ ప్రాంతంలో రూ.4,400 వసూలు చేస్తారు. అదనంగా జీఎస్‌టీ ఉంటుంది.   
  • ఏపీజీబీ చిన్నసైజు లాకరు ఏడాదికి పట్టణ ప్రాంతంలో రూ.1,500, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,000, మీడియం సైజు లాకర్‌ పట్టణంలో రూ.2వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,500, పెద్ద సైజు లాకరుకు పట్టణ ప్రాంతంలో రూ.3వేలు, గ్రామీణ ప్రాంతంలో రూ.2,500 వసూలు చేస్తారు. అదనంగా జీఎస్‌టీ ఉంటుంది.

లాకర్‌ కీ.. 

  • ప్రతి బ్యాంకులో లాకర్‌కి రెండు తాళాలు ఉంటాయి. వినియోగదారుని వద్ద ఒక కీ మాత్రమే ఉంటుంది. మరొకటి బ్యాంకు వద్ద ఉంటుంది. లాకర్‌ కీ పోగొట్టుకుంటే బ్యాంక్‌ దాన్ని భర్తీ చేస్తుంది.  సాధారణంగా బ్యాంకులు సర్వీసు చార్జీలు , లాకర్‌ను పగులగొట్టి తెరవడం లేదా మరొక కీని తయారు చేయించడం వంటి వాటికి అయ్యే ఖర్చులతో కలిపి రూ.3వేల వరకు వసూలు చేస్తాయి. 

వినియోగించుకోవాలి
ప్రజలు లాకర్ల సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. ఎస్‌బీఐ బ్రాంచ్‌లలో తక్కువ రేట్లకే లాకర్ల వసతి కల్పిస్తుంది. ఎక్కువ మంది లాకర్లను వినియోగించుకోవడం లేదు. వీటిపైన అవగాహన అవసరం.  – రూపేష్‌కుమార్, ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌

బ్యాంకులో భద్రత ఉంటుంది
ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఖాతాదారులకు లాకర్ల సౌకర్యం కల్పిస్తుంది. లాకర్‌లో వస్తువులు పెట్టుకుంటే భద్రత ఉంటుంది. ఏడాదికి 12 సార్లు లాకర్లను తెరుచుకొనే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఆభరణాలు పెట్టుకోవడం కన్నా బ్యాంకులో పెట్టుకోవడం చాలా మంచిది.  – ఎలిశెట్టి హరీష్, ఏపీజీబీ మేనేజర్, నంద్యాల  

పదేళ్ల నుంచి వినియోగించుకుంటున్నాం
మేము ఏపీజీబీ బ్యాంకులో జాయింట్‌ హోల్డర్‌తో ఖాతా తెరిచాం. పది సంవత్సరాల నుండి మేము లాకర్‌ను వినియోగించుకుంటున్నాం. బంగారు ఆభరణాలు ఇంట్లో పెట్టుకుంటే దొంగల బెడద ఉంటుందని లాకర్‌లోనే పెట్టుకుంటాం. లాకర్‌లో పెట్టుకోవడం వల్ల దొంగల బెడద ఉండదు. అన్నింటికి లాకర్‌ను ఉపయోగించుకుంటే మంచిది. – సత్యనారాయణశర్మ, లలితాంబ, దంపతులు  

అన్నింటికీ క్షేమం
ఏపీబీజీ బ్యాంకులో చాలా సంవత్సరాలుగా లాకర్‌ వినియోగించుకుంటున్నాను. ఏడాదికి రూ.1500తో లాకర్‌ వసతి ఇస్తున్నారు. పెళ్లిళ్లకు, ఏదైన పనిపైన బయటకు వెళ్లినప్పుడు ఇంట్లో డబ్బులు, ఆభరణాలు పెట్టుకోకుండా లాకర్‌లో పెట్టుకుంటాం. బయటకు ఎక్కడకు వెళ్లినా దొంగల బెడద భయం ఉండదు. –చంద్రశేఖర్, నంద్యాల
 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement